‘శంషాబాద్’లో అయ్యప్పల అగచాట్లు
ABN, Publish Date - Dec 18 , 2023 | 02:49 AM
ఎయిరిండియా నిర్వహకంతో రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అగచాట్లుపడ్డారు.
సాంకేతిక కారణంతో విమానం నిలిపివేత
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎయిరిండియా నిర్వహకంతో రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అగచాట్లుపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా(కనెక్టింగ్) కోచి వెళ్లాల్సిన విమానాన్ని సాంకేతిక కారణాల పేరుతో నిలిపివేశారు. దాంతో.. శబరిమలకు వెళ్లాల్సిన భక్తులంతా కొన్ని గంటలపాటు విమానాశ్రయంలో పడిగాపులుకాచారు. అదే సమయంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లేందుకు విమానాశ్రయానికి రావడంతో.. భక్తులంతా ఆయనతో తమ గోడును వెల్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన బండి సంజయ్.. కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫోన్ చేసి, విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయ్యప్ప భక్తుల పరిస్థితిని వివరించి, వీలైనంత త్వరగా వారి సమస్యను తీర్చాలని కోరారు. సింధియా వెంటనే ఎయిరిండియా అధికారులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అయ్యప్ప సన్నిధికి వెళ్లొస్తూ మృత్యువాత
మంగపేట: తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన సుబ్బయ్యనాయుడు, నర్రా సాంబయ్య, నిమ్మల వెంకట రాజు, అజయ్, రాములు, మరికొందరు భక్తులు ఇరుము డులు కట్టుకుని ఈ నెల 14న శబరిమల వెళ్లారు. అయ్య ప్ప దర్శనం తర్వాత ఈ ఐదుగురు కలిసి ఆదివారం ఓ కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని పెరియాకుళం మండలం దేవనపట్టి బైపాస్ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో సుబ్బయ్యనాయుడు, వెంకటరాజు, సాంబయ్య అక్కడికక్కడే మరణించారు.
Updated Date - Dec 18 , 2023 | 02:49 AM