Arogyashri : ఆస్పత్రులతో ఆటలు!
ABN, First Publish Date - 2023-12-11T02:47:29+05:30
ఆరోగ్యశ్రీ అధికారులు నెట్‌వర్క్ ఆస్పత్రులతో ఆడుకుంటున్నారు. ఇచ్చిన మాటలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్‌కు అనేక సార్లు మాట ఇవ్వడం, ఆ తర్వాత తప్పడం అలవాటుగా మారింది. బిల్లుల చెల్లింపు దగ్గర నుంచి
రూ.1,000 కోట్లకు రూ.600 కోట్లే విడుదల
ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో జాప్యం
మిగిలిన బకాయిలపై సృష్టత ఇవ్వని ట్రస్ట్
ప్యాకేజీల పెంపుపైనా అదే ధోరణి
15నాటికి సృష్టత ఇస్తామని హామీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆరోగ్యశ్రీ అధికారులు నెట్‌వర్క్ ఆస్పత్రులతో ఆడుకుంటున్నారు. ఇచ్చిన మాటలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్‌కు అనేక సార్లు మాట ఇవ్వడం, ఆ తర్వాత తప్పడం అలవాటుగా మారింది. బిల్లుల చెల్లింపు దగ్గర నుంచి ప్యాకేజీల పెంపు వరకూ ఇదే తంతు. బిల్లులు మొత్తం గ్రీన్ చానల్‌లో పెట్టామని చెబుతున్నా... కోట్లకు కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. గ్రీన్ చానల్‌లో పెట్టిన తర్వాత కూడా గతంలో ఒకసారి రూ.1,200 కోట్లు, ఇటీవల రూ.1,000 కోట్లు బకాయిలున్నాయి. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల పెంపుపై కూడా ఎప్పటికప్పుడు కమిటీలు వేయడం, కాలయాపన చేయడం గత కొంతకాలంగా జరుగుతోంది. కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడం, ప్యాకేజీ పెంచకపోవడం వంటి సమస్యలతో నవంబరు 27వ తేదీ నుంచి తాము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని నెట్‌వర్క్ ఆస్పత్రులు నోటీసులు ఇచ్చాయి. దీంతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్యశ్రీ అధికారుల్లో చలనం వచ్చింది. నెట్‌వర్క్ ఆస్పత్రులతో చర్చలు ప్రారంభించారు. రూ.1000 కోట్ల బకాయిల్లో రూ.600 కోట్ల వరకూ విడుదల చేశారు. మిగిలిన నిధుల విడుదలకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు సమస్య అంతా ప్యాకేజీల పెంపుపైనే ఉంది. ముఖ్యమంత్రి, మంత్రి, చివరికి అధికారులు కూడా నిత్యం ఆరోగ్యశ్రీ గురించి చెప్పని గొప్పలు లేవు. జగన్ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకూ ప్యాకేజీల పెంపు అంశం గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అప్పుడెప్పుడో ఏడేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం కొంత వరకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచింది. ఆ తర్వాతా ఆ ఊసే లేదు.
కమిటీ వేసినా..
ఆరోగ్యశ్రీ ప్యాకేజీల పెంపుపై నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ప్రభుత్వం కూడా ప్యాకేజీలు పెంచుతామని హామీలిస్తోంది. గత నెల ప్రభుత్వం, నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా ప్యాకేజీల పెంపుపై ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ నియమించి, ఈ నెల 15 నాటికి సృష్టత ఇస్తామని అధికారులు చెప్పారు. కమిటీ అయితే నియమించారు కానీ ఇప్పటి వరకూ ప్యాకేజీ పని మాత్రం ప్రారంభం కాలేదు. మరోవైపు ఆయుష్మాన్ భారత్ ఆధారంగానే ప్యాకేజీలు పెంచుతామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు చూచాయగా చెబుతున్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ ప్యాకేజీల ఆధారంగా ఆరోగ్యశ్రీలో ప్యాకేజీలు పెంచడం సాధ్యమా? అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయుష్మాన్ స్థాయిలో డౌటే
ఆయుష్మాన్ భారత్ దేశ జనాభాలో 40 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.6 వేల కోట్లపైనే ఈ పథకం కింద ఖర్చు చేస్తోంది. ఇప్పుడు దీని బడ్జెట్‌ను రూ.7 వేల కోట్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లకు పెంచే యోచనలో కేంద్రం ఉంది. ఆయుష్మాన్ భారత్‌లో 22,200 నెట్‌వర్క్ ఆస్పత్రులుంటే, దాదాపు 80 శాతం ప్రభుత్వాస్పత్రులే ఉన్నాయి. కానీ ఆరోగ్యశ్రీ అలా కాదు దాదాపు 80 శాతం నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రైవేటు యాజమాన్యం చేతుల్లో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఆధారంగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచాలంటే దాదాపు అసాధ్యమే అని చెబుతున్నారు. ఆయుష్మాన్ భారత్‌లో ఎన్‌ఏబీహెచ్ అక్రిడేషన్ ఉన్న ఆస్పత్రులకు 5 నుంచి 15 శాతం అత్యధికంగా బిల్లులు ఇస్తున్నారు. మెట్రో నగరాల ఆధారంగా ఆయా నెట్‌వర్క్ ఆస్పత్రులకు అదనంగా రూ.15 నుంచి 20 శాతం వరకూ చెల్లింపులు చేస్తున్నారు. అలానే నీతి ఆయోగ్ గుర్తించిన కొన్ని నగరాల్లో ప్యాకేజీలు అధిక మొత్తంలో ఉంటాయి. డే కేర్‌కు, వైద్య పరీక్షలకు, బ్రాండెడ్ మందులకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ స్థాయిలో ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న రూ.3 వేల కోట్ల బడ్జెట్‌కే రాష్ట్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. సక్రమంగా బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఆయుష్మాన్ భారత్ ప్యాకేజీతో పోలిన ప్యాకేజీలు ఇస్తామంటూ నెట్‌వర్క్ ఆస్పత్రులకు అధికారులు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అది కూడా ఈ నెల 15 నాటికి సృష్టత ఇస్తామని మాటిచ్చారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం కనీసం 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ స్థాయిలో ప్రభుత్వం ప్యాకేజీలు పెంచే పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం అసలు ప్యాకేజీలు పెంచుతుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. కమిటీల పేరుతో ఎన్నికలు వచ్చే వరకూ హడావుడి చేసి, సమస్యను గాలికి వదిలేస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నెట్‌వర్క్‌కు అన్యాయం
నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్యాకేజీల విషయంలో అన్యాయం జరుగుతూనే వస్తోంది. ఆరోగ్యశ్రీ గురించి గొప్పలు చెప్పుకొనే జగన్ ప్రభుత్వంలోనూ న్యా యం జరగలేదు. ఆరోగ్యశ్రీకి మూల స్తంభం నెట్‌వర్క్ ఆస్పత్రులు. అలాంటి నెట్‌వర్క్ ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. అవి నోటీసులు ఇస్తేనో, ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామని హెచ్చరిస్తేనో తప్ప పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం రాష్ట్రంలో నెట్‌వర్క్ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో 90 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులే చికిత్స పొందుతున్నారు. 10 శాతం మంది మాత్రమే డబ్బులు కట్టి లేదా ఆరోగ్య బీమాల ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు నిలిపివేస్తే ఆస్పత్రులు గడవడమే కష్టంగా మారుతుంది. మరోవైపు శస్త్ర చికిత్స ప్యాకేజీలు కూడా సరిపోని పరిస్థితి. ప్యాకేజీలు పెంచితే నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇబ్బందులు తగ్గడంతో పాటు రోగుల జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి తప్పుతుంది.
Updated Date - 2023-12-11T02:47:30+05:30 IST