పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న సీఎం
ABN, First Publish Date - 2023-12-11T00:46:40+05:30
పత్రికాస్వేచ్ఛను హరించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు.
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శ
బంగారుపాళ్యం/వెదురుకుప్పం/శ్రీరంగరాజపురం, డిసెంబరు 10: పత్రికాస్వేచ్ఛను హరించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. కొన్ని పత్రికలు చదవద్దని, కొన్ని టీవీ ఛానళ్లను చూడవద్దని ఓ కార్యక్రమంలో ప్రజలకు పిలుపునివ్వడం చట్టవిరుద్ధమన్నారు. బంగారుపాళ్యం, వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం మండలం పుల్లూరు క్రాస్‌లో ఆదివారం జరిగిన ‘మార్పు రావాలి- కాంగ్రెస్ రావాలి’ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బంగారుపాళ్యం మండలంలో నిత్యం ఏనుగుల దాడుల్లో రైతుల పంటలు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని, అదేవిధంగా ఏపీలోనూ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేద ప్రజలు రూ.5వేలు, రూ. 10వేలు రుణాలు తెచ్చుకొనేవారని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను పూర్తిగా మూసివేసిందని విమర్శించారు. జగన్ ఒక అవకాశం ఇవ్వండి అంటూ ఒక సంవత్సరంలోనే ప్రజల దవడ పళ్లు రాలగొట్టాడని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. మోదీ పేదల నడ్డివిరచి అదానీ లాంటి ధనవంతులను మరింత ధనవంతులుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం కూడా మోదీ అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడుతుందని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్, జిల్లా కోఆర్డినేటర్లు పరదేశి, ప్రభాకర్, గంగాధరనెల్లూరు ఇన్‌చార్జి నారాయణస్వామి, నాయకులు జయచంద్ర, మస్తాన్ బాషా, వీరమోహన్, బాబు, సురాజ్, కణ్ణన్, తులసిమణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T00:46:42+05:30 IST