ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అట్రాసిటీ! అణచివేతకే..

ABN, First Publish Date - 2023-11-06T04:48:24+05:30

ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పుడూ.. ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు’ అని అంటుంటారు. వారికి మాత్రం ఆయన ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది.

అధికార పార్టీ గుప్పిట్లో ఎస్సీ, ఎస్టీ చట్టం

అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు.. బాధితులకు అండగా నిలిచినా కేసులు.. ప్రతిపక్ష నేతలు, సామాన్యులపై దాడులు చేసి మరీ వారిపైనే కేసులు.. భూ ఆక్రమణలకు, దౌర్జన్యాలకు పాల్పడి బాధితులపైనే కేసులు. రాష్ట్రంలో అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరిది. వైసీపీ శ్రేణుల ఆగడాలకు కొందరు పోలీసు అధికారులు వంత పాడుతున్నారు.

దళితులు, గిరిజనులపై దాడులు చేసినా నిందితులపై అట్రాసిటీ కేసులు ఉండవు. బాధితులు ప్రశ్నిస్తే వారిపైనే పోలీసులు తప్పుడు కేసులు బనాయించిన సంఘటనలు ఉన్నాయి. చివరికి రాజధాని రైతుల ఉద్యమంలో దళితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. దళితులు, గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన చట్టాన్ని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌

వైసీపీ నేతలు, కార్యకర్తలే

దాడులు చేసి మరీ బనాయింపు

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు

బాధితుల్లో దళితులు, గిరిజనులు

లేకపోయినా నమోదు

ఏకంగా దళితులపైనే కేసులు

ఎస్సీ, ఎస్టీలపై ఆగని వైసీపీ దాడులు

వంత పాడుతున్న పోలీసులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పుడూ.. ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు’ అని అంటుంటారు. వారికి మాత్రం ఆయన ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. దళితులు, గిరిజనులకు రాజ్యాంగపరంగా రావాల్సిన పథకాలను దూరం చేయడమే గాక... వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. వందల ఏళ్ల నుంచి సమాజంలో వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు, ద్వేషాలు తగ్గించేందుకు తీసుకొచ్చిన చట్టం వైసీపీ సర్కార్‌ చేతిలో దుర్వినియోగమవుతోంది. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ప్రత్యర్థులపై ఈ చట్టాన్ని ఆయుధంగా వాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే టీడీపీ నేతలు, సామన్యులపై అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు, సామాన్యులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి మరీ వారిపైనే ఎదురు కేసులు బనాయిస్తున్నారు. కొన్నిచోట్ల బాధితులు దళితులు, గిరిజనులు కాకపోయినా పోలీసులు విచిత్రంగా అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. పలుచోట్ల దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగినా నిందితులపై ఈ కేసులు నమోదు చేయకపోవడం విస్తుగొలిపే అంశం. పోలీసు యంత్రాంగం సహకరించడంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని న్యాయ నిపుణులు అంటున్నారు. అట్రాసిటీ కేసులయితే బెయిల్‌ తొందరగా రాదని, జైళ్లలో ఎక్కువ కాలం ఉంటారనే ఉద్దేశంతో ప్రత్యర్థులపై అక్రమంగా బనాయిస్తున్నారని చెబుతున్నారు.

హోం మంత్రిని ప్రశ్నించారని..

రేపల్లె అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ గత ఏడాది మే 2న ఒంగోలు వచ్చిన హోంమంత్రి తానేటి వనితను తెలుగు మహిళలు డిమాండ్‌ చేయడంతో వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొత్తం 16మందిపై కేసు పెట్టారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రాత్రంతా స్టేషన్‌లో నిర్బంధించారు. మొత్తం 12మందికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ప్రకాశంలో అత్యధికం

గత మూడేళ్లుగా ప్రకాశం జిల్లాలో అట్రాసిటీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రతిపక్షాల వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో పెట్టినవే పలు కేసులు ఉన్నాయి. 2020 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆ జిల్లాలో 400కు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే మూడు రోజులకొక కేసు చొప్పున నమోదైంది.

పాత్రికేయులపైనా...

నెల్లూరు జిల్లాలో చురుగ్గా ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులపైనా, అఽధికార పార్టీ నాయకుల తప్పొప్పులను ఎత్తిచూపే పాత్రికేయులపైనా కక్ష తీర్చుకోవడానికి వైసీపీ అట్రాసిటీ చట్టాన్ని ఆయుధంగా మలుచుకుంది. 2019లో 136 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 2020లో 136, 2021లో డిసెంబరు 25వ తేదీ వరకు 124 కేసులు నమోదయ్యాయి. 2022లో కూడా పెద్ద సంఖ్యలోనే అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

బాబు నివాసంపై దాడికి వెళ్లి..

జోగి రమేశ్‌ మంత్రి కాక ముందు టీడీపీ అఽధ్యక్షుడు చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్లగా.. ఆయనను అడ్డుకునేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టారు. జోగి రమేశ్‌ తన డ్రైవర్‌ చేత టీడీపీ యువనేత బ్రహ్మంచౌదరిపై అట్రాసిటీ కేసులు పెట్టించారు. ఆ తర్వాత జగన్‌ మంత్రివర్గంలో జోగి రమేశ్‌కు స్థానం దక్కింది.

