ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎంవీఐ అరెస్టు
ABN, Publish Date - Dec 30 , 2023 | 01:06 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిత్తూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టరు (ఎంవీఐ) ఆర్‌వీ మధుసూదన్ అరెస్టయ్యారు.
చిత్తూరు సిటీ, డిసెంబరు 29: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిత్తూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టరు (ఎంవీఐ) ఆర్‌వీ మధుసూదన్ అరెస్టయ్యారు. ఈ మేరకు మంగళగిరి నుంచి ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాల ప్రకారం.. అవినీతి అధికారులపై ఏసీబీ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అధికారి ఇంటిపై ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయు) అధికారులు 26వ తేది కేసు నమోదు చేశారు. ఎంవీఐకి సంబంధించి తిరుపతి, మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, బెంగళూరు తదితరప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించారు. ఆయన నివాసమున్న తిరుపతిలోనూ స్థిర, చరాస్తులను గుర్తించారు. ఎంవీఐ పేరుమీద తిరుపతి రూరల్ మండలంలో ఇక ప్లాట్, ఆయన భార్య పేరు మీద తిరుపతిలో ఒక షెడ్ హౌస్, మదనపల్లెలో జి ప్లస్ ఆర్‌సీ భవనం, పులవాండ్లపల్లెలో జీ ప్లస్ పెంట్ హౌస్, పలమనేరులో 23 ఎకరాల వ్యవసాయ భూమి, ఆయన భార్య, తండ్రి పేరుమీద మదనపల్లె, తిరుపతి, చిత్తూరు, పలమనేరు, బెంగళూరులో 15 ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. చరాస్తులుగా.. సుమారు రూ.30 లక్షల విలువచేసే 3 కార్లు, ఎలక్రికల్ మోటార్ సైకిల్, రూ.5.10 లక్షల నగదు, 2055 గ్రాముల బంగారు, 2.4 లక్షల విలువచేసే వెండి వస్తువులు, 26 లక్షల విలువచేసే గృహోపకరణాలు, రూ.10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కేసు దర్యాప్తులో ఉంది. అనంతరం మధుసూదన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
Updated Date - Dec 30 , 2023 | 01:06 AM