గూడూరు వైసీపీలో అలజడి
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:59 AM
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో రేగుతున్న అలజడి గూడూరులో కూడా ప్రతిఫలిస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యే వరప్రసాదరావుకు వచ్చే ఎన్నికల్లో సీటు అనుమానమేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తిరుపతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో రేగుతున్న అలజడి గూడూరులో కూడా ప్రతిఫలిస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యే వరప్రసాదరావుకు వచ్చే ఎన్నికల్లో సీటు అనుమానమేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఎమ్మెల్యే పనిగట్టుకుని వర్గాలను ప్రోత్సహించకపోయినా అనివార్యంగా కొన్ని ఆరోపణలను, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది రెండవ విడత యువగళం పాదయాత్ర జిల్లా మీదుగా సాగినపుడు టీడీపీ యువనేత నారా లోకేశ్ గూడూరు ఎమ్మెల్యేపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు చేశారు. అప్పటి వరకూ నియోజకవర్గ స్థాయికే పరిమితమైన ఆరోపణలు లోకేశ్ ఆరోపణలతో రాష్ట్రస్థాయిలో బహిర్గతమయ్యాయి. దీనికి తోడు సొంత వర్గాన్నంటూ ఏర్పాటు చేసుకోకపోవడంతో ఇపుడు టికెట్ విషయంలో మద్దతిచ్చి అధిష్ఠానం వద్ద గట్టిగా పోరాడే నాయకులంటూ లేకుండాపోయారు. అదే సమయంలో ఇతర ఆశావహులు చాపకింద నీరులా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో ముఖ్యనేతల మద్దతు లేకుండా పార్టీలో దాదాపు ఒంటరైన వరప్రసాదరావుకు ఈసారి టికెట్ అవకాశాలు లేనట్టేనన్న ప్రచారం జోరందుకుంది.
ఓ ఆశావహుడి బంపర్ ఆఫర్
ఈ పర్యాయం టికెట్ ఆశిస్తున్న వారిలో ఒకరు అధిష్ఠానానికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. దాని ప్రకారం తనకు ఈ పర్యాయం గూడూరులో టికెట్ ఇవ్వని పక్షంలో ప్రత్యామ్నాయంగా అమలాపురం ఎంపీ సీటు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. గూడూరులో టికెట్ ఇచ్చినా లేదంటే అమలాపురం ఎంపీ సీటు ఇచ్చినా దానికి ప్రతిగా రాష్ట్రంలోని ఎస్సీ స్థానాలన్నింటి ఖర్చునూ తానే భరిస్తానని ముందుకు వచ్చారనేది ఈ ప్రచారం సారాంశం. సదరు వ్యక్తికి చెన్నైలో ఒకటికి నాలుగు కార్పొరేట్ ఆస్పత్రులు, ఒకటి రెండు ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఇతరత్రా విలువైన ఆస్తులు వున్నట్టు శ్రేణులు చెబుతున్నాయి.
రేసులో ఎమ్మెల్సీ మేరుగ... ఓ రెవిన్యూ అధికారి
వైసీపీ టికెట్ రేసులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వున్న మేరుగ మురళీధర్‌తో పాటు ఓ రెవిన్యూ అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గం రాపూరుకు చెందిన మురళీధర్ వైసీపీ ఆవిర్భవించిన తొలినాళ్ళలో గూడూరు నియోజకవర్గ ఇంఛార్జిగా పనిచేశారు. 2014లో టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. అప్పట్లో టికెట్ పొందిన సునీల్ కుమార్ గెలిచాక టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ మేరుగ మురళీధర్ గూడూరు వైసీపీ ఇంఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. 2019లో టికెట్ రాకపోయినా వరప్రసాదరావు గెలుపుకోసం పనిచేశారు. దీంతో పార్టీ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. రానున్న ఎన్నికల్లో కూడా టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా తొలినుంచీ తనకు అండదండలు అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మద్దతుతో ఈసారి అవకాశం దక్కించుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ రెవిన్యూ అధికారి కూడా చాపకింద నీరులా పనిచేస్తూ అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తున్నారని సమాచారం. ఈ అధికారికి వైసీపీలో కీలక నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరుల మద్దతు వున్నట్టు ప్రచారం జరుగుతోంది. సంబంధిత అధికారి కదలికలు ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా వున్నట్టు గ్రహించిన వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు చేశారు. నేరుగా సీఎంకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అధికారి ఇవేవీ పట్టించుకోకుండా ప్రధానంగా దళితవాడలను లక్ష్యంగా చేసుకుని చురుగ్గా పరిచయాలు పెంచుకుంటున్నట్టు సమాచారం. రేసులో ఇప్పటికి మేరుగ మురళీధర్‌తో పాటు ఈ ఽఅధికారి పేరు మాత్రమే వినిపిస్తున్నా షరా మామూలుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు ఇక్కడా ప్రచారంలో వుంది.
కీలకం కానున్న వేమిరెడ్డి, పేర్నాటి మద్దతు
గూడూరు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కేటాయించాలనే విషయంలో వైసీపీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అభిప్రాయం కీలకం కానుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.పార్టీ అధినేతకు వేమిరెడ్డి అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే. ఇతర ప్రాంతాల్లో ఎలా వున్నా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీట్ల కేటాయింపుపై ఆయన ప్రభావం ఎక్కువగా వుంటుందన్నది బహిరంగ రహస్యమే. అలాగే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సైతం అధినేతకు సన్నిహితుడన్న పేరుంది. ఆయన స్వస్థలం గూడూరు నియోజకవర్గం కోట మండలం అల్లంపాడు గ్రామం. ఇదే నియోజకవర్గానికి చెందిన కారణంగా పేర్నాటి అభిప్రాయానికి కూడా అధిష్ఠానం వద్ద గణనీయమైన విలువ వుంటుందని శ్రేణులు భావిస్తున్నాయి.గూడూరు టికెట్ రేసులో ఎవరు నెగ్గుతారనే విషయమై కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశముంది.
Updated Date - Dec 26 , 2023 | 01:59 AM