శివోహం..
ABN, First Publish Date - 2023-11-15T00:12:46+05:30
పవిత్ర కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా జిల్లాలోని గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజామున వేలాది మంది మహిళలు గోదావరి రేవులకు చేరుకుని పుణ్యస్నానాలు చేశారు.
రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు/బిక్కవోలు, నవంబరు 14 : పవిత్ర కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా జిల్లాలోని గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజామున వేలాది మంది మహిళలు గోదావరి రేవులకు చేరుకుని పుణ్యస్నానాలు చేశారు. అటుపై రేవుల్లోనే నేలపై ముగ్గులు పెట్టి పసుపుగణపతి పూజ చేసి కొబ్బరి కాయలు కొట్టి అరటి డొప్పల్లో కార్తీక దీపాలను నదిలో విడిచిపెట్టారు. పురోహితులకు సాలీగ్రామదానం, స్వయంపాలక దానం, దీపదానం చేశారు. రాజమహేంద్రవరంలో పుష్కరాలరేవు, కోటిలింగాలరేవు, చింతాలమ్మఘాట్, టీటీడీ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమ ఘాట్, కొవ్వూరు గోష్పాదక్షేత్రంలలో వేకు జామునే మహిళలు పెద్దఎత్తున గోదావరి స్నానాలు చేశారు. ప్రధాన స్నానఘట్టంలో ఉన్న శివలింగాలకు నదీ జలాలతో అభిషేకాలు చేశారు. కోటిలింగేశ్వరాలయం, ఉమామార్కండేశ్వరాలయం, విశ్వేశ్వరాలయం, ఉజ్జయిని మహకాళేశ్వరాలయం, ఉమారామలింగేశ్వరాలయం, కళ్యాణి సమేత సోమలింగేశ్వరాలయం, సారంగధరేశ్వరాలయం, కొవ్వూరు సుందరేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యే పూజలు చేశారు. బిక్కవోలులోని ప్రాచీన గోలింగేశ్వరస్వామి దర్శనానికి తెల్లవారుజామునుంచే భక్తులు బారులు తీరారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Updated Date - 2023-11-15T00:12:48+05:30 IST