కిక్కిరిసిన కొండ
ABN, Publish Date - Dec 24 , 2023 | 01:34 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. గోవిందనామస్మరణలతో ఆలయం, క్యూలైన్లు, మాడవీధులు మార్మోగాయి.
- ప్రశాంతంగా వైకుంఠద్వార దర్శనాలు
- స్వర్ణరథంలో దర్శనమిచ్చిన మలయప్ప
తిరుమల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. గోవిందనామస్మరణలతో ఆలయం, క్యూలైన్లు, మాడవీధులు మార్మోగాయి.ఏకాదశిని పురస్కరించుకుని శనివారం వేకువజామున ధనుర్మాసం కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలను 1.30 గంటల నుంచి మొదలుపెట్టారు. నిరంతరాయంగా సుప్రీం కోర్టుతో పాటు వివిధ రాష్ర్టాల హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులకు ఉదయం 5.15 గంటల వరకు దర్శనం చేయించారు. తర్వాత టోకెన్లు పొందిన సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతించారు.నిర్దేశిత సమయం కంటే 45 నిమిషాలు ముందుగానే శనివారం ఉదయం 5.15 గంటలకు సర్వదర్శనం ప్రారంభించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం కలిపి రోజుకు దాదాపు 70 వేల మందికి, పదిరోజుల్లో దాదాపు 8 లక్షల మందికి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.శనివారం అర్థరాత్రి వరకు భక్తులు స్లాట్ల వారీగా శ్రీవారిని దర్శించుకుని వైకుంఠద్వార ప్రవేశం చేసి ఆనందపరవశులయ్యారు.శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, రోడ్డు, కాటేజీలు, అఖిలాండం, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద భవనం వంటి ప్రాంతాలు భక్తులతో సందడిగా దర్శనమిస్తున్నాయి.ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం స్వర్ణరథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు.స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో లాగారు.అలాగే గీతాజయంతిని పురస్కరించుకుని నాదనీరాజనం వేదికపై శనివారం భగవద్గీత అఖండ పారాయణం జరిగింది. ప్రముఖ పండితులు విశ్వనాథ శర్మ, శేషాచార్యులు, మారుతి ఆధ్వర్వంలో పండితులు భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలను పారాయణం చేశారు.అంతకుముందు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు.శ్రీవారి భక్తులు సంతృప్తికరంగా వైకుంఠద్వార దర్శనం చేసుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి తెలిపారు.
Updated Date - Dec 24 , 2023 | 01:34 AM