గుర్తుతెలియని యువతి హత్య
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:14 AM
పంటకాలువలో తేలిన శవం
శ్రీకాళహస్తి డిసెంబరు 17: గుర్తుతెలియని ఓ యువతిని హత్య చేసి శవాన్ని పంటకాలవలో వదిలి వెళ్ళిన దారుణ ఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపింది.రూరల్ సీఐ అజయ్ కుమార్ కథనం మేరకు...శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం సమీపంలో తొండమనాడు రహదారి ఉంది. దానికి ఆనుకుని ఉన్న పంట కాలువ కల్వర్టు దగ్గర గుర్తు తెలియని శవం పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మొదట గోతం పట్టలు, టెంకాయ మట్టలు కప్పి ఉండడంతో జంతు కళేబరంగా అనుమానించారు. చెత్తను తొలగించి చూశాక యువతి మృతదేహంగా గుర్తించి భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో సీఐ అజయ్ కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.తిరుపతి నుంచి డాగ్ స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహం పడి ఉన్న ప్రదేశం నుంచి డాగ్ స్క్వాడ్ కొంత దూరం పరిగెత్తి ముళ్లపొదల్లోకి వెళ్లి ఆగింది. అనంతరం క్లూస్ టీం విచ్చేసి మృతదేహం, ఘటనా స్థలం నుంచి పలు నమూనాలను సేకరించారు.యువతి కంటి వద్ద గాయం ఉన్నట్లు...కుడి చేతిపై ఇంగీష్‌లో మోమ్ అని సంగీత స్వరాల గుర్తులో పచ్చబొట్టు ఉన్నట్టు గుర్తించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతితో పాటు పొరుగు జిలాల్ల పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ఇటీవల నమోదైన అదృశ్యం కేసులపై ఆరా తీస్తున్నారు. సెల్‌ఫోన్ డంపర్ ద్వారా సాంకేతికంగా దర్యాప్తు సాగిస్తున్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:14 AM