పోలిపల్లి వేదిక నుంచే ఎన్నికల శంఖారావం
ABN, Publish Date - Dec 17 , 2023 | 04:48 AM
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో 20న నిర్వహించనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభా వేదికపై నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
20న యువగళం ముగింపు సభ
అధికార వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైంది
ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే విజయం: అచ్చెన్న
విశాఖపట్నం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో 20న నిర్వహించనున్న యువగళం పాదయాత్ర ముగింపు సభా వేదికపై నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. పోలిపల్లి సభకు 6లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైందని, సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తులు పార్టీని వీడుతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకోసం పోలిపల్లిలో నిర్వహిస్తున్న యువగళం ముగింపు సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. ఈ సభలో టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని భావించామని, అయితే చంద్రబాబు అరెస్టు, తదితర పరిణామాలతో మేనిఫెస్టో రూపకల్పనలో స్వల్ప జాప్యం జరిగిందని తెలిపారు. త్వరలో రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు మరో సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలు ఇప్పుడు జరిపినా సిద్ధంగా ఉన్నామని, టీడీపీ విజయం కూడా ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - Dec 17 , 2023 | 04:48 AM