కేన్సర్ రోగులతో చెలగాటం!
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:23 AM
ఆరోగ్యశ్రీలో క్లెయిమ్స్ స్కామ్ కలకలం రేపింది. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు.
క్లెయిమ్స్ స్కామ్
ప్యాకేజీల కోసం అవసరం లేని చికిత్సలు
రేడియోథెరపీలో ఏ ప్రొసీజర్ చేసినా
రూ.2.75 లక్షల ఐజీఆర్‌టీ ప్రీఆథరైజేషన్
కీమోథెరపీలో రూ.60 వేల కోసం కక్కుర్తి
రోగులందరికీ బెవాసిజుమాబ్ ఇంజెక్షన్
అడ్డగోలుగా ప్రీఆథరైజేషన్, క్లెయిమ్స్ ఆమోదం
ఒప్పంద ఆస్పత్రులకు వెంటనే అనుమతులు
పక్కా ప్రణాళికతో కోట్ల ప్రజాధనానికి గండి
ఎమ్మెల్యే బంధువు, కొందరు అధికారుల పాత్ర
కమీషన్లు ఇచ్చే ఆస్పత్రులకు కోట్లు దోచిపెట్టారు
క్లెయిమ్స్ స్కామ్‌లో సంచలన విషయాలు
‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో కలకలం
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీలో క్లెయిమ్స్ స్కామ్ కలకలం రేపింది. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. కొన్ని ఆస్పత్రులకు మొత్తం క్లెయిమ్స్ ఇచ్చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితమే అంతర్గతంగా బయటపడింది. అయితే సీఎంవో కీలక అధికారితో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ విషయం బయటకు పొక్కనీయకుండా తొక్కిపెట్టేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువుతో పాటు ఐటీ విభాగ ఉద్యోగులు ఈ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించారు. సీఎంవో, ఆరోగ్యశాఖలో కీలక ఉన్నతాధికారుల అండదండలతో కొన్ని ఆస్పత్రులకు అత్యంత ప్రయోజనం చేకూర్చారు. ఎక్కువ ఆదాయం వచ్చే ప్రీఆథరైజేషన్, క్లెయిమ్స్‌నే లక్ష్యంగా చేశారు. క్లెయిమ్స్ ఆమోదం విషయంలో పక్కాగా ప్లాన్ చేశారు. ట్రస్ట్ అధికారులు ఒప్పందం చేసుకున్న ఆస్పత్రులకు వెంటనే ప్రీఆథరైజేషన్‌కు అనుమతివ్వడంతో పాటు క్లెయిమ్స్ మొత్తం ఆమోదించేవారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొన్ని ఆస్పత్రులకు అప్పనంగా ధారాదత్తం చేసేశారు. ఈ స్కామ్ లోతుల్లోకి వెళ్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అంకాలజీ మాటున అడ్డగోలుగా...
అంకాలజీ(కేన్సర్)ని విభాగాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు పూర్తిగా వాడేసుకున్నారు. ఈ విభాగం నుంచే రూ.కోట్లు కొల్లగొట్టారు. కేన్సర్ రోగికి చేసిన శస్త్రచికిత్సకు.. ట్రస్ట్ అధికారులిచ్చిన ప్రీఆథరైజేషన్‌కు సంబంధమే లేదు. రోగికి అవసరం లేని చికిత్సలకు, మందులకు కూడా ప్రీఆథరైజేషన్ ఆమోదించేశారు. కొన్నిసార్లు రోగికి అవసరం లేని శస్త్రచికిత్సలు కూడా చేసేసినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో ఏ చికిత్స చేస్తున్నారన్న విషయం రోగులు అంత సులభంగా గుర్తించలేరు. పేదలకు అయితే దీనిపై అవగాహన ఉండే అవకాశం తక్కువ. వైద్యులు చెప్పినదాన్ని గుడ్డిగా నమ్మడం తప్ప దాని లోతుల్లోకి వెళ్లరు. రోగుల్లోని ఈ అమాయకత్వమే ట్రస్ట్ అధికారులకు వరంగా మారింది.
ప్రొసీజర్లు... ప్యాకేజీలు...
కేన్సర్ విభాగంలో రేడియోథెరపీ, కీమోథెరపీ అనే రెండు విధానాలు ఉంటాయి. రేడియో థెరపీలో ఐదు రకాల ప్రొసీజర్లు (పాలియేటివ్, 3డీ సీఆర్‌టీ, ఐఎంఆర్‌టీ, ర్యాపిడ్ ఆర్క్, ఐజీఆర్‌టీ) ఉన్నాయి. వీటికి ట్రస్ట్‌లో ఒక్కోదానికి ఒక్కో ప్యాకేజీ ఇస్తారు. పాలియేటివ్‌కి రూ.26వేల ప్యాకేజీ ఇస్తారు. 3డీ సీఆర్‌టీకి రూ.50వేలు, ఐఎంఆర్‌టీకి రూ.85వేలు, ర్యాపిడ్ ఆర్క్ ప్రొసీజర్‌కి రూ.1.50లక్షలు ఇస్తారు. అత్యధికంగా ఐజీఆర్‌టీకి రూ.2.75లక్షల ప్యాకేజీ ఉంది.
