పైపైకి కూరగాయల ధరలు
ABN, Publish Date - Dec 14 , 2023 | 01:34 AM
కూరగాయల ధరలు వామ్మో అనిపిస్తున్నాయి. అదీ, ఇదీ అని లేదు దాదాపు అన్ని కూరగాయల ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది.
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 12 : కూరగాయల ధరలు వామ్మో అనిపిస్తున్నాయి. అదీ, ఇదీ అని లేదు దాదాపు అన్ని కూరగాయల ధరల్లోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు ... ఇలా ఏ కాయగూర అయినా ధర బేజారెత్తిస్తోంది. కూరల్లో సామాన్యులు ఎక్కువగా వినియోగించే వంకాయల ధరలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఎక్కువ డిమాండ్ ఉన్న దొమ్మేరు రకంతో పాటు తెలుపుచార, గులాబీ రకాలు కూడా ధరలో పోటీ పడుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కొన్ని రకాలు కిలోకు దాదాపుగా రూ.10 నుంచి రూ.12ల వరకూ ధరలు పెరగడం గమనార్హం. రాజమహేంద్రవరంలోని రైతు బజార్లలో ఈనెల 5వ తేదీన దొమ్మేరు రకం కిలో రూ.60లు ఉంటే, ఈ నెల 12వ తేదీన మంగళవారం కిలో రూ.68లకు చేరింది. తెలుపుచార రూ.54లకు, గులాబీ రూ.64లకు విక్రయిస్తున్నారు. అలాగే, బీరకాయలు రూ.36 నుంచి రూ.54లకు, దొండకాయలు రూ.34 నుంచి రూ.36లకు, బెండకాయలు రూ.38 నుంచి రూ.48లకు చేరాయి. ఇక దోసకాయలు రూ.20 నుంచి రూ.32లకు పెరగ్గా, కాకరకాయలు రూ.30 నుంచి రూ.36లకు పెరిగాయి. టమోటా ధర మాత్రం కాస్త నిలకడగా ఉంది. కొద్దిరోజులుగా రైతుబజార్లలో కిలో రూ.26-రూ.28 మధ్య నడుస్తోంది. ఇక గోరుచిక్కుళ్లు, పొట్లకాయ, బీన్స్ గింజలు, బొబ్బర్లు, పెండ్లం, ఆకాకరకాయ తదితర కూరగాయల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో సాధారణ ప్రజానీకంతో పాటు మధ్య తరగతి వర్గాలు కూడా కూరగాయలు కిలోల చొప్పున కొనే పరిస్థితి కనిపించడంలేదు. సహజంగా ప్రతి ఏటా కార్తీకమాసంలో కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. ఈ సీజన్‌లో చాలా మంది అయ్యప్పమాలలు, భవానీదీక్షలు చేపట్టడంతో నాన్ వెజ్ కంటే వెజిటేరియన్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీంతో కూరగాయల ధరలకు కూడా రెక్కలు వస్తాయి. కానీ కార్తీకమాసం వెళ్లిపోయినా కూరగాయల ధరలు ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకం పరిస్థితి ఏం కొనాలి, ఏం తినాలి అన్నట్టుగా మారింది. అరకొర జీతాలతో సంసార నౌకను లాగించే చిరుద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోజు గడవడం కష్టతరంగా మారిందనే చెప్పాలి. ప్రభుత్వోద్యోగుల్లో చాలా మందికి 12వ తేదీ దాటినా జీతాలు పడకపోవడంతో చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కిలో కొనే చోట పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. కూరగాయల ధరలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశం లేదని రైతులు, వ్యాపారులు చెబుతున్న నేపథ్యంలో సాధారణ, మధ్యతరగతి జీవులకు మరికొన్నాళ్లపాటు ధరాఘాతం తప్పదని అనిపిస్తుంది.
Updated Date - Dec 14 , 2023 | 01:34 AM