నగరంలో కుంగిన రోడ్డు
ABN, First Publish Date - 2023-12-11T00:34:30+05:30
రాజమహేంద్రవరం గోరక్షణ పేటలో మెయిన్ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అటుగా వెళ్ళే వారు భయాందోళనకు గురయ్యారు.
భయాందోళనకు గురైన స్థానికులు
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 10: రాజమహేంద్రవరం గోరక్షణ పేటలో మెయిన్ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అటుగా వెళ్ళే వారు భయాందోళనకు గురయ్యారు. అయితే రోడ్డు కుంగినప్పుడు దానిపై ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రాజమహేంద్రవరంలో మురుగునీరు పంప్ చేసి పైప్‌లైన్ ద్వారా ఆవలోని ఎస్‌టీపీ ప్లాంట్‌కు పంపిస్తారు. దీనికోసం రాజమహేంద్రవరం ఆర్యాపురం నుంచి ఆవలోని ఎస్‌టీపీ ప్లాంట్ వరకు ఒక పైప్‌లైన్ ఉంది. ఇది కంబాలచెరువు, దానవాయిపేట, గోరక్షణ పేట మీదుగా ఉంది. ఈ పైప్‌లైన్‌కు చిల్లుపడి లీకేజీ అవుతోంది. ఇటీవల తుఫాన్ సమయంలో లీకైజి మరింత పెరిగింది. దీంతో గోరక్షణ పేటలో రోడ్డు కింద భాగాన పైప్ లైన్ చుట్టుపక్కల డొల్లతనం ఏర్పడి ఆదివారం అకస్మాత్తుగా కుంగిపోయింది. మునిసిపల్ అధికారులు కర్రలను పాతి రోడ్డును బ్లాక్ చేశా రు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పైప్‌లైన్ పగిలి పెద్ద గొయ్యిపడింది. మళ్లీ ఇప్పుడు పడింది.సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో కార్పొరేషన్ నిర్లక్ష్యం కారణంగానే పదేపదే అదే సమస్య ఉత్పన్నమవుతోంది. పైగా వేసిన రోడ్డు కూడా లేయర్లుగా కనిపించడం ముక్కలుగా ఊడిపోవడం నాణ్యత లోపాలకు అద్దంపడుతుంది.
ఇదీ..జగన్ వేయించిన రోడ్ల నాణ్యత
ఈ ప్రభుత్వంలో రోడ్డుపై ప్రయాణం ప్రమాదమే : అనుశ్రీ
జగన్ వేయించిన రోడ్లపై ప్రయాణం చేయాలంటే చాలా రిస్క్ చేయాలని జనసేన రాజమహేంద్రవనం ననియోజకవర్గ ఇన్‌చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. గోరక్షణపేటలో రోడ్డు కుంగి గొయ్యిపడిన ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో రోడ్లు మొత్తం దారుణంగా మారిపోయాయని.. రోడ్లపై ప్రజలు నడవాలంటేనే ప్రాణసంకటంగా మారిందని మండిపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఇంత భారీ గొయ్యిపడడం ఇది రెండో సారి అన్నారు. రోడ్డు నాణ్యతపై ఇంజనీర్లతో క్వాలిటీ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. మళ్లీ మళ్లీ సమస్య ఉత్ప న్నం కాకుండా పూర్తి నాణ్యతతో రోడ్డు వేయాలన్నారు. ఆయన వెంట జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ వైవీడీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ, నగర కార్యదర్శులు అల్లాటి రాజు, విన్నా వాసు, జనసేన యువనాయకులు బయ్యపునీడి సూర్య, సింహాద్రి విక్టరీ వాసు ఉన్నారు.
Updated Date - 2023-12-11T00:34:34+05:30 IST