కొనసాగిన అంగన్వాడీల ఆందోళన
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:13 AM
క్రిస్మస్ పండుగ రోజు కూడా జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగులు తమ సమ్మె కొనసాగించారు.
తిరుపతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ పండుగ రోజు కూడా జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగులు తమ సమ్మె కొనసాగించారు. సోమవారం పలుచోట్ల ఆందోళనా శిబిరాల్లోనే ఉద్యోగులు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. పుత్తూరులో రిలే నిరాహార దీక్ష కొనసాగించిన ఉద్యోగులు చెప్పులు పాలిష్ చేసి ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల నిరసన వ్యక్తం చేయగా నాయుడుపేట పట్టణంలో సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో శిబిరం వద్ద పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు సహపంక్తి భోజనాలు చేశారు. గూడూరు, కోటలలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపట్టిన ఉద్యోగులు ఒంటి కాలిపై నిలుచుని వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సత్యవేడు, పిచ్చాటూరు, గూడూరులలో శిబిరాలలోనే ఉద్యోగులు కేక్‌లు కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. గూడూరులో ఉద్యోగుల ఆందోళనకు ఏపీటీఎఫ్ నాయకులు మద్దతు ప్రకటించారు. వెంకటగిరి, చంద్రగిరి కేంద్రాల్లో సోమవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
Updated Date - Dec 26 , 2023 | 02:13 AM