ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anganwadis : శివాలెత్తిన అంగన్వాడీలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 04:46 AM

అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతమవుతోంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులు పగులగొట్టడంపై అంగన్వాడీల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది.

సచివాలయాలపై దండయాత్ర.. తలుపులకు తాళాలు.. సిబ్బంది నిర్బంధం

తాళాల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదులు.. ఐదో రోజూ ఉధృతంగా సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు.. వినూత్న నిరసనలు

సమ్మె దిశగా ఆశాలు.. 21న రాష్ట్రస్థాయి సదస్సులో నిర్ణయం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతమవుతోంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ ఉద్యోగులు పగులగొట్టడంపై అంగన్వాడీల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో సచివాలయాల కార్యాలయాలకు అంగన్వాడీలు తాళాలు వేసి ఉద్యోగులను కార్యాలయాల్లోనే నిర్బంధించారు. సమస్యలను పరిష్కరించడంలో జగన్‌ సర్కార్‌ మొండిగా వ్యవహరిస్తుండడంతో అంగన్వాడీలు ఐదవ రోజూ సమ్మెను కొనసాగించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరసనలు ఉధృతం చేశారు. జిల్లా, మండల కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలతో హోరెత్తించారు. అంగన్వాడీలపై బెదిరింపులకు దిగిన జగన్‌ సర్కార్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అంగన్వాడీ కేంద్రాల బాధ్యతలు అప్పగించింది. పలు చోట్ల తాళాలు బద్దలు కొట్టి కేంద్రాలను సచివాలయ ఉద్యోగులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై- ఆగ్రహం చెందిన అంగన్వాడీ సిబ్బంది కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని 1,2,4,5,6 సచివాలయాలకు తాళాలు వేశారు. సచివాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం ఏమిటని నిలదీశారు. పోలీసులు సచివాలయాల వద్దకు చేరుకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా అంగన్వాడీలు ఆందోళనను విరమించలేదు.

కేంద్రాల నిర్వహణలో సర్కారు తడబాటు..

గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టినప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో నిర్వహించలేక సతమతమవుతున్నారు. పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం తెప్పించి అంగన్వాడీల్లోని చిన్నారులకు పెట్టారు. పలుచోట్ల చిన్నారులకు భోజన ఏర్పాట్లే చేయలేదు. కొన్నిచోట్ల పౌష్టికాహారాన్ని గతంలో పంపిణీ చేయని గర్భిణులకు, బాలింతలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం పంతానికి పోయి సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలు తెరిపించిందేకానీ పూర్తి స్థాయిలో నిర్వహించలేక సతమతమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం, మండల కేంద్రాల్లో సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. విశాఖపట్నంలోనూ అంగన్వాడీలు కళ్లకు గంతలు కట్టుకుని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో వీఆర్సీ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు అంగన్వాడీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోశారు. వరికుంటపాడు, ఉలవపాడులలో నల్లచీరలు ధరించి, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

తాళాల ధ్వంసంపై గర్జన..

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురంలో అంగన్వాడీ సెంటర్‌ తాళాలు పగుల కొడితే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంటానని అంగన్వాడీ కార్యకర్త అడ్డుపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. పోలవరంలో నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. కైకలూరులో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగుల కొడుతున్న అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో అంగన్వాడీ సిబ్బంది భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పుత్తూరు పట్టణంలో కళ్ళకు గంతలు కట్టుకు భిక్షాటన చేశారు. కోట మండల కేంద్రంలోనూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టడంపై శనివారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీ్‌సస్టేషన్‌లో పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. మాచవరం మండలంలోనూ తాళాలు పగులగొట్టిన సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, శిశు సంక్షేమశాఖ అధికారులపై అంగన్వాడీలు ఫిర్యాదులు చేశారు. పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరంలో వైసీపీ నేతలు శనివారం అంగన్‌వాడీ కేంద్రం తాళాలను స్వయంగా గడ్డపారతో పగులకొట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. రోడ్డుపైకి వచ్చి వేపాకులు తింటూ.. ‘జగన్‌ ప్రభుత్వంలో అంగన్వాడీలకు ఆకులే గతి’ అని నినాదాలు చేశారు. ఓ కార్యకర అమ్మోరు పూనినట్టు గట్టిగా అరుస్తూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతపురం రూరల్‌ మండలం మన్నీల గ్రామంలో అంగన్వాడీ కేంద్రం తాళాన్ని వీఆర్వో, సచివాలయ సిబ్బంది, వలంటీర్‌ రాళ్లతో కొట్టి తొలగించగా, భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీ టీచర్లుగా పనిచేయం

సచివాలయాల మహిళా పోలీసుల స్పష్టీకరణ

ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్‌వాడీల కేంద్రాలను తెరిచేందుకు సచివాలయ సిబ్బంది సమక్షంలో పంచనామా నిర్వహిస్త్తున్నామే గానీ అంగన్‌వాడీటీచర్లుగా పని చేయడానికి సుముఖంగా లేమని సచివాలయాల మహిళా పోలీసులు స్పష్టం చేశారు. ఏపీ విలేజ్‌ అండ్‌ వార్డ్‌ సెక్రటేరియట్‌ మహిళా పోలీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సుంకర మహాలక్ష్మి శనివారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా పోలీసులను కొన్ని చోట్ల అంగన్‌వాడీ వర్కర్లు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని, మరికొన్ని చోట్ల పోలీ్‌సస్టేషన్లలో కేసులు కూడానమోదయ్యాయని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, మహిళా పోలీసులు ఎప్పటిలాగే అంగన్‌వాడీల పర్యవేక్షణ మాత్రమే చూస్తామని తేల్చిచెప్పారు. పలు జిల్లాల్లో అంగన్‌వాడీ వర్కర్లు మహిళా పోలీసులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సచివాలయ ఉద్యోగులకు ఆటవిడుపు కేంద్రాలు..

అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మెలో ఉండడంతో పలుచోట్ల పిల్లలను తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు పంపలేదు. దీంతో ఆ కేంద్రాల బాధ్యతలు చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పిల్లల ఆట వస్తువులతో ఆటలాడుతూ కాలక్షేపం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామంలోని మురళీనగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో సచివాలయ ఉద్యోగులు ఉయ్యాల ఊగుతూ, చిన్నపిల్లల బ్యాట్‌తో ఆటలాడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాలు సచివాలయాల ఉద్యోగులకు ఆట విడుపు కేంద్రాలుగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Dec 17 , 2023 | 04:46 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising