అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ABN, Publish Date - Dec 29 , 2023 | 12:11 AM
శ్రీరంగరాజపురం మండలంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.
భర్తే చంపాడని బంధువుల ఆరోపణ
పోలీసుల అదుపులో గౌతమ్
శ్రీరంగరాజపురం, డిసెంబరు 28: శ్రీరంగరాజపురం మండలంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. వెంకటాపురం దళితవాడకు చెందిన ధన్య(27), బెంగళూరుకు చెందిన గౌతమ్(32) ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు బెంగళూరు నుంచి వచ్చి మండలంలోని మెదవాడ ఎస్టీ కాలనీ వద్ద సిమెంట్ బట్టీల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. రెండు రోజులుగా భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా తన భార్య ఆరోగ్యం సరిగా లేదని ఎస్‌ఆర్‌పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కారులో గురువారం మధ్యాహ్నం గౌతమ్ తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆమె మృతదేహాన్ని సిమెంట్ బట్టీల వద్దకు తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ధన్య తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని రోదించారు. గురువారం ఉదయం కూడా గొడవ పడటంతో మధ్యాహ్నం గౌతమ్ మద్యం తాగొచ్చి భార్యను కొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమార్తె మృతికి అల్లుడు గౌతమే కారణమని ఆరోపించారు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాలసముద్రం ఇన్‌చార్జి ఎస్‌ఐ ప్రసాద్ సంఘటన స్ధలాన్ని పరిశీలించి, అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశారు. వీరికి ఒక కుమారుడు (4), కుమార్తె (9నెలలు) ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Updated Date - Dec 29 , 2023 | 06:45 AM