ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇది కరువు కాదా?

ABN, First Publish Date - 2023-11-02T02:11:08+05:30

రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన కరువు ప్రాంతాల జాబితాలో జిల్లా చోటు దక్కకపోవడం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.నిజానికి గత జూన్‌ నుంచీ ఇప్పటి వరకూ వర్షపాతం పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

పెళ్ళకూరు మండలంలో దుక్కులు పూర్తి చేసుకుని వర్షం కోసం నిరీక్షిస్తున్న పొలాలు

- జూన్‌, జూలై, అక్టోబరు నెలల్లో వర్షాభావం

- ఆగస్టులో మాత్రమే సాధారణ వర్షపాతం

- అడుగంటిన చెరువులు, రిజర్వాయర్లు

- నీటి కొరతతో సాగుకాని భూములు

- కరువు మండలాల ప్రకటనలో అన్యాయం

తిరుపతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన కరువు ప్రాంతాల జాబితాలో జిల్లా చోటు దక్కకపోవడం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.నిజానికి గత జూన్‌ నుంచీ ఇప్పటి వరకూ వర్షపాతం పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాదాపుగా చెరువులన్నీ చుక్క నీరు లేకుండా ఎండిపోయి వున్నాయి. రిజర్వాయర్లలో సైతం నీళ్లు అడుగంటిపోయాయి. చివరికి తెలుగు గంగ కాలువల్లో కూడా నీటి ప్రవాహం నిలిపివేశారు. దీంతో వరి, వేరుశనగ పొలాలతో కళకళలాడుతూ కనిపించాల్సిన చెరువులు, రిజర్వాయర్ల కింద ఆయకట్టు భూములన్నీ బీడుగా మారాయి. స్వర్ణముఖి, కాళంగి నదుల పరీవాహక ప్రాంతాల్లో సైతం పొలాలు సాగు కావడం లేదు. ఆయాచోట్ల కూడా వరి పంట సాగు చేయొద్దని ఇరిగేషన్‌ అధికారులు సూచిస్తుండడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.

26 మండలాల్లో వర్షాభావం

జిల్లాలోని 34 మండలాల్లో జూన్‌ నుంచీ వర్షపాతాన్ని పరిశీలిస్తే ఏకంగా 26 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని వున్నాయి. జూన్‌లో 37.6 శాతం, జూలైలో 49.4 శాతం, ఆగస్టులో 2.1 శాతం, అక్టోబరులో 87.5 శాతం చొప్పున వర్షపాత లోటు ఏర్పడింది. కేవలం సెప్టెంబరులో మాత్రమే 36 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. జూన్‌ నుంచీ ఇప్పటి వరకూ తీసుకుంటే మొత్తం మీద 30.5 శాతం వర్ష లోటు నెలకొంది. మండలాల వారీగా చూస్తే కోట, వాకాడు మండలాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడగా వరదయ్యపాలెం, కేవీబీపురం, బీఎన్‌ కండ్రిగ, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, రామచంద్రాపురం, వెంకటగిరి, డక్కిలి, బాలయపల్లి. గూడూరు, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేట, తడ, దొరవారిసత్రం, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లో వర్షాభావం నెలకొంది. కేవలం సత్యవేడు, పిచ్చాటూరు, నాగలాపురం, నారాయణవనం, తిరుపతి రూరల్‌, చంద్రగిరి, పాకాల మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.

వాకాడులో ఎండిపోతున్న వరిమళ్ళు

స్వర్ణముఖి నదిలో తెలుగు గంగ జలాలను చూసి సాగునీరు అందుబాటులో వుందన్న నమ్మకంతో వాకాడు మండలంలో రైతులు వరి మడులు నాటారు. నెల రోజులు గడిచిపోయినా తెలుగు గంగ జలాలను ఇరిగేషన్‌ అధికారులు విడుదల చేయడం లేదు. సరికదా స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో వరి సాగు చేయొద్దని సలహా ఇస్తున్నారు. వర్షాలు పడనందున నీటిని విడుదల చేయడం లేదు. దీంతో రైతులు నాటిన వరిమళ్ళు ఎండిపోతున్నాయి.

