పగలు ఎండ.. రాత్రి చలి
ABN, First Publish Date - 2023-10-30T01:25:28+05:30
పగలంతా ఎండ తీవ్రంగా ఉంటోంది. సాయంత్రమైతే చలిగాలులు వీస్తాయి. జిల్లాలో ఇలాంటి వాతావరణం నెలకొంది.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 29: పగలంతా ఎండ తీవ్రంగా ఉంటోంది. సాయంత్రమైతే చలిగాలులు వీస్తాయి. జిల్లాలో ఇలాంటి వాతావరణం నెలకొంది. అక్టోబరు నెలాఖరుకు వచ్చినా పగటి పూట వేసవిని తలపిస్తోంది. నెల రోజులుగా పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 31-33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి అక్టోబరు నెల సాధారణంగా మంచి వర్షపాతం నమోదు కావాలి. కానీ, ఈ ఏడాది ఎండాకాలం తరహాలో ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం 5 గంటలకు కూడా వేడిగాలులు కొనసాగుతున్నాయి. వరుణుడు ముఖం చాటేయడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, జనాలకు ఉక్కపోత తప్పడం లేదు. రాత్రివేళల్లోనూ పలుచోట్ల ఉష్ణోగ్రతలు 21-23 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇక, పగటి ఉష్ణోగ్రత పెరిగినా రాత్రి వేళ అత్యల్పంగానే నమోదువుతున్నాయి. చీకటి పడితే చాలు చాలా చోట్ల చలి తీవ్రంగా ఉంది.
ఫ వర్షపాతం లోటు
శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఎనిమిది మండలాల్లో చెదురుముదురు వర్షపాతం నమోదైంది. బంగారుపాళ్యంలో 30.4, గుడిపాలలో 13, వెదురుకుప్పంలో 8.4, విజయపురంలో 8.2, తవణంపల్లెలో 2.2, ఎస్‌ఆర్‌పురంలో 1.4, చిత్తూరులో 1.4, యాదమరిలో 1.2 మిమీ వర్షపాతం నమోదైంది. నెల చివరికి రెండు రోజులే మిగిలి ఉన్నా ఇక వర్షాలు వచ్చే అవకాశాలు లేదు. ఈ నెల 1-29 తేదీల మధ్య 16 రోజులు మాత్రమే వర్షపాతం నమోదైంది. అక్టోబరులో 156.6 మిమీ సగటు వర్షపాతానికిగాను, ఇప్పటికి 47.7 మిమీ వర్షం మాత్రమే కురిసింది. 69.6శాతం లోటు వర్షపాతం నమోదైంది. పెనుమూరులో 156.8 మిమీ, రామకుప్పం మండలంలో 144.7 మిమీ వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు చుక్క వర్షం కూడ పడలేదు. నగరి మండలంలో 153 మిమీ సగటు వర్షపాతం బదులు అతి తక్కువగా 5.4 మిమీ మాత్రమే నమోదైంది. మిగిలిన అన్ని మండలాల్లో 45 శాతం వర్షపాతం నమోదైంది.
Updated Date - 2023-10-30T01:25:28+05:30 IST