అందరికీ అదే ప్రొసీజర్!
ట్రస్ట్ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రుల్లో ప్రతినెలా దాదాపు 600 నుంచి 800 మంది కేన్సర్ రోగులు చికిత్స తీసుకుంటారు. ఇందులో 10 నుంచి 15 శాతం మంది చికిత్సకయ్యే వ్యయాన్ని భరించగలిగిన వారుంటారు. మిగిలిన వారంతా ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునేవారే. రోగి పరిస్థితిపై ఆధారపడి రేడియోథెరపీ చేయాల్సి వచ్చినప్పుడు వారికి అవసరమైన ప్రొసీజర్‌ను మాత్రమే చేయాలి. పాలియేటివ్ ప్రొసీజర్ చేస్తే దానికే ప్రీఆథరైజేషన్ పంపాలి. కానీ ట్రస్ట్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులు రోగికి అవసరం ఉన్నా, లేకపోయినా, ఏ ప్రొసీజర్ చేసినా అత్యధికంగా రూ.2.75 లక్షలు ఇచ్చే ఐజీఆర్‌టీ ప్యాకేజీకే ప్రీఆథరైజేషన్ చేసేశారు. ట్రస్ట్‌లో అధికారులు కూడా దానికి వెంటనే అనుమతి ఇచ్చేశారు. తమకు కమీషన్లు ఇచ్చే ఆస్పత్రులకు రూ.కోట్లు దోచిపెట్టారు.
‘కీమో’లోనూ కుమ్ముడే
రేడియోథెరపీలో అత్యధిక ప్యాకేజీ వచ్చే ఐజీఆర్‌టీ ద్వారా రూ.కోట్లు కొట్టేసినట్లే... కీమోథెరపీలోనూ దోపిడీకి తెగబడ్డారు. ఈ విధానంలో రోగికి బెవాసిజుమాబ్ అనే ఇంజెక్షన్ ఇస్తారు ఈ డ్రగ్‌ను వాడితే ట్రస్ట్ రూ.60 వేల ప్యాకేజీ ఇస్తుంది. దీన్ని కేవలం అండాశయం, పురీషనాళం కేన్సర్ రోగులకు మాత్రమే వాడాలి. అది కూడా వారికి అవసరం అయితేనే ఇవ్వాలి. అవసరం లేకపోయినా రోగికి ఈ మందు ఇస్తే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ రోగికి ఏమైతే మాకెందుకన్నట్లు అధికారులు వ్యవహరించారు. వారు ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రులు రోగులకు అవసరం లేకపోయినా, అన్ని రకాల కేన్సర్లకు కూడా ఈ డ్రగ్ వాడాలని ప్రీఆథరైజేషన్ చేసేశారు. ట్రస్ట్‌లో ఉన్న అధికారులు గుడ్డిగా ఆమోదించారు. కేవలం రూ.60వేల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు.
ఇంజెక్షన్‌కు అనుమతులు బంద్
ఈ దోపిడీ మరీ ఎక్కువ కావడంతో పాటు ట్రస్ట్‌లో కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు ఫిర్యాదులు చేయడంతో ప్యానల్ డాక్టర్లకు అనుమానం వచ్చింది. దీంతో బెవాసిజుమాబ్ ఉపయోగంపై సమీక్ష చేపట్టారు. కేవలం కొన్ని ఆస్పత్రులకే ఈ డ్రగ్ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో పాటు అవసరం లేని కేన్సర్లకు కూడా దీన్ని వాడేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత లోతుగా వెళ్తే స్కామ్ మొత్తం బయటపడుతుందని గ్రహించిన అధికారులు డ్రగ్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం ఏ కేన్సర్ రోగికి కూడా ఈ డ్రగ్ ఇవ్వడం లేదు. దీనిపై కొన్ని కేన్సర్ ఆస్పత్రులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎక్కడో స్కామ్ జరిగిందని మిగిలిన రోగులకు అన్యాయం చేయడం సబబు కాదని, రూ.60వేల ప్యాకేజీని రూ.30వేలకి తగ్గించి అయినా ఇవ్వాలని కోరారు. కానీ ట్రస్ట్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ స్కామ్ వెనుక పెద్ద తలకాయలు ఉండటంతో ప్రభుత్వం విచారణకు అదేశించే అవకాశమే లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎంవోలోని ఒక కీలక అధికారికి ఈ స్కామ్ గురించి తెలిసినా, ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా దీనిపై విచారణకు ఆదేశిస్తారో, లేదో చూడాలి.
Updated Date - Dec 18 , 2023 | 02:24 AM