జనసేనలోకి చంటిబాబు?
ABN, Publish Date - Dec 30 , 2023 | 02:53 AM
జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.
పవన్‌తో జగ్గంపేట ఎమ్మెల్యే భేటీ!
కాకినాడలో రాత్రి గంటకుపైగా చర్చలు
కాకినాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం రాత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కాకినాడలో రహస్యంగా సమావేశమయ్యారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో గంటకు పైగా చర్చలు జరిపారు. వైసీపీలో తనకు ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలియజేసి చంటిబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. జగ్గంపేటలో ఆయన్ను తప్పించి మాజీ మంత్రి తోట నరసింహానికి టికెట్ ఇవ్వడం ఖాయమైంది. దీనిపై వైసీపీ అధిష్ఠానం ఆయనకు స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇటీవల తాడేపల్లిలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనతో చర్చించి విషయం చెప్పేశారు. దీనిపై తాను జగన్‌తోనే తేల్చుకుంటానని చంటిబాబు బదులిచ్చి వచ్చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మూడ్రోజుల క్రితం జగ్గంపేటలో ఆయన వర్గానికి చెందిన జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్, కిర్లంపూడి, గండేపల్లి జడ్పీటీసీలు, కిర్లంపూడి ఎంపీపీలతో పార్టీకి రాజీనామా చేశారు. దీనిపై జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలంలో శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో చంటిబాబు వ్యాఖ్యానిస్తూ.. వారంతా తనకు సీటు ఇవ్వనందుకు రాజీనామా చేయలేదని, తోట నరసింహానికి టికెట్ కేటాయించడం నచ్చకే వైదొలిగారని చెప్పారు. కాగా.. చంటిబాబు చేరికకు పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 2009, 14ల్లో జగ్గంపేటలో చంటిబాబు టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు.
Updated Date - Dec 30 , 2023 | 02:53 AM