టమోటా రైతును ఆదుకోరా?
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:09 AM
వర్షానికి దెబ్బతిన్న తోటలు
సోమల, డిసెంబరు 17: వర్షాలకు దెబ్బతిన్న టమోటా పంటకు పరిహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ఈ తోటల నష్ట వివరాలను అధికారులు నమోదు చేయడంలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి, టమోటా తోటలు దెబ్బతిన్నాయి. అధికారులు క్షేత్ర స్ధాయిలో పంటలను పరిశీలించారు. వరి పంట సాగు చేసి నష్టపోయిన రైతుల వివరాలను మాత్రమే ఆర్బీకే ఉద్యోగులు నమోదు చేశారు. టమోటా పంటను లక్షలు ఖర్చు చేసి సాగు చేస్తే వర్షం ప్రభావంతో కోతలు కూడా చేయకనే తోటలు దెబ్బ తిన్నాయి. సోమల మండలంలో 400 ఎకరాల్లో సాగులో ఉండి రైతులు నష్టపోయారు. వర్షం దెబ్బతో పచ్చని తోటలు ఆకులు రాలిపోయాయి. చీడపీడలు వ్యాప్తి చెంది కాయలపై నల్లని మచ్చలు, పగుళ్లు రావడంతో పండిన పంటను మార్కెట్‌కు తరలించలేక పొలాల వద్దే వదిలేశారు. ఉన్న కొద్దిపాటు టమోటాలను మార్కెట్‌కు తరలిస్తే 15కిలోల బాక్సు కేవలం రూ.100 నుంచి రూ.150 మాత్రమే పలుకుతుంది. నాణ్యత లేని కాయలు రూ.100 లోపే. ఈ ధరకు పెట్టుబడి కూడా దక్కదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటా సాగుకు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వారం కిందట 15కిలోల బాక్సు రూ. 150 నుంచి 250 వరకూ ధరపలికింది. ఆ ధరలు అమాంతం గా పడిపోయాయి. నిలకడ లేని ధరలతో టమోటా సాగు చేయాలంటేనే భయపడుతున్నారు. స్ధిరమైన ధర లేకపోవడంతో టమోటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు వర్షంతో దెబ్బతిన్న టమోటా పంట, రైతుల వివరాలను నమోదు చేయకపోవడంపై ఆందోళ వ్యక్తంచేస్తున్నారు. ఉద్యాన అధికారులు స్పందించి టమోటా పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:09 AM