విధేయుడికి వీరతాడు!
ABN, First Publish Date - 2023-11-10T03:50:59+05:30
అధికార పార్టీ వీరవిధేయులకు ప్రమోషన్ల వీరతాళ్లు పడుతున్నాయి. ఈ క్రమంలో కోర్టుల ఆదేశాలు, మార్గదర్శకాలు కూడా బుట్టదాఖలవుతున్నాయి. ఆఖరుకు ప్రభుత్వమే ఇచ్చిన గజిట్ నోటిఫికేషన్, జీవోలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో వెలుగు చూసిన పదోన్నతి
పంచాయతీరాజ్ శాఖలో డీఈఈకి సీఈగా ప్రమోషన్
దొడ్డిదారిలో పదోన్నతి.. ఫైల్ సిద్ధం, త్వరలో ఉత్తర్వులు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
అధికార పార్టీ వీరవిధేయులకు ప్రమోషన్ల వీరతాళ్లు పడుతున్నాయి. ఈ క్రమంలో కోర్టుల ఆదేశాలు, మార్గదర్శకాలు కూడా బుట్టదాఖలవుతున్నాయి. ఆఖరుకు ప్రభుత్వమే ఇచ్చిన గజిట్ నోటిఫికేషన్, జీవోలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో వెలుగు చూసిన పదోన్నతి వ్యవహారం దీనికి అద్దం పట్టింది. విజయవాడలోని ఈఎన్‌సీ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు(సీఈ) లెక్కకుమించి ఉన్నారు. అయినప్పటికీ మనవాడు తలుచుకుంటే అన్నట్టుగా మరో పోస్టును సృష్టించి సీనియారిటీ జాబితాలో లేని వ్యక్తికి కట్టబెట్టేందుకు గుట్టుగా ఫైల్‌ను సిద్ధం చేశారు. రేపో, మాపో ‘మనవాడికి’ సీఈగా పోస్టు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అయితే, డీఈఈ హోదా ఉన్న అధికారికి నేరుగా సీఈ పోస్టును ఇచ్చేందుకు సాగుతున్న ప్రయత్నాలు వివాదంగా మారాయి. పీఆర్ ఈఎన్‌సీ కార్యాలయంలో ఈఎన్‌సీతో కలిపి 4 సీఈ పోస్టులు ఉన్నాయి. అదనపు సీఈ పోస్టు అవసరం లేదు. కానీ, తాగునీటి కార్పొరేషన్‌లో పనిచేస్తున్న నాయక్ అనే డీఈఈకి చీఫ్ ఇంజనీర్(సీఈ) గా పదోన్నతి ఇవ్వటానికి ఫైల్ సిద్ధం చేశారు. సీఈ పోస్టులకు రోస్టర్ లేదు. ఈఎన్‌సీతో కలిపి నలుగురు సీఈలు ఉండగా.. దొడ్డిదారిన ఐదవ చీఫ్ ఇంజనీర్‌గా నాయక్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి నాయక్ కంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న వారు చాలా మంది ఉన్నా.. వారందరినీ పక్కన పెట్టడం వివాదంగా మారింది.
నాయక్‌కు అధికారపార్టీ నేతలతో ఉన్న సత్సంబంధాలు, శాఖ ఉన్నతాధికారులతో ఉన్న అనుబంధాలు ఇలా కారణాలు ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా సీఈ పోస్టు ఇస్తుండడం చర్చకు దారితీసింది. పోనీ, నాయక్‌కు రిజర్వేషన్ల ప్రాతిపదికన పదోన్నతి కల్పిస్తారనుకుంటే.. ఆ దామాషా ప్రకారం ఇప్పటికే పదోన్నతులు పూర్తయ్యాయి. గతంలో పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. అయినా, పాత విధానాన్నే అమలు చేస్తున్నారు. దీంతో సీనియారిటీ ఉన్న 20 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వానికి మళ్లీ కొన్ని సూచనలు చేసింది. ప్రభుత్వం ఈ దఫా గజిట్ నోటిఫికేషన్‌ను వెలువరించింది. దీనిని కూడా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేసి.. పాత విధానాన్నే తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే నాయక్‌కు నేరుగా సీఈ పోస్టు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. దీని వెనుక ముడుపుల పర్వం కూడా నడిచిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Updated Date - 2023-11-10T03:51:00+05:30 IST