కమ్మపల్లె ఘటనలో టీడీపీ వారిపై హత్యాయత్నం కేసు
ABN, First Publish Date - 2023-12-11T01:32:36+05:30
సోమల మండలం 81 చిన్నఉప్పరపల్లె పంచాయతీ కమ్మపల్లెలో శనివారం రాత్రి జరిగిన గొడవలో పోలీసులు తెలుగుదేశంపార్టీ వర్గీయులపై హత్యాయత్నం కేసు, వైసీపీ వర్గీయులపై బెయిలబుల్ కేసులు ఆదివారం రాత్రి నమోదు చేశారు.
పుంగనూరు, డిసెంబరు 10: సోమల మండలం 81 చిన్నఉప్పరపల్లె పంచాయతీ కమ్మపల్లెలో శనివారం రాత్రి జరిగిన గొడవలో పోలీసులు తెలుగుదేశంపార్టీ వర్గీయులపై హత్యాయత్నం కేసు, వైసీపీ వర్గీయులపై బెయిలబుల్ కేసులు ఆదివారం రాత్రి నమోదు చేశారు. కమ్మపల్లెలో డ్వాక్రాసంఘం సంఘమిత్ర మమతను తొలగించి వైసీపీ మద్దతురాలిని నియమించి డ్వాక్రా పుస్తకాలు అప్పగించాలని ఏపీఎం శివయ్య ఒత్తిడి చేయడం, పోలీసు కేసులతో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమ్మపల్లెకు సోమల ఎస్‌ఐ వెంకటనరసింహులు, వారి సిబ్బంది, మరికొందరు బయట వ్యక్తులు వెళ్లడం, అక్కడ గొడవ జరగడం, గ్రామస్తులపై దాడి, బట్టలు చింపిన విషయం పాఠకులకు తెలిసిందే. తమపై తెలుగుదేశం పార్టీ వర్గీయులైన హరీ్‌షనాయుడు మరో పది మంది కర్రలు, రాళ్లతో దాడి చేసి సోమలకు చెందిన ఇద్దరిని కత్తితో గాయపరిచారని వైసీపీ మద్దతురాలు నందిని ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ వారిపై హత్యాయత్నం కేసును ఎస్‌ఐ వెంకట నరసింహులు నమోదు చేశారు. వైసీపీ మద్దతురాలు దివ్య, జి.నందిని, జానకమ్మ, భవ్య, జయంతి తమపై గొడవ చేశారని కమ్మపల్లెకు చెందిన టీడీపీ మద్దతురాలు మనెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
ఆ ఫిర్యాదులపై నమోదుకాని కేసులు
ఎస్‌ఐ సమక్షంలోనే తమపై బయట వ్యక్తులు దౌర్జన్యం చేసి దాడి చేసి దుస్తులు చింపారని శనివారం రాత్రి చౌడేపల్లె సీఐ కృష్ణారెడ్డికి కమ్మపల్లెకు చెందిన టీడీపీ మద్దతుదారులైన జి.శేషాద్రి, కే.పాపావతమ్మ, ఎం.మమత, బి.ఉషారాణి, వెంకట్రమణలు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. వైసీపీ వర్గీయులు పదలగుంటపల్లె నాగసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యంరెడ్డి, హరినాథరెడ్డి, మునిరెడ్డి, రమేశ్, దివ్య, జానకమ్మ, సుబ్బారెడ్డి, జయంతి, నందిని, భార్గవి, దేవమ్మ, హేమ, విజయకుమార్, గిరిజమ్మ, శశి తదితరులు తమపై దాడి చేసి హతమార్చుతామని బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని ప్రస్తావించారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు కేసులేవీ నమోదు చేయలేదు.
కమ్మపల్లెలో పోలీసు పికెటింగ్
సోమల: సోమల మండలం కమ్మపల్లెలో ఆదివారం ఉదయం నుంచి పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘమిత్ర నియామక విషయమై నెల రోజులుగా గ్రామంలో వివాదాలు జరుగుతున్నాయి. మహిళా సంఘాలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రెండువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సోమల, సదుం, చౌడేపల్లె, పుంగనూరు, కల్లూరు పోలీసులు కమ్మపల్లెకు చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణలో గాయపడడంతో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనలతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాగా, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం కమ్మపల్లె గ్రామాన్ని సందర్శించారు. టీడీపీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులతో ఘర్షణ విషయంపై ఆరా తీశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
Updated Date - 2023-12-11T01:32:37+05:30 IST