చేబ్రోలులో దుకాణాలపై దాడులు
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:25 AM
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన దుకాణాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడి ఇళ్లల్లో నివాసం ఉండే ప్రజలను కూడా భయబ్రాంతులకు గురి చేశారు.
గొల్లప్రోలు రూరల్, డిసెంబరు 27: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన దుకాణాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడి ఇళ్లల్లో నివాసం ఉండే ప్రజలను కూడా భయబ్రాంతులకు గురి చేశారు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. చేబ్రోలులోని సత్తెమ్మతల్లి ఆలయ సమీపంలో నివాస గృహాలు, దుకాణాలపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. మారణాయుధాలతో అక్కడి ప్రజలను భయపెట్టారు. జేసీబీలు, క్రేన్లతో అక్కడి దుకాణాలను రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా 50 మంది గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి భయనక వాతావరణ సృష్టించారు. ఇళ్లల్లో, దుకాణాల్లో నిద్రిస్తున్న వారిని భయటకు లాక్కొచ్చి, చేతులు, కాళ్లకు తాళ్లు కట్టి బంధించారు. నోట్లో కత్తులు, రాడ్లు పెట్టి కేకలు వేస్తే ప్రాణాలు తీస్తామంటూ భయపెట్టారు. మొత్తం 8 దుకాణాలు, ఇళ్లను, గృహోపకరణాలను ధ్వంసం చేశారు. కొంతమందిని ఫోన్లు లాక్కొని పక్కనే పొదల్లోకి లాక్కెళ్లి బంధించి చితక్కొట్టారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ భయపెట్టారని ఉలవకాయల సాంబయ్య, అర్జున్, అరుసుల నాగేశ్వరరావు, ఏసుబాబు వాపోయారు. కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదని శ్రీను, విసరపు రామకృష్ణ, ఖండవల్లి ప్రకాష్ విలపించారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం జాతీయ రహదారిపై పహారా కాసే హైవే మెబైల్ వాహనం సమీపంలో లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సంఘటన జరిగిన తరువాత 100కి కాల్ చేసిన ఎవరూ రాలేదని బాధితులు వాపోయారు. విధ్వంసం జరిగిన సమయంలో పది నిమిషాల ముందు విద్యుత్తు సరఫరా కూడా నిలిపివేశారని బాధితులు తెలిపారు. తక్షణం దుండగులను గుర్తించి, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. సంఘటన స్థలాన్ని పిఠాపురం సీఐ శ్రీనివాసు, గొల్లప్రోలు ఎస్‌ఐ వినతి ప్రతాప్, తహసీల్దారు వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యాదర్శి శ్రీనివాసు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అయితే ఇక్కడ స్థల వివాదం కొంతకాలంగా నడుస్తున్నట్లు, హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గొడవ జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
Updated Date - Dec 28 , 2023 | 01:25 AM