బాధితులకు అన్యాయం

దాడులకు, వివక్షకు గురవుతున్న దళిత, గిరిజన వర్గాల రక్షణకు అట్రాసిటీ చట్టాన్ని వాడాల్సి ఉండగా, అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ప్రత్యర్థులపై వాడుతున్నారు. దాడులకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. దాడులు జరిగిన పలు సంఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు కూడా నోచుకోలేని దుస్థితిలో దళిత, గిరిజనులు ఉన్నారు. దళిత, గిరిజన నాయకులు ఉద్యమాలు చేస్తున్నా న్యాయం జరగడం లేదు. పలు గ్రామాల్లో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు వారిపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. బాధితులు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోగా... వారిపైనే తప్పుడు కేసులు బనాయించిన సంఘటనలు ఉన్నాయి. రాజధాని రైతుల ఉద్యమం సందర్భంగా కొంతమంది దళితులపైనే పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో కొన్ని గ్రామాల్లో దళితులను దేవాలయాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నా.. సెలూన్‌లలో దళితులకు కటింగ్‌ చేశారని షాపులను మూసేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దళితులు వివక్ష ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో సివిల్‌ రైట్స్‌ డేలు జరిపి అవగాహన కల్పించాల్సి ఉండగా, స్పందించిన దాఖలాల్లేవని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర కమిటీ ఆరోపిస్తోంది.

కోర్టు ఆదేశించినా..

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో 150 మంది దళిత, గిరిజనులు నాలుగేళ్ల కిందట ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీకి ఓట్లు వేశారన్న ఒకే ఒక కారణంతో వారి ఇళ్లను తొలగించేందుకు గతంలో పలు దఫాలు ప్రయత్నాలు చేశారు. వారిని అక్కడి నుంచి పంపరాదని కోర్టు కూడా ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా బుధవారం తెల్లవారుజామున అనంతపురం రూరల్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి నాలుగు జేసీబీలతో వెళ్లి ఆ ఇళ్లను కూల్చేశారు. అట్రాసిటీ చట్టం ద్వారా దళిత, గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారని కులవివక్ష వ్యతిరేక సంఘం ప్రధానకార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి ప్రభుత్వ వైఖరిని ఖండించారు.

కోకొల్లలుగా కేసులు

2021 జూలైలో మైలవరం నియోజకవర్గం కొండపల్లి రిజర్వు ఫారె్‌స్టలో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించి వెళ్తుండగా మాజీ మంత్రి దేవినేని ఉమా కారుపై అధికార పార్టీ నేతలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అయితే వైసీపీ నాయకుడి ఫిర్యాదుతో మైలవరం పోలీసులు ఉమాపైనే అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను కులం పేరుతో దూషించారని అప్పటి పుట్లూరు సీఐ దేవేంద్ర ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడితోనే కేసు పెట్టినట్టు సమాచారం. ఆ కేసులో ప్రభాకర్‌ రెడ్డి కడప జైలులో ఉండివచ్చారు.

రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మామ హనుమంతరెడ్డి.. డిహీరేహళ్‌ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రామాంజినేయులురెడ్డి అనే రైతుకు సంబంధించి న 12 ఎకరాల పొలం తమదేనని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. కోర్టు రామాంజినేయులు రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, పోలీసులు మాత్రం హనుమంతరెడ్డి పక్షాన నిలిచారు. రామాంజినేయులు రెడ్డితో పాటు మోహన్‌ రెడ్డి, రాఘవరెడ్డిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కాపు రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకే ఈ కేసులు నమోదు చేశారు.

పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని పెద్దకొడాలిలో 2020 డిసెంబరు 7న మేకలను మేపేందుకు వెళ్లిన ఓ హిళను ఇద్దరు మైనర్లు అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, టీడీపీ నేతలు అదే నెల 19వ తేదీన వెళ్లి పులివెందుల డీఎస్పీకి వినతి పత్రం ఇచ్చి అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే తమ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారంటూ మృతురాలి కుటుంబీకుల ద్వారా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు.

ఏలూరు జిల్లాలో గత మూడేళ్లలో 350కు పైగా అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అత్యధికంగా 10 కేసులు నమోదు చేశారు.

2020 ఆగస్టు 18న తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కొన్నలి గ్రామానికి చెందిన టీడీపీ నేత రామచంద్రనాయుడు, ఆయన కుమారుడు భార్గవ్‌లపై అధికార పార్టీ నేత ఒత్తిడితో అట్రాసిటీ కేసు నమోదైంది. రామచంద్రనాయుడు పొలం వెనుక వైసీపీ నేత పొలం ఉంది. ఇద్దరి పొలాల నడుమ అనాధీన భూమి కొంత ఉంది. దాన్ని బండి బాటగా వినియోగిస్తున్నారు. వైసీపీ నేత బండి బాటను విస్తరించే క్రమంలో రామచంద్రనాయుడి భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేశారు. అడ్డుకున్న రామచంద్రనాయుడు, ఆయన కుమారుడిపైనా వైసీపీ నేత తన డ్రైవర్‌ ద్వారా అట్రాసిటీ కేసు పెట్టించారు.

అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా వార్తలు రాశారంటూ మండల స్థాయిలో విలేకరులను కూడా కేసులతో బెదిరిస్తున్నారు.

Updated Date - 2023-11-06T04:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising