ఆక్రందన పట్టదా..?
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:26 AM
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్ల ఆక్రందన పట్టదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రశ్నించారు.
మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు
అంగన్‌వాడీల సమ్మెకు మాండ్ర సంఘీభావం
11వ రోజుకు చేరిన నిరవధిక దీక్షలు
జిల్లా వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు
నందికొట్కూరు రూరల్ డిసెంబరు 22 : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్ల ఆక్రందన పట్టదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక పాలనపై సమిష్టి పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల దీక్షా శిబిరాన్ని మాండ్ర సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలు గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇలాగే కొనసాగితే మహిళా శక్తి ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు జయసూర్య, కాతా రమెష్ రెడ్డి, గిరీశ్వరెడ్డి, ఓబుల్ రెడ్డి, ముర్తుజావళి, జాకీర్‌హుశ్శేన్, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు, డిసెంబరు 22: పార్లమెంట్‌లో 141 మంది ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామ్యమని సీపీఎం నాయకులు రాజశేఖర్, ఏసురత్నం, రణధీర్‌లు పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం పార్లమెంట్‌లో ఎంపీల సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
11రోజులకు చేరిన పోరాటం
ఆత్మకూరు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ వర్కర్లు చేస్తున్న పోరాటం 11వరోజుకు చేరింది. చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి మంజుల, సీఐటీయూ నాయకులు ఏసురత్నం, రామ్‌నాయక్, రణధీర్ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించేవరకు వెనక్కి తగ్గేదే లేదన్నారు. నాయకులు వాణి, విజయలక్ష్మీ, వెంకటలక్ష్మీ, ప్రియాంక, రవణమ్మ, అరుణ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె ఆపం
నంద్యాల : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంకై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తేలేదని సీఐటీయూ, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్‌వాడీలు చేపట్టిన రిలేనిరసన దీక్షలు 11వ రోజుకు చేరాయి. స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షల నుంచి అంగన్‌వాడీలు, సీఐటీయూ నాయకులు రాస్తారోకో చేపట్టారు. శ్రీనివాస్‌సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
మహానంది: తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమంం మరింత ఉధృతం చేస్తామని మహానంది మండల అంగన్‌వాడీ టీచర్లు తెలిపారు. సమ్మెలో భాగంగా 11 వరోజు అంగన్‌వాడీ టీచర్లు మహానంది- నంద్యాల ప్రధాన రహదారిలో గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. యూనియన్ నాయకులు సావిత్రి, నారాయణమ్మ, చండీదేవి, ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో అంగన్‌వాడీ టీచర్లు పాతిమా మేరిరాణి గద్దెమ్మ అవతారంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గద్దె రూపంలో చెప్పారు.
గోస్పాడు : అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకురాళ్లు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
వెలుగోడులో రాస్తారోకో
వెలుగోడు : పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటరు వద్ద అంగన్‌వాడీ వర్కర్లు మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ కార్యదర్శి రామదాసు, సీఐటీయూ మండల అధ్యక్షుడు నాగమోహన్, అంగన్‌వాడీ సెక్టార్ నాయకురాలు భాగ్యలక్ష్మి, సుమిత్రమ్మ, రమణమ్మ మాట్లాడారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రూ.26వేల వేతనం ఇవ్వాల్సిందే
కొత్తపల్లి : అంగన్‌వాడీ వర్కర్లకు వేతనాలు రూ.26వేలకు పెంచి ఇవ్వాలిందేనని యూనియన్ జిల్లా నాయకురాలు హరిత, కొత్తపల్లి, దుద్యాల సెక్టార్ల నాయకులు నాగమణి, రాజమ్మ అన్నారు. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి రాస్తారోకో చేశారు. అనంతరం అక్కడే ఉన్న శునకానికి వినతి పత్రం అందజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. నాయకులు రమణమ్మ, శ్రీదేవి, మరియమ్మ, లక్ష్మిదేవి, భాగ్యమ్మ, అచ్చమ్మ, లైసమ్మ, ప్రభావతమ్మ, సరిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఉరితాళ్లతో నిరసన
జూపాడుబంగ్లా : తమ డిమాండ్లు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు టీడీపీ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా అంగన్వాడీవర్కర్లు జాతీయ రహదారిపై ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ కార్యాలయంవద్ద ఆందోళన చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షలు ఏసురత్నం, రాము, కర్ణ, నరసింహులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 12:26 AM