అర్ధరాత్రి అరాచకంపై జిల్లా ఎస్పీ సీరియస్
ABN, First Publish Date - 2023-12-10T23:49:04+05:30
పట్టణంలో అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడిపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీరియ్‌సగా పరిగణించినట్లు సమాచారం.
హిందూపురం, డిసెంబరు 10 : పట్టణంలో అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడిపై జరిగిన దాడిని జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీరియ్‌సగా పరిగణించినట్లు సమాచారం. ఈ నెల 2వ తేదీ రాత్రి 12గంటల సమయంలో లేపాక్షికి చెందిన బాలాజీ అనే యువకుడు సొంతూరుకు వెళ్లడానికి పట్టణం శివారులో వాహనం కోసం వేచిఉన్నాడు. అతడిని కొందరు దుండగులు తీసుకెళ్లి చితకబాదడంతో అతడు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘అర్ధరాత్రి అరాచకం’ అనే కథనం ఆదివారం వెలువడింది. దీనిని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సీరియ్‌సగా పరిగణించి స్థానిక పోలీసు అధికారులకు అక్షింతలు వేసినట్లు సమాచారం. దీంతో ఆదివారం ఉదయం రంగంలోకి దిగిన పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక అర్ధరాత్రి 12గంటల సమయంలో పట్టణంలో ఇలా జరగడంపై పోలీసులు అసలు గస్తీ తిరుగుతున్నారా? లేదా? అని ఆరాతీసినట్లు తెలిసింది.
Updated Date - 2023-12-10T23:49:05+05:30 IST