ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం
ABN, First Publish Date - 2023-12-11T01:31:10+05:30
రాజ్యాంగబద్ద పాలన జరగకపోతే ప్రమాదాలు తప్పవని సిటిజన్ ఫర్ డెమొక్రసీ (సీఎ్‌ఫడీ) ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎ్‌ఫడీ సమావేశంలో వక్తల ఉద్ఘాటన
తిరుపతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగబద్ద పాలన జరగకపోతే ప్రమాదాలు తప్పవని సిటిజన్ ఫర్ డెమొక్రసీ (సీఎ్‌ఫడీ) ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులే న్యాయం చేయకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. ఓటరు జాబితాలో అవకతవకలను ప్రస్తావించారు. లోపాలు సవరించకుండానే ముసాయిదా ఓటరు జాబితా ఇచ్చారని, వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పాలకులనుంచి ప్రజలే పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. చట్టాలు పాలకుల చుట్టాలు కావని, రాజ్యాంగానికి లోబడే ఎవరైనా వ్యవహరించాలని స్పష్టంచేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సరైన ఓటరు జాబితా కోసం సీఎ్‌ఫడీ పోరాటం చేస్తోందన్నారు. ఓటరు జాబితాలో లోపాలను సవరించకుండా ముసాయిదా జాబితా తీసుకురావడం లోపభూయిష్టమని స్పష్టంచేశారు. సీఎ్‌ఫడీ సంస్థ తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్‌లో ఆదివారం సమావేశం నిర్వహించింది. ‘రాజ్యాంగ పరిపాలన- న్యాయపరమైన క్రియాశీలత’ అంశంపై కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎంఎన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో సీఎ్‌ఫడీ సభ్యులు ఫల్గుణ కుమార్, లక్ష్మణ్‌రెడ్డి, రఘు, టీడీపీ నేతలు సుగుణమ్మ, ఆర్సీ మునికృష్ణ, జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, సుభాషిణి, ఎస్వీయూ మాజీ వీసీ మురళి, టీటీడీ మాజీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
చట్టప్రకారం బతకడానికి ఒకరి అనుమతి అవసరంలేదు : జస్టిస్ ఎంఎన్ రావు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
చట్టప్రకారం బతకడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. దురదృష్టవశాత్తు ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద బతికే రోజులు ఉన్నాయి. పాలకులకు రాజ్యాంగం ఏవిధమైన హక్కు ఇచ్చిందో, లోపాలను అడిగే హక్కు న్యాయవ్యవస్థకు కూడా ఉంటుంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నేను న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చట్టం వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. ఒక్కరోజులోనే అమలయ్యేలా చేశాం. ఆ తర్వాత 20 ఏళ్లకి దేశవ్యాప్తంగా ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. ఇలాంటి అనేక ప్రజాప్రయోజనాల చట్టాలను ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. న్యాయస్థానాలకు ప్రమాదం వాటిల్లితే రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
హింసకు తావులేకుండా ఎన్నికలు జరగాలి : నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల మాజీ ప్రధానాధికారి
హింసకు తావులేకుండా ఎన్నికలు జరగాలి. తప్పుడు కేసులు పెట్టడం, చిన్నచిన్న కేసులకూ పెద్ద సెక్షన్లు పెట్టి అరెస్టు చేయడం ఏపీలో చూస్తున్నాం. అంటే ఎన్నికల ముందుగానే ప్రజలను భయబ్రాంతులను చేయడంలో భాగంగా కనిపిస్తోంది. సచివాలయ వ్యవస్థను ఎన్నికలకు వాడుకోవడం సరైంది కాదు. వీరంతా ఒక పార్టీకే పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలని సీఎ్‌ఫడీ ప్రయత్నిస్తోంది.
ప్రజలు ఎక్కడికిపోవాలి? : ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
పాలకులు న్యాయం చేయకపోతే ప్రజలు ఎక్కడికెళ్లాలి ? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతి పౌరుడు ప్రయత్నించాలి. రాజ్యాంగ పాలన జరగకపోతే ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయి. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగితే భయపడాల్సిన అవసరం లేదు. మనం బ్రిటీష్ కాలంలో బతకడం లేదు కాబట్టి ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి.
ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత అవసరం : భవానీ ప్రసాద్, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి
సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికీ అవసరం ఉంది. నేటి పాలకులు సామాజిక విలువలు, రాజ్యాంగ స్ఫూర్తికి సమాధి కడుతున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్య వాదులకు బాధ కలిగిస్తున్నాయి.
ఎంఎన్ రావుతో ప్రశ్నోత్తరాలు
? బాధ్యతలను విస్మరించే వారిని హక్కుల నుంచి దూరం చేయలేమా : జీడీ నాయుడు, తిరుపతి
! అటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయవద్దు. ఓటు వేయకపోతే అలాంటి వారికి అధికారం రాదు కదా.
? రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూచట్టం రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా : దినకర్, న్యాయవాది
! రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం భూములు తీసుకోవడానికి వీల్లేదు.
? పోలింగ్ రోజు సెలవు తీసుకుని ఓటింగ్‌కు వెళ్లని ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేమా? : కుమార్, తిరుపతి
! న్యాయపరంగా కొన్ని అడ్డంకులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రాథమిక హక్కుకు నిర్బంధంగా ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. న్యాయస్థానాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
? ఆధార్ కార్డుతో ఓటు హక్కును అనుసంధానం చేసేలా సీఎ్‌ఫడీ చర్యలు తీసుకోవచ్చుకదా? : డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
! దీనిపై కసరత్తు జరుగుతోంది. సీఎ్‌ఫడీ తరపున కూడా ప్రతిపాదనలు పంపుతాం.
Updated Date - 2023-12-11T01:31:11+05:30 IST