డీడీవోల కొరత.. తప్పని పనిభారం!
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:12 AM
సచివాలయాల్లో డీడీవోల కొరత ఉంది. దీంతో ఉన్న వారినే పక్క సచివాలయాలకు ఇన్‌చార్జులుగా నియమిస్తుండటంతో పనిభారం పడుతోంది.
వెదురుకుప్పం, డిసెంబరు 25: సచివాలయాల్లో డీడీవోల కొరత ఉంది. దీంతో ఉన్న వారినే పక్క సచివాలయాలకు ఇన్‌చార్జులుగా నియమిస్తుండటంతో పనిభారం పడుతోంది. జిల్లాలో 504 గ్రామ, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రతీ సచివాలయానికి ఒక డీడీవో ఉండాలి. సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్లకు జీతభత్యాలు పెట్టాలంటే డీడీవోకే అధికారం. శానిటేషన్ పనులు, తాగునీటి వసతి, వీధి దీపాలు, ఇతర మౌలిక వసతుల కల్పనలోనూ డీడీవో పాత్ర ఉంటుంది. ప్రగతి పనులపై సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో సమన్వయం చేసుకోవాలి. వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ర్టేషన్ ఆఫీసర్లు ఉంటారు. ఇంతటి కీలకమైన డీడీవోల కొరత ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉదాహరణకు వెదురుకుప్పం మండల పరిధిలో 13 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. బొమ్మయ్యపల్లె సచివాలయానికి డీడీవో భర్తీ కాకపోవడంతో కొన్ని నెలలుగా జక్కిదొన గ్రామ సచివాలయ డీడీవో సుబ్రహ్మణ్యం బొమ్మయ్యపల్లెకు కూడా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. జక్కిదొన గ్రామ సచివాలయం నుంచి బొమ్మయ్యపల్లె సచివాలయానికి సుమారు 16 కిలోమీటర్ల దూరం ఉండేది. అంతేకాకుండా బొమ్మయ్యపల్లె గ్రామ సచివాలయ పరిధి ఎక్కువగా ఉండేది. దీనివల్ల పనిభారం పడుతోంది. ఇలా జిల్లాలో పలు సచివాలయాల పరిస్థితి నెలకొంది.
Updated Date - Dec 26 , 2023 | 12:12 AM