దుక్కులు దున్ని... వర్షాల కోసం నిరీక్షణ

పెళ్ళకూరు మండలంలో రబీ సీజన్‌కు సంబంధించి 1200 ఎకరాల్లో వరిపైరు సాగు కావాల్సి వుంది. అయితే వర్షాభావంతో పొలాలన్నీ బీడుగా మారాయి. బావుల కింద 98 ఎకరాల ఆయకట్టు భూముల్లో మాత్రమే వరి నాట్లు వేశారు. గత నెలలో 230 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి వుండగా మండలంలో కురిసింది కేవలం 34 మిల్లీమీటర్లు మాత్రమే. ఈ కారణంగా దుక్కులు దున్నిన రైతులు వర్షాల కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు.

దొరవారిసత్రంలో పరిస్థితి దారుణం

దొరవారిసత్రం మండలంలో 125చెరువులు ఎండిపోయాయి. తీవ్ర వర్షాభావం నెలకొంది. బోర్లు, బావుల కింద నారు మడులు పోసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తుంటే మిగిలిన చోట్ల దుక్కులు దున్ని వర్షాల కోసం చూస్తున్నారు. ఇక నెలబల్లి, నెల్లూరుపల్లి, వేణుంబాక గ్రామాలకు తెలుగు గంగ నీరు అందుబాటులో వుండేది. ఈ ఏడాది నీటిని విడుదల చేయకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా ఈ గ్రామాల్లో కూడా భూములన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి. చివరికి కాళంగి నది పరివాహక ప్రాంతంలో కూడా ఇప్పటి వరకూ వరినాట్లు వేయలేదు.

పొలాలన్నీ పిచ్చి మొక్కలతో ...

బీఎన్‌ కండ్రిగ మండలంలో ఇంకా దుక్కులు దున్నకపోవడంతో పొలాలన్నీ పిచ్చి మొక్కలతో కనిపిస్తున్నాయి. మండలంలో ఏటా రబీ సీజనులో 9 వేల ఎకరాల్లో వరి పంట, నాలుగు వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తారు. అయితే ఇపుడు వర్షాభావంతో చెరువుల్లోకి నీరు రాలేదు. ఫలితంగా బోరు బావులున్న రైతులు మాత్రమే పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఏటా తెలుగు గంగ కాలువలో నీరు అందుబాటులో వుండడం వల్ల ముందస్తుగా పంటలు సాగు చేసేవారు. ఇపుడు మూడు నెలలుగా నీటి విడుదల ఆపేయడంతో 80 శాతం రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

పలు మండలాల్లో ఇదే దుస్థితి

నాయుడుపేట మండలంలో దాదాపుగా చెరువులన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. వరి పంట సాగయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు పొలాలన్నీ బీడుగా కనిపిస్తున్నాయి. చిట్టమూరు మండలంలో తీవ్ర వర్షాభావంతో చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. తెలుగు గంగ నీరు కూడా కాలువల్లో రాకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. సూళ్ళూరుపేట మండలంలోనూ దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం నిరీక్షిస్తున్నారు. మండలంలో చెరువులన్నీ పూర్తిగా అడుగంటిపోవడంతో కోటపోలూరు, పడమటి కండ్రిగ, ఇలుపూరు గ్రామాల్లో మాత్రమే బోరు బావులున్న రైతులు వరినాట్లకు సిద్ధమవుతున్నారు. ఏర్పేడు మండలంలో ఏటా రబీకి 11 వేల ఎకరాల్లో వరి పంట, 500 ఎకరాల్లో వేరుశనగ సాగయ్యేవి. ఈసారి వర్షాలు లేకపోవడంతో దుక్కులు దున్ని రైతులు వర్షాల కోసం వేచి చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో ఇలాంటి వాతావరణమే ఏర్పడింది. అయితే ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో జిల్లాను విస్మరించినట్టు కనిపిస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను, పంటల సాగు దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో ప్రజాప్రతినిధులు విఫలమైనట్టు రైతులు భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిల్లాలో వర్షాభావానికి గురైన మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాల్సివుంది.

Updated Date - 2023-11-02T02:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising