పైలా భూకజ్జా..
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:36 AM
వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తన భూమి కబ్జా చేశాడంటూ ఆ పార్టీకే చెందిన మద్దతుదారుడు ఆరోపించడం సంచలనంగా మారింది. ఆ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఆదివారం పెట్టిన వీడియో అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
వైసీపీ జిల్లా అధ్యక్షుడిపై అదే పార్టీ మద్దతుదారుడి ఆరోపణలు
సోషల్ మీడియాలో వీడియో వైరల్
అధికార పార్టీలో ప్రకంపనలు
తాడిపత్రి, డిసెంబరు17: వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తన భూమి కబ్జా చేశాడంటూ ఆ పార్టీకే చెందిన మద్దతుదారుడు ఆరోపించడం సంచలనంగా మారింది. ఆ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఆదివారం పెట్టిన వీడియో అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాడిపత్రి మండలం యర్రగుంటపల్లికి చెందిన వైసీపీ మద్దతుదారుడు దస్తగిరి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మేరకు.. తాడిపత్రి మండలం పెద్దపొలమడ రెవెన్యూ గ్రామ పరిధి యర్రగుంటపల్లి వద్ద సర్వే నంబరు 1071లో దస్తగిరికి ఎకరా భూమి ఉంది. భూమి పక్కనే 544-డీ హైవే వెళుతోంది. దీంతో ఒక్కసారిగా భూముల విలువ రూ.లక్షల్లో నుంచి రూ.కోట్లలోకి చేరుకుంది. దస్తగిరికి చెందిన ఎకరా భూమి ప్రస్తుతం రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కన్ను ఆ భూములపై పడింది. దస్తగిరి భూమి పక్కనే ఉన్న ఎకరాన్నర భూమిని ఇప్పటికే కబ్జా చేశాడు. పక్కనున్న దస్తగిరి భూమిని కూడా కబ్జా చేసేందుకు యత్నించాడు. చుట్టూ కంచె వేసేందుకు కూలీలను కూడా పిలిపించాడు. విషయం తెలుసుకున్న దస్తగిరి పొలం వద్దకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దస్తగిరిపై రౌడీలతో పైలా నరసింహయ్య దౌర్జన్యానికి దిగాడు. పోలీసులు అక్కడికి చేరుకుని, ఇద్దరికీ సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. కేవలం భూ కబ్జాల కోసమే పైలా పార్టీలు మారుతూ రెవెన్యూ అధికారుల అండతో భూములను కబ్జా చేస్తున్నాడని వీడియాలో దస్తగిరి వాపోయాడు. వైసీపీలో ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న తన భూమినే తమ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు కబ్జా చేయడానికి ప్రయత్నించడం ఆశ్చర్యానికి లోనుచేస్తోందన్నాడు. భూకబ్జాలు చేసే వ్యక్తికి పార్టీ పదవి ఇవ్వడం సరికాదన్నాడు. దీనిపై వైసీపీ పెద్దలు జోక్యం చేసుకుని, పైలా నరసింహయ్య కబ్జా నుంచి తన భూమిని కాపాడాలని బాధితుడు కోరాడు.
Updated Date - Dec 18 , 2023 | 12:36 AM