టికెట్లపై తకరారు!
ABN, Publish Date - Dec 31 , 2023 | 03:44 AM
గుట్టు చప్పుడు కాకుండా.. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసిన సీఎం జగన్..
అధిష్ఠానం తీరుపై సిట్టింగ్‌లు కస్సు.. తిరుగుబాటుపై ‘తాడేపల్లి’లో ఆందోళన
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గుట్టు చప్పుడు కాకుండా.. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసిన సీఎం జగన్.. అభ్యర్థుల మలి జాబితా విడుదలకు సాహసించలేకపోతున్నారు. సిట్టింగ్‌లపై వేటు, అసెంబ్లీ స్థానాల మార్పుతో నేతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దీంతో రెండో జాబితాపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. తొలిదశ తరహాలోనే మలి జాబితా కూడా ఉంటుందని.. సర్వేల ఆధారంగా ఓడిపోయే సిట్టింగ్‌ల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన ఎమ్మెల్యేల్లో అలజడి రేపింది. ఎన్నికల సమయలో అసంతృప్తులు సహజమేనని.. పార్టీలో ఉండాలనుకునేవారు ఉండొచ్చు.. లేదంటే పోవచ్చని సజ్జల అన్న మాటలు అగ్గిరాజేశాయి. అభ్యర్థుల విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ధిక్కరించేవారు ఉండరని మొదట భావించారు. కానీ తొలిదఫాలో 11 మంది ఇన్‌చార్జులను మార్చినప్పుడే తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే.. ఒక్కసారిగా తిరుగుబాటు వచ్చేస్తుందేమోనన్న ఆందోళన సీఎం శిబిరంలో కనిపిస్తోంది. మంత్రులు, సీనియర్ నేతలని చూడకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై జగన్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలు తాడేపల్లి వస్తున్నారు. వారికి ఆయన దర్శన భాగ్యం కలగడం లేదు. నిలదీతలు ఎదురవుతాయన్న భయంతోనే తన బహిరంగ సభలను సిట్టింగ్‌లను కొనసాగించే అసెంబ్లీ స్థానాల్లోనే జగన్ నిర్వహిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
షర్మిల ఎఫెక్ట్...
వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేని వైసీపీ ఎమ్మెల్యేలు.. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే... ఆమె వెంట నడిచేందుకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. మళ్లీ పోటీచేయాలనుకుంటే రూ.20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు డిపాజిట్ చేయాలని సిటింగ్‌లకు సీఎం జగన్ ఆదేశిస్తుండటంతో... ఓడిపోయే స్థానానికి డబ్బులెందుకు ఖర్చుచేయాలని వారు భావిస్తున్నారు. ఇంకొందరు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల చేయాలనుకున్న అభ్యర్థుల రెండో జాబితాను జనవరి 2 లేదా 3వ తేదీకి జగన్ వాయిదా వేసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కినా దక్కకపోయినా సిట్టింగ్‌లు సహా పార్టీ నేతలెవరూ బహిరంగంగా మాట్లాడొద్దని జగన్ హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిరసన గళమెత్తిన కొందరు ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి తాఖీదులు అందాయి. వారు అక్కడకు వెళ్లి వచ్చాక నోరెత్తడం లేదు.
తాడేపల్లి చుట్టూ చక్కర్లు
జగన్ దర్శనం దొరకనప్పటికీ.. పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి సీఎంవోకు తరలివస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పంచాయితీ ఇంకా తెగలేదు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ఈ దఫా టికెట్ ఉండదని ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన శుక్రవారం తాడేపల్లి వచ్చి.. తన స్థానంలో తన అనుచరుడైన బీసీ నేత మాచాని వెంకటేశ్‌కు టికెట్ ఇవ్వాలని.. దగ్గరుండి గెలిపించుకుంటానని ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. ఇందుకు నాయకత్వం అంగీకరించిందని ప్రచారం జరిగింది. అయితే ఇది ఇంకా తేలలేదు. చెన్నకేశవరెడ్డి శనివారం కూడా సీఎంవోకు వచ్చారు. తానే పోటీచేస్తానని చెప్పారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కూడా శనివారం సీఎంవోకు వచ్చారు.
Updated Date - Dec 31 , 2023 | 03:44 AM