వందేళ్ల వైభవం
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:34 AM
ఓ మహత్తర చారిత్రక ఘట్టానికి సంబంధించిన గురుతుల పండుగకు కాకినాడ వేదిక కానుంది. నరనరాన జాతీయోద్యమ స్ఫూర్తిని నింపిన మహోన్నతమైన సంగతులను తలుచుకునే సందర్భానికి సాక్షిగా నిలవనుంది.
జాతీయోద్యమ స్ఫూర్తిని నింపిన సమావేశాలు
ఎందరో ప్రముఖ జాతీయ నాయకులు హాజరు
తుపాను వచ్చినా ఆగని సభలు
అప్పటి మహోన్నత సందర్భాన్ని గుర్తుచేస్తూ కాకినాడలో ఈ నెల 28న శతాబ్ది ఉత్సవాలు
కాకినాడ రూరల్, డిసెంబరు 25: ఓ మహత్తర చారిత్రక ఘట్టానికి సంబంధించిన గురుతుల పండుగకు కాకినాడ వేదిక కానుంది. నరనరాన జాతీయోద్యమ స్ఫూర్తిని నింపిన మహోన్నతమైన సంగతులను తలుచుకునే సందర్భానికి సాక్షిగా నిలవనుంది. వందేళ్ల క్రితం అంటే 1923న కాకినాడలో జరిగిన చారిత్రక అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కోకనాడ మహాసభల గొప్పదనాన్ని, ఆ విశేషాలను ఇప్పటితరానికి తెలియజేసేందుకు అడుగు పడింది. ఈ నెల 28న కాకినాడ సూర్య కళామందిరంలో అఖిలభారత జాతీయ కాంగ్రెస్ కోకనాడ మహాసభల శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు అంతా సిద్ధమైంది. 1923లో తుపాను దెబ్బకు గోదావరి తీరాన ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటి విపత్కర సందర్భంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌కు అప్పటి కోకనాడ వేదికైంది. చట్టసభల్లో సహాయ నిరాకరణ కొనసాగించాలని స్వరాజ్యవాదులకు అనుకూలంగా తీర్మానం చేసింది ఈ కాకినాడ అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లోనే.. మహాత్మాగాంధీ ఎరవాడ జైలులో ఉన్న సమయంలో అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్‌అలీ అధ్యక్షతన జరిగిన ఈ సభకు కొండా వెంకటప్పయ్య, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, చిత్తరంజన్‌దాస్, కస్తూరిబాయి, సరోజినీ నాయుడు వంటి ఎంతో మంది మహనీయులు హాజరయ్యారు. మహాసభలు ఎక్కడ జరిగినా డేరాను ఉపయోగించేవారు. కాకినాడలో సువిశాలమైన ఖాదీ డేరాను శాశ్వతంగా తయారుచేశారు. తర్వాత ఈ డేరాను ఇతర సమావేశాలకు సైతం ఉపయోగించేవారు. ఆనాటి తుపాను పరిస్థితులు, వారికి చేపట్టిన సహాయ సహకారాలు, సభలో ప్రవేశపెట్టిన తీర్మానాలు, హాజరైన ప్రముఖుల ప్రసంగాలను నేటి తరానికి తెలియజేసేందుకు ఇప్పుడు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కోకనాడ మహాసభల శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సభల ద్వారా అప్పటి ఉద్యమ స్ఫూర్తిని తెలియజేయడమే కాకుండా కాకినాడ చారిత్రక నేపథ్యంపై అవగాహన కల్పించనున్నారు. 1923లో జరిగిన ఈ సభలు కాంగ్రెస్ ఉద్యమ నిర్మాణం రెండు వర్గాలయ్యే ప్రమాదాన్ని నివారించి ఒక తాటిపైకి తీసుకువచ్చి జాతీయస్థాయిలో రాజీ అంశాన్ని ప్రతిపాదించాయి. బలమైన ఉద్యమం కార్యకర్తలను ఏకీకృతం చేయడం, పోరాటాన్ని పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లడం ఈ సభల విజయం. అంతవరకూ చర్చిస్తూ వచ్చిన సంపూర్ణ స్వరాజ్యం అనే భావనకు ఈ సభలు ఒక పూర్తి అవగాహన ఏర్పరిచాయి. అఖిల భారత స్థాయిలో కాంగ్రెస్ సేవాదళాన్ని నెలకొల్పాలని ఒక తీర్మానం జరిగింది ఈ సభలోనే. 1923, డిసెంబరులో కాంగ్రెస్ మహాసభ జరిగి నూరేళ్లయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను కాకినాడలో నిర్వహిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, లోక్‌సత్తా నాయకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఏపీ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద పాల్గొంటున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:34 AM