రైతులు బతకాలా..? వద్దా..?
ABN, Publish Date - Dec 25 , 2023 | 11:51 PM
తోట పంటలు సాగుచేస్తున్న రైతులకు దొంగల బెడద ఎక్కువైంది. ట్రాన్సఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్, ఆయిల్‌ను ఎత్తుకెళ్లే ముఠా మండలంలో చెలరేగిపోతోంది. తోటల్లోకి చొరబడి.. ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేస్తోంది. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందించేందుకు తంటాలు పడుతున్నారు.
పేట్రేగిపోతున్న ట్రాన్సఫార్మర్ దొంగలు
కొనసాగుతున్న కాపర్, ఆయిల్ చోరీలు
సీరియస్‌గా తీసుకోని పోలీసులు
ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు
యాడికి
తోట పంటలు సాగుచేస్తున్న రైతులకు దొంగల బెడద ఎక్కువైంది. ట్రాన్సఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్, ఆయిల్‌ను ఎత్తుకెళ్లే ముఠా మండలంలో చెలరేగిపోతోంది. తోటల్లోకి చొరబడి.. ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేస్తోంది. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందించేందుకు తంటాలు పడుతున్నారు. ఒక్కొక్క ట్రాన్సఫార్మర్‌కు రూ.50 వేలకు పైగా ఖర్చుచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చుల మాట అటుంచితే, కొత్త ట్రాన్సఫార్మర్ మంజూరు కావడానికి అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే ట్రాన్సఫార్మర్‌ల కోసం రైతులు నెలల తరబడి వేచి చూస్తున్నారు. యాడికి పట్టణానికి చెందిన రైతు శ్రీనివాసులు తదితరుల తోటల్లో దొంగలు పడ్డారు. రెండు ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్, ఆయిల్‌ను చోరీ చేశారు. రెండు వారాల క్రితం రాయలచెరువుకు చెందిన బ్రహ్మానందరెడ్డి, రంజితకుమార్, కాశప్ప అనే రైతులకు చెందిన ట్రాన్సఫార్మర్లను పగలగొట్టి కాపర్, ఆయిల్‌ను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. కొందరు రైతులు ఫిర్యాదు చేయడమే మానేశారు.
తాజాగా చందనలో..
చందన గ్రామ సమీపంలోని తోటల్లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఏకంగా ఐదు ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, కాపర్ వైరును చోరీ చేశారు. దీంతో బాధిత రైతులు దేవరాజు, లింగమయ్య, గోపాల్, రాధాకృష్ణ, గంగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్సఫార్మర్లను తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు వేల రూపాయలు ఖర్చవుతుందని వాపోయారు. దొంగల కారణంగా పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వైర్లనూ వదలరు..
మండలంలో వ్యవసాయ బోరుబావులకు సంబంధించి కేబుల్ వైర్ల దొంగతనాలు లెక్కలేనన్ని జరిగాయి. వీటిపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. రికవరీ చేసిన ఆనవాళ్లే లేవు. దీంతో కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు.
ట్రాన్సఫార్మర్ పగలగొట్టారు..
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. రాత్రి వేళల్లో తోటలో దొంగలు పడి ట్రాన్సఫార్మర్ పగలగొట్టారు. అందులోని ఆయిల్, కాపర్‌ను చోరీ చేశారు. దీంతో పంటను ఎండబెట్టుకోవాల్సి వచ్చింది. కొత్త ట్రాన్సఫార్మర్ ఏర్పాటుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. దొంగలు పగలు రెక్కీ నిర్వహించి రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు.
- శ్రీనివాసులు, రైతు యాడికి
కేబుల్ వైరును కోసుకుపోయారు..
అరటితోటలో రాత్రివేళ దొంగలు పడి బోరుబావి కేబుల్‌వైరు కట్ చేసి ఎత్తుకెళ్లారు. కొత్త కేబుల్‌వైరు అమర్చుకోవడానికి ఇబ్బందులు పడాల్సివస్తోంది. చాలా మంది రైతుల తోటల్లో కేబుల్‌వైరును చోరీ చేస్తున్నారు. పోలీసులు తగు చర్యలు తీసుకోవాలి.
- చరణ్, రైతు రాయలచెరువు
Updated Date - Dec 25 , 2023 | 11:51 PM