Tirumala Walk way Tiger Attack : చిన్నారిని మింగిన చిరుత
ABN, First Publish Date - 2023-08-13T02:32:00+05:30
తిరుమల నడక మార్గంలో ఘోరం చోటు చేసుకుంది. అలిపిరి కాలినడక మార్గంలో తల్లిదండ్రులతో కలసి వెళ్తున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడిచేసి హతమార్చింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన ఆటో డ్రైవర్ దినేశ్‌కుమార్ కుటుంబ సభ్యులతో పాటు శుక్రవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. ఐదేళ్ల
తిరుమల నడక మార్గంలో ఘోరం
నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలికపై దాడి చేసిన మృగం
లాక్కెళ్లి.. మెడ, తల, కుడి కాలును తినేసి మాయం
సమీపంలోని ఓ కొండపై మృతదేహం గుర్తింపు
కుమారుడి తలనీలాలకు వచ్చిన కుటుంబంలో విషాదం
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ సంతాపం
తిరుమల(ఆంధ్రజ్యోతి)/ తిరుపతి సిటీ, ఆగస్టు 12: తిరుమల నడక మార్గంలో ఘోరం చోటు చేసుకుంది. అలిపిరి కాలినడక మార్గంలో తల్లిదండ్రులతో కలసి వెళ్తున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడిచేసి హతమార్చింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన ఆటో డ్రైవర్ దినేశ్‌కుమార్ కుటుంబ సభ్యులతో పాటు శుక్రవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. ఐదేళ్ల కుమారుడు లిఖిత్ తలనీలాలు సమర్పించేందుకు భార్య శశికళ, కుమార్తె లక్షిత, మరో ఐదుగురు కలసి మధ్యాహ్నం 3గంటలకు అలిపిరి నుంచి తిరుమలకు నడక మొదలుపెట్టారు. రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వారి కుమార్తె లక్షిత(6) కన్పించకపోవడాన్ని గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో దగ్గర్లోని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా రాత్రి 10.30గంటలకు పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్ సిబ్బందితో అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నడక మార్గానికి 150అడుగుల దూరంలో ఓ కొండపై లక్షిత మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, తలతో పాటు కుడికాలును చిరుత తినేసి పోయినట్టు గుర్తించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. శ్రీవారికి తమ కుమారుడి తలనీలాలు సమర్పించేందుకు వచ్చి కుమార్తెను కోల్పోయామంటూ లక్షిత తల్లి శశికళ రోదనలు రుయాస్పత్రిలో చూపరులను కంటితడి పెట్టించాయి. తొలుత చిన్నారిపై దాడి చేసింది ఎలుగుబంటి అని డీఎ్‌ఫవో చెప్పుకొచ్చారు. అయితే పోస్టుమార్టం తరువాత చిరుత దాడేనని ప్రాథమికంగా తేల్చారు.
51రోజుల ముందు బాలుడిపై దాడి
లక్షితపై చిరుత దాడి చేసిన ప్రదేశానికి కిలోమీటరు దూరంలోని ఏడో మైలు వద్ద జూన్ 22న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్(4) అనే బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు చిన్నపాటి గాయాలతో ఆ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పడిన చిరుతను దట్టమైన అడవిలో విడిచిపెట్టారు. అయితే పట్టుబడింది పిల్ల చిరుత అని, తల్లి చిరుత నడకమార్గానికి సమీపంలోనే తిరుగుతోందన్న అనుమానంతో బోన్లను అలాగే ఉంచారు. రెండు నెలలు గడవకముందే చిరుత దాడిలో ఓ బాలిక హతమైపోయింది. దీంతో టీటీడీపై విమర్శలు మొదలయ్యాయి. తొలుత ఘటన జరిగినప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంత దారుణం జరిగేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
10 లక్షల ఎక్స్‌గ్రేషియా: భూమన
చిరుత దాడిలో మృతిచెందిన లక్షిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. బాలిక కనిపించడం లేదని తెలియగానే అఽధికారులు, సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారన్నారు. ఇందులో ఎవరి తప్పూ లేదని చెప్పారు. నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నడకమార్గానికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేసేందుకు నివేదిక అందించాలని డీఎ్‌ఫవోను ఆదేశించారు. చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతిచెందడం విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆ పాప తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్కారు నిర్లక్ష్యం వల్లే లక్షిత బలైపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల అడవుల్లో మ్యానీటర్?
శేషాచలంలో వున్న క్రూరమృగాల్లో ప్రధానమైనవి, ప్రమాదకరమైనవి చిరుతలే. సంఖ్యాపరంగానూ ఎక్కువే ఉన్నాయి. ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు వంటివి వున్నా జన సంచారం ఉన్న దరిదాపులకు అవి రావు. నడక మార్గం పరిసరాల్లో ఎక్కువగా కనిపించేవి చిరుతలే. ఇప్పటి దాకా జరిగిన దాడులను పరిశీలిస్తే చిన్నారులు మాత్రమే చిరుతలకు టార్గెట్‌గా మారుతున్నారు. అలిపిరి పాదాల మండపం నుంచి తిరుమలకు నడకమార్గం పొడవు 8కిలోమీటర్లు. ప్రారంభంలో వాహనాలు, మనుషుల సందడి, దుకాణాలు ఉన్న కారణగా ఆ ప్రాంతంలో ఎక్కడా జంతువుల సంచారం కనిపించదు. ఏడో మైలు నుంచి లక్ష్మినరసింహస్వామి ఆలయం వరకూ 4కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలోనే వన్యప్రాణులు నడకదారిని దాటి అటూఇటూ రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది. తాజా ఘటనలో చిన్నారి లక్షితను చిరుత లాక్కెళ్లి హతమార్చిన చిరుత మ్యానీటర్‌గా మారిందనే భావిస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం దాడులు చేయడం, గాయపరచడం వరకే పరిమితమైన చిరుత ఇపుడు మనిషి రక్తాన్ని రుచి చూసింది. ఈ చిరుత మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నిత్యం భక్తుల రాకపోకలు సాగుతుంటాయి. ఇప్పుడు వీరంతా భయాందోళనతో నడవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
Updated Date - 2023-08-13T06:17:14+05:30 IST