ముక్కోటికి సర్వం సిద్ధం
ABN, Publish Date - Dec 22 , 2023 | 02:29 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వారాలు తెరుచుకోనున్నాయి. 12 గంటల నుంచి 1.45 గంటల
నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి ఆలయంలో తెరుచుకోనున్న వైకుంఠద్వారాలు
తిరుమల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వారాలు తెరుచుకోనున్నాయి. 12 గంటల నుంచి 1.45 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వీఐపీ బ్రేక్ దర్శనాలు మొదలుకానున్నాయి. ఆ తర్వాత సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనాలను కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్లను కేటాయించిన టీటీడీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా ఉచిత స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లను జారీ చేయనుంది. పదిరోజుల కోటా పూర్తయ్యే వరకు టోకెన్లను జారీ చేస్తారు. అయితే గురువారం సాయంత్రం నుంచే కొన్ని కౌంటర్ల వద్ద భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శుక్రవారం వేకువజాము నుంచే టోకెన్లను జారీ చేయాలనే ఆలోచనలో టీటీడీ ఉంది. దీనికి తగిన విధంగా కౌంటర్ల వద్ద కంప్యూటర్లను, సిబ్బందిని టీటీడీ ఐటీ విభాగం గురువారం రాత్రికే సిద్ధం చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని విద్యుత్, పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
Updated Date - Dec 22 , 2023 | 02:29 AM