ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢాం..ఢాం..ఢాం

ABN, First Publish Date - 2023-03-31T03:21:59+05:30

‘నేనూ మార్గదర్శిలో చేరాను. మొన్నీమధ్యనే ఓ గన్‌ కొన్నాను’ జల్సా సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. దీనికి కొంచెం భిన్నంగా ‘నేనూ వైసీపీలో చేరాను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెచ్చరిల్లిన తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా గన్‌ లైసెన్సులు

పులివెందులలో ఎంపీ అవినాశ్‌ అనుచరుడు భరత్‌కుమార్‌

పల్నాడులో వెంకటేశ్వర రెడ్డి, ఉత్తరాంధ్రలో బొత్స మోహన్‌

అన్ని చోట్లా అధికార పార్టీ నేతల అనుచరులు, బంధువులే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘నేనూ మార్గదర్శిలో చేరాను. మొన్నీమధ్యనే ఓ గన్‌ కొన్నాను’ జల్సా సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. దీనికి కొంచెం భిన్నంగా ‘నేనూ వైసీపీలో చేరాను. ఈ మధ్యనే గన్‌ కొన్నాను’ అంటున్నారు రాష్ట్రంలోని అధికార పార్టీ నేతల అనుచరులు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంతూరు పులివెందులలో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ అనుచరుడు భరత్‌ యాదవ్‌ కాల్పులు జరపడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయాలపాలయ్యారు. అంతకుముందు పల్నాడులో స్థానిక వైసీపీ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి రొంపిచెర్లలోని టీడీపీ నేత బాలకోటి రెడ్డి ఇంటికెళ్లి తుపాకీ కాల్చి చంపాడు. అలాగే, విజయనగరం జిల్లా మంత్రి బంధువు బొత్స మోహన్‌ నుంచి గన్‌ కొనుగోలు చేసిన వ్యక్తి జనవరిలో రాజమండ్రి పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో వరుసగా మూడు ఘటనలు జరగడం పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతిని తెలియజేస్తోంది. మరోవైపు పల్నాడులో మద్యం అక్రమ వ్యాపారులను పట్టుకున్న పోలీసులకు అక్రమాయుధాలు పట్టుబడటం.. అనంతపురంలో నకిలీ నోట్ల ముఠా వద్ద ఏకంగా 17 దేశీయ, విదేశీ రివాల్వర్లు లభించడం.. తూర్పు గోదావరిలో కోడిగుడ్ల వ్యాపారి ఉత్తరాంధ్ర నుంచి ఆయుధాన్ని కొనుగోలు చేయడం పోలీసుల్నీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ తుపాకీ సంస్కృతి చెలరేగిపోతోంది. అనుచరులకు ఆయుధ లైసెన్స్‌ కోసం అధికార వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తుండటంతో ట్రాఫిక్‌ చలానాలు ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. మరో వైపు అంగట్లో సరుకుల్లా ఆయుధ ముఠాలు దేశీయ, విదేశీ తుపాలను విక్రయిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వారికి సులభంగా తుపాకీ లైసెన్స్‌ లభిస్తుండటంతో భూదందాలు, సెటిల్‌మెంట్లతోపాటు కాల్పులకు తెగబడుతున్నారు. చిన్నచిన్న గొడవలకు సైతం ఆయుధాన్ని బయటికి తీసి తూటాలు దించుతున్నారు. ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇంకెన్ని తుపాకులు పేలుతాయో.. మరెందరి ఎందరి ప్రాణాలు బుల్లెట్లకు బలవుతాయో అనే భయం ప్రజల్లో నెలకొంది.

బిహార్‌లా మార్చేశారు..

అడవుల్లో మావోయిస్టుల భుజానికో.. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో రౌడీషీటర్ల వద్దో ఉంటాయనుకునే ఆయుధాలు రాష్ట్రంలోని అన్ని చోట్లా ఓ మోస్తారు వ్యక్తుల చేతుల్లోకి వచ్చేశాయి. అడవిలో మృగాల కంటే దారుణంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ బిహార్‌ అవుతుందనే వ్యాఖ్యలు గత ఎన్నికల ముందు రాష్ట్రంలోని రాజకీయ నేతల నోట వినిపించేవి. ఆ మాటలు నిజమైనట్లు తాజా కాల్పుల ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

2020లో అత్యధిక ఘటనలు..

గడిచిన పదేళ్లలో తుపాకీ పేలుళ్ల ఘటనలు 2020 నుంచి బాగా ఎక్కువయ్యాయి. ఆ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన యువతి ప్రేమను నిరాకరించిందని బాలాజీ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఏప్రిల్‌లో మండవల్లి సమీపంలోని తక్కెళ్లపాడులో నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖ ఏజెన్సీలోని డుబ్రిగుడ మండలం గదబగలుగులో నాటు తుపాకీ కాల్పుల్లో బలరాం అనే గిరిజనుడు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్లో పనిచేసే మహేశ్‌ అనే ఉద్యోగిని అక్టోబరులో నున్న బైపాస్‌ రోడ్డులో కాల్చి చంపారు. కారులో వచ్చిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఆ తర్వాతి నెలలో నెల్లూరు ఫతేఖాన్‌ పేటలో మహేంద్ర సింగ్‌ అనే వ్యాపారిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. 2020 డిసెంబరులో విశాఖపట్నానికి చెందిన బిల్డర్‌ పీఎ్‌సఎన్‌ రాజు తలపై రౌడీషీటర్‌ సంతోష్‌ తుపాకీ గురిపెట్టి పది లక్షలు వసూలు చేశాడు. రాష్ట్రంలో ఒకే ఏడాది ఇన్ని ఘటనలు ఎప్పుడూ జరగలేదు.

గన్‌ లైసెన్స్‌ ఎవరికిస్తారు..?

సమాజంలో హోదా గుర్తింపు ఉన్న వ్యక్తులు.. బెదిరింపులు ఎదుర్కొన్న వ్యాపారులు, కాంట్రాక్టర్లు.. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు.. ఆత్మ రక్షణ, ప్రాణ హాని పేరిట, అలాగే మాజీ సైనికులు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేసుకోవడానికి ఆయుధ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. జిల్లా కలెక్టర్‌ వాటిని పరిశీలించాల్సిందిగా ఎస్పీకి పంపితే... ఆ వ్యక్తి ఏ ప్రాంతంలో నివసిస్తాడో ఆ పోలీసుస్టేషన్‌కు ఎస్పీ పంపుతారు. ఆ వ్యక్తిపై ఏవైనా కేసులున్నాయా? ఎవరితోనైనా భూ, ఆర్థిక లావాదేవీలున్నాయా? ఇతరత్రా నేర చరితులతో సంబంధాలున్నాయా? మానసిక పరిస్థితి? కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా? తదితర కోణాల్లో స్థానిక పోలీసులు ఆరా తీస్తారు. ఆ సమాచారం ఆధారంగా ఆ వ్యక్తి చెప్పిన కారణాలతో ఏకీభవిస్తే.. అభ్యంతరం లేదని స్థానిక పోలీసులు జిల్లా ఎస్పీకి రాసి పంపుతారు. ఆయన కూడా సంతృప్తి చెందితేనే కలెక్టర్‌కు పంపించే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఒత్తిడి వస్తే అనుమానించి స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ పోలీసుల ద్వారా కూపీ లాగి ఆ తర్వాతే కలెక్టర్‌కు ఫైలు పంపుతారు. దీనికి భిన్నంగా అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసు అధికారులు సమ్మతి తెలిపేస్తుండటం రాష్ట్రంలో ప్రమాద గంటికలు మోగిస్తోంది. పులివెందులలో భరత్‌ కుమార్‌ నేర చరిత్ర తెలిసిన స్థానిక పోలీసు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా, నేతల ఒత్తిడితో గన్‌ లైసెన్సుకు సిఫారసు చేయడం ఇద్దరి ప్రాణాలపైకి తెచ్చింది.

కడపలోనే ఎక్కువ..

రాష్ట్రంలో ఆయుధ లైసెన్సులు గత మూడేళ్లలోనే ఎక్కువ ఇచ్చినట్లు అనధికారిక సమాచారం. రాష్ట్రంలో లైసెన్స్‌ కలిగిన ఆయుధాలు 2019 ఎన్నికల నాటికి ఏడు వేల లోపు ఉండగా, ఆ సంఖ్య ప్రస్తుతం పదివేలు దాటినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో పోలీసులు 7,093 లైసెన్స్‌డ్‌ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అత్యధికంగా ఉమ్మడి కడప జిల్లాలోనే ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సబ్‌ డివిజన్‌ పరిధిలో అత్యధికంగా 324 లైసెన్స్‌డ్‌ ఆయుధాలున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. రాష్ట్రంలో 108 పోలీసు సబ్‌ డివిజన్లు ఉండగా, రాయచోటితో కడప సబ్‌ డివిజన్‌ పోటీ పడుతున్నట్లు సమాచారం.

Updated Date - 2023-03-31T03:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising