ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తొలిరోజు ‘ఆడుదాం ఆంధ్రా’కు క్రీడాకారులనుంచి స్పందన కరువు

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:35 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో మంగళవారం జిల్లాలో ప్రారంభమైంది. తొలిరోజు కావడంతో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పోటీలను ప్రారంభించారు. వాళ్లు వెళ్లిన వెంటనే మైదానాలు కూడా ఖాళీ అయిపోయాయి. క్రీడాకారులకు అవసరమైన కిట్లను ఎక్కడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు.

వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లెలో జరిగిన క్రికెట్‌ పోటీల్లో 5 ఓవర్లు కూడా ఆడకముందే విరిగిపోయిన బ్యాట్‌

ఆటలు ప్రారంభించిన కొద్దిసేపటికే వెలవెలబోయిన మైదానాలు

వైసీపీ రంగులతో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని తలపించిన వైనం

అవగాహన లేని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లే అంపైర్లు

సచివాలయ సిబ్బంది.. వలంటీర్లే అంపైర్లు. బలవంతంగా తీసుకొచ్చిన డ్వాక్రా మహిళలు, అధికారులే ప్రేక్షకులు. ఎటు చూసినా పార్టీ రంగులు.. ప్రచారార్భాటమే. ఇలా.. ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు ఆటలాడించారు.

చిత్తూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో మంగళవారం జిల్లాలో ప్రారంభమైంది. తొలిరోజు కావడంతో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పోటీలను ప్రారంభించారు. వాళ్లు వెళ్లిన వెంటనే మైదానాలు కూడా ఖాళీ అయిపోయాయి. క్రీడాకారులకు అవసరమైన కిట్లను ఎక్కడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. పోటీలను చూసేందుకని స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను, కొన్నిచోట్ల డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొచ్చారు. ఇక ఆటలాడేందుకు పేర్లను నమోదు చేసుకున్న వారిలో చాలామంది ముఖం చాటేశారు. వీరికి ఆటలపై ఆసక్తి లేకున్నా.. తమపై వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో వలంటీర్లు బలవంతంగా వీరి పేర్లు నమోదు చేయించారు. కానీ.. వారందరినీ పోటీలకు రప్పించలేకపోయారు. మరోవైపు జట్ల ఎంపిక.. ఆటల విషయంలో చాలాచోట్ల అధికారుల్లో అవగాహనా లోపం కనిపించింది. మొదటి రోజు పంచాయతీ కార్యదర్శులు, అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు ఎలాగోలా ఆడుదాం ఆంధ్రను ముగించారు.

మంత్రి పెద్దిరెడ్డి వెళ్లిన 5 నిమిషాలకే ఖాళీ

చిత్తూరులోని మెసానికల్‌ మైదానంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులతో కలిసి ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రారంభించారు. కార్పొరేషన్‌ అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను, మెప్మా మహిళలను పెద్దఎత్తున తరలించారు. దీంతో ఆటల ప్రారంభోత్సవం ముందు నిండుగా ఉన్న మైదానం.. కార్యక్రమం ముగిసి మంత్రి వెళ్లిపోయిన 5 నిమిషాలకే ఖాళీగా దర్శమిచ్చింది. ప్రేక్షకులే కాదు క్రీడాకారులూ లేకుండా పోయారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీ రంగులు వచ్చేలా బెలూన్లతో వేదికను అలంకరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

సచివాలయ సిబ్బంది, వలంటీర్లే ప్రేక్షకులు

పోటీలకు హాజరయ్యేందుకు క్రీడాకారులకే ఆసక్తి లేకపోవడంతో ఆశించినంత స్పందన రాలేదు. ప్రముఖులు వచ్చిన చోట్ల ప్రేక్షకులను బలవంతంగా తరలించారు. మిగిలినచోట్ల సచివాలయ సిబ్బంది, వలంటీర్లే ప్రేక్షకులుగా వ్యవహరించారు. పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లె హైస్కూల్‌ మైదానంలో ఎమ్మెల్యే ఎంఎ్‌సబాబు పోటీలను ప్రారంభించగా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, వైసీపీ నాయకులు మాత్రమే పాల్గొన్నారు. స్థానిక ప్రజల భాగస్వామ్యం కనిపించలేదు.

కిట్లన్నీ నాసిరకం.. అన్నింటిపై స్టిక్కర్లే లక్ష్యం

పూర్తిస్థాయిలో క్రీడా కిట్లు పంపిణీ చేయలేదు. అందించిన వాటిలో చాలావరకు నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లెలో 5 ఓవర్లు కూడా ఆడకముందే క్రికెట్‌ బ్యాట్‌ విరిగిపోవడం గమనార్హం. దీనిపై క్రీడాకారులు అసహనం వ్యక్తంచేశారు. ప్రతి ఆట వస్తువుపైనా జగన్‌ స్టిక్కర్లు ఉన్నాయి. చాలాచోట్ల కిట్లు ఇవ్వకపోవడంతో క్రీడాకారులు ఇళ్ల నుంచి తెచ్చుకున్న బ్యాట్‌, బాల్‌తో క్రికెట్‌ ఆడారు.

టీడీపీ సానుభూతిపరులను ఆడనివ్వని వైనం

పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లి, పేటఅగ్రహారం పంచాయతీ పరిధిలోని పలువురు యువకులు క్రికెట్‌ ఆడేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరు క్రీడామైదానం వద్దకు వెళ్లగా.. టీడీపీ సానుభూతిపరులనే నెపంతో పేటఅగ్రహారం ఎస్సీకాలనీకి చెందిన ఆరుగురు యువకులను వెనక్కి పంపించేశారు. దీనిపై ఎంపీడీవో గౌరికి మాజీ ఎంపీటీసీ రమేష్‌ ఫిర్యాదు చేశారు. బుధవారం వారిని ఆడిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. ఇలా పలు ప్రాంతాల్లోనూ టీడీపీ సానుభూతిపరుల పేర్లను నమోదు చేయకుండా వలంటీర్లు జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలున్నాయి.

స్కోర్‌ బోర్డుకే పీడీలు పరిమితం

జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఖ్య బాగా తక్కువ. దీంతో పంచాయతీల్లో జరిగే పోటీలను వీరు పర్యవేక్షించలేక పోతున్నారు. వారున్న చోట కూడా కుర్చీల్లో కూర్చొని స్కోర్‌ బోర్డుకే పరిమితమయ్యారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లే ఆటలు ఆడించారు. అంపైర్లుగా వ్యవహరించారు.

Updated Date - Dec 26 , 2023 | 11:35 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising