డిమాండ్లు నెరవేర్చలేం
ABN, Publish Date - Dec 31 , 2023 | 03:34 AM
సమగ్ర శిక్ష అభియాన్(ఎ్‌సఎ్‌సఏ) ప్రాజెక్టు ఉద్యోగులతో మంత్రి బొత్స సత్యనారాయణ చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి.
విధులకు హాజరుకావాల్సిందే.. లేకపోతే కొత్తవారికి చాన్స్
సమగ్ర శిక్ష అభియాన్ చర్చల్లో మంత్రి బొత్స బెదిరింపులు
చర్చలను బహిష్కరించిన నేతలు.. కొనసాగిన ఆందోళనలు
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), కర్నూలు(ఎడ్యుకేషన్), అనంతపురం విద్య, డిసెంబరు 30: సమగ్ర శిక్ష అభియాన్(ఎ్‌సఎ్‌సఏ) ప్రాజెక్టు ఉద్యోగులతో మంత్రి బొత్స సత్యనారాయణ చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. సర్వీస్ క్రమబద్ధీకరణ, హెచ్‌ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం డిమాండ్లతో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. శనివారం విశాఖలోని సర్క్యూట్‌హౌ్‌సలో మంత్రి బొత్స సమక్షంలో జరిగిన చర్చల్లో ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, అధ్యక్షుడు బి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి ఎదుట తమ డిమాండ్లను ఉంచారు. వీటిపై బొత్స స్పందిస్తూ 2017 తర్వాత జీతాలు పెంచని ఉద్యోగులకు మాత్రం జీతాలు పెంచుతామని, ఇతర డిమాండ్లపై పూర్తిగా హామీ ఇవ్వలేమన్నారు. తక్షణం విధులకు హాజరుకావాలని, లేకపోతే కొత్తవారిని నియమిస్తామని హెచ్చరించారు. దీంతో నాయకులు చర్చలను బహిష్కరించారు. సంఘం అధ్యక్షుడు కాంతారావు మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా నాలుగు అంశాలపై సమ్మె చేస్తున్నామని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా లేదని తెలిపారు. చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.
సమ్మెలు సహజం: బొత్స
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డిమాండ్లు నెరవేరుతాయన్న ఆలోచనతో సమ్మెలు చేయడం సహజమని మంత్రి బొత్స అన్నారు. తన దృష్టికి ఇప్పుడే సమస్యలు తీసుకువచ్చారని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చునని తెలిపారు.
కళ్లకు గంతలు కట్టుకుని..
తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగులు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో శనివారం జేఏసీ ఆధ్వర్యంలో ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నల్లరిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని.. ప్రజలకు, ఉద్యోగులకు సీఎం జగన్ శఠగోపం పెట్టారని అనంతపురం జిల్లాకు చెందిన సమగ్రశిక్ష ఉద్యోగులు విమర్శించారు. సమ్మెలో భాగంగా శనివారం అనంతపురం కలెక్టరేట్ వద్ద తలపై శఠగోపం పెట్టుకుని నిరసన తెలిపారు. ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన పామిడి కేజీబీవీ హిందీ సీఆర్టీ శాంతకుమారి షుగర్ లెవల్స్ తగ్గి సొమ్మసిల్లి పడిపోయారు. తోటి ఉద్యోగులు ఆమెకు టాబ్లెట్ ఇచ్చి సపర్యలు చేయడంతో కాసేపటికి ఆమె తేరుకున్నారు.
Updated Date - Dec 31 , 2023 | 03:34 AM