తిరస్కరించిన దరఖాస్తులు 35,655
ABN, Publish Date - Dec 22 , 2023 | 12:16 AM
ఓటర్ల తుది జాబితా జనవరి 5న విడుదల కానుంది. కొత్తగా ఓటు నమోదు, తొలగింపు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 9న గుడువు ముగిసింది.
కుప్పంలో అత్యధికంగా 12,696
ఇంకా పెండింగులో 2587 అభ్యంతరాలు
26న ముగియనున్న పరిశీలన గడువు
చిత్తూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల తుది జాబితా జనవరి 5న విడుదల కానుంది. కొత్తగా ఓటు నమోదు, తొలగింపు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 9న గుడువు ముగిసింది. అప్పటి నుంచి వచ్చిన అభ్యంతరాలను బీఎల్వోలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలు వారి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అభ్యంతరాల పరిష్కారానికి ఈ నెల 26 వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఇప్పటివరకు 35,655 దరఖాస్తులను తిరస్కరించగా, ఇంకా 2587 అభ్యంతరాలు పరిశీలించాల్సి ఉంది.
ఫ నియోజకవర్గాల వారీగా అన్నిరకాల దరఖాస్తుల వివరాలు
నియోజకవర్గం వచ్చిన దరఖాస్తులు తిరస్కరించినవి పరిష్కారం పెండింగ్
పుంగనూరు 55839 4069 51425 225
నగరి 40914 4790 34481 1413
జీడీనెల్లూరు 43046 2722 40138 80
చిత్తూరు 48615 4363 43854 292
పూతలపట్టు 45269 3115 41777 237
పలమనేరు 52967 3900 48763 122
కుప్పం 62485 12696 49493 218
మొత్తం 3,49,135 35,655 309931 2587
ఫ ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి అన్నిరకాల అభ్యంతరాలు 349135 వచ్చాయి. వీటిలో 309931 అభ్యంతరాలను పరిష్కరించి ఓటరు జాబితాలో పేర్లను నమోదు కూడా చేశారు. 35655 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ నెల 26వ తేదీలోగా 2587 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. మిగిలిన 962 వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయి
కుప్పంలోనే ఎందుకు?
జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకుగానూ 35655 దరఖాస్తులను అధికారులు తిరస్కరించగా, ఒక్క కుప్పంలో అత్యధికంగా 12696 ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో సగటున 3- 4 వేల దరఖాస్తులను తిరస్కరించగా, కుప్పంలో మాత్రం ఆ సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉంది. వైసీపీ నాయకులు ఇచ్చిన ప్రతి దరఖాస్తునూ బీఎల్వో తీసుకుని పరిష్కరిస్తున్నారని.. టీడీపీ వారివి మాత్రం పట్టించుకోలేదని ఆమధ్య ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, గౌనివారి శ్రీనివాసులు కలెక్టర్ షన్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. అందులోనూ మిగిలినవాటి కంటే కుప్పం నియోజకవర్గంలోనే అత్యధికంగా 62485 దరఖాస్తులు అందాయి. ఈ లెక్కల్ని చూస్తుంటే తాము ముందు నుంచీ చెప్తున్నట్లు కుప్పంలో వైసీపీ నేతలు గోల్‌మాల్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పుంగనూరులో ఎక్కువగా పరిష్కారం
పుంగనూరు నియోజకవర్గంలో ఇంటింటి ఓటరు సర్వే సమయంలో కేసుల భయంతో టీడీపీ ఏజెంట్లు బీఎల్వోల వెంట తిరగలేదు. ఇదే అదునుగా చేసుకుని వైసీపీ నాయకులు బీఎల్వోలను లొంగదీసుకుని అక్రమ దరఖాస్తులను పెద్దఎత్తున చేసుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా చేసుకున్న ప్రతి దరఖాస్తునూ ఏఈఆర్వో, ఈఆర్వో స్థాయిలో తక్షణమే పరిష్కరించుకున్నారని టీడీపీ చెబుతోంది. ఇక్కడ 55,839 దరఖాస్తులు అందితే, వాటిలో ఏకంగా 51,425 దరఖాస్తులను పరిష్కరించేశారు. అంటే మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే తిరస్కరణ శాతం బాగా తక్కువ.
ఓటు నమోదుకు 13,718 మంది యువత దూరం
జిల్లాలో 18-19 ఏళ్ల వయసున్న యువత ఓటు నమోదులో బాగా వెనుకబడ్డారు. బీఎల్వో వద్దకెళ్లి ఫాం 6 అందించని, ఆన్‌లైన్‌లో ఓటుకు నమోదు చేసుకోని కారణంగా వీరంతా వచ్చే ఎన్నికల్లో తమ విలువైన తొలి ఓటు వేసే అవకాశం కోల్పోయారు. జిల్లాలో 18-19 ఏళ్ల యువత 36,537 మంది ఉన్నారు. అక్టోబరులో విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం 12,242 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు అధికారులు యువతకు అవగాహన కార్యక్రమాలు కల్పించినా ఫలితం పూర్తి స్థాయిలో లేకుండా పోయింది. ఓటు నమోదు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 9తో ముగిసింది. అప్పటివరకు 22819 మంది ఓటు నమోదు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఇంకా 13718 మంది యువత ఓటు నమోదుకు దూరంగా ఉండిపోయారు.
Updated Date - Dec 22 , 2023 | 12:16 AM