వీడని సందిగ్ధం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:32 AM
హంద్రీనీవా కాలువ నుంచి గుంతకల్లు బ్రాంచి కెనాల్(జీబీసీ)కు నీటి మళ్లింపు విషయంపై సందిగ్ధత నెలకొంది. అధికార పార్టీ నాయకులు నీటి మళ్లింపునకు సంబంధించి ఎలాంటి అనుమతులు కోరకనే నీటి విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు.
జీబీసీకి నీటి మళ్లింపుపై అయోమయం
ఉత్తర్వులు లేవని అడ్డుకున్న అధికారులు
ఉరవకొండ, డిసెంబరు 17: హంద్రీనీవా కాలువ నుంచి గుంతకల్లు బ్రాంచి కెనాల్(జీబీసీ)కు నీటి మళ్లింపు విషయంపై సందిగ్ధత నెలకొంది. అధికార పార్టీ నాయకులు నీటి మళ్లింపునకు సంబంధించి ఎలాంటి అనుమతులు కోరకనే నీటి విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నింబగల్లు సమీపంలోని హంద్రీనీవా కాలువ నుంచి నీటిని మళ్లించేందుకు విడపనకల్లు మండలానికి చెందిన అధికారపార్టీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న హంద్రీనీవా డీ2 డిస్ర్టిబ్యూటరీ పరిధిలోని రైతులు అక్కడకు చేరుకుని అభ్యంతరం తెలిపారు. అప్పటికే అక్కడికి చేరుకున్న హెచఎనఎ్‌సఎ్‌స అధికారులు నీటి విడుదలకు ఎలాంటి అనుమతులు లేవని, జీబీసీకి నీటిని మళ్లించే విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. కాగా హంద్రీనీవాకు సైతం నీరు ఎప్పటి దాకా వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో జీబీసీకి నీటి విడుదల హుళక్కేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఆయకట్టు పరిధిలో డి1 డిస్ర్టిబ్యూటరీకి విడుదల చేస్తున్న సాగు నీరు ప్రస్తుతం ఆ కాలువ కింద సాగు చేసిన పంటలకు మాత్రమే సరిపోతుంది. ఒక వేళ జీబీసీకి నీటిని మళ్లించాలంటే అదనంగా ఆ కాలువకు నీటిని వదలాల్సి ఉంది. వీటికి సంబంధించి సాంకేతికమైన అనుమతులు అధికారులు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంపై హెచఎనఎ్‌సఎ్‌స అధికారులను వివరణ కోరగా ప్రస్తుతం డిస్ర్టిబ్యూటరీకి వెళ్తున్న నీరు ఆయకట్టుకు సరిపోతుందని, నీటి మళ్లింపు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అయోమయంలో జీబీసీ ఆయకట్టు రైతులు
వర్షాభావ పరిస్థితుల వల్ల తుంగభద్ర కాలువకు అనుబంధంగా ఉన్న జీబీసీకి నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో పంటలు సాగు చేసిన ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంతకల్లు బ్రాంచి కెనాల్ కింద 32వేల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేశారు. వీటిలో అధికంగా మిