మళ్లీ ఎమ్మెల్యే వేగుళ్ల అరెస్టు
ABN, First Publish Date - 2023-11-10T00:26:36+05:30
కేశవరం కుర్రా వారి కొండలో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన అంశంపై గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మండపేట, నవంబరు 9: కేశవరం కుర్రా వారి కొండలో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన అంశంపై గురువారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మరోసారి కేశవరం కుర్రా వారి గ్రావెల్ కొండ తవ్వకాలను పరిశీలించేందుకు బయలుదేరగా మండపేట పట్టణ పోలీసులు గురవారం మధ్యాహ్నం ఇంటి వద్ద అరెస్టు చేసి పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వేగుళ్ల తన అరెస్టును ఖండించారు. తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవటం దారుణమైన చర్యని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాలు మట్టి తరలింపు ప్రదేశాలను పరిశీలిస్తామంటే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆదేశాలతో పోలీసులు టీడీపీ, జనసేన నాయకులను వెళ్లకుండా అడ్డుకోవటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసలు అక్కడ జరుగుతున్నదేమిటి, తవ్వకాలు చేస్తున్న గ్రావెల్ అసలు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్తుందో అడిగితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. గ్రావెల్ తవ్వకాలు జరిగే ప్రదేశానికి వెళ్లకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని లబ్ధిదారులను రెచ్చగొడుతున్న తోట తీరును తప్పుపట్టారు. ప్రభుత్వ అనుమతులు పొందినప్పుడు ఆ గ్రావెల్ ఎక్కడికి వెళ్తుందనే విషయం పరీశీలించేందుకు తమను ఎందుకు అనుమతించటం లేదని ఆయన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరుసగా తనను మూడో రోజు కూడా హౌస్ అరెస్టు చేయడంతో పాటు బయటకు వెళ్లకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గ్రావెల్‌ను ప్రభుత్వ రహదారులు, జగనన్న లేఅవుట్‌లకు తరలిస్తున్నామన్న ముసుగులో ఎమ్మెల్సీ తోట గ్రావెల్‌ను తవ్వి బయటకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పనులకు తరలిస్తున్నప్పుడు వివరాలు ఇస్తే తప్పేంటని వేగుళ్ల ప్రశ్నించారు. ఇక్కడ ప్రభుత్వ పనుల ముసుగులో సాగుతున్న బాగోతం బయట పడుతుందనే భయంతో తమను కేశవరం వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా తాము కేశవరం వెళ్లి తీరుతామని అన్నారు. పట్టణ పోలీసుస్టేషన్‌లో రామచంద్రపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కె ప్రసాద్, దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Updated Date - 2023-11-10T00:26:37+05:30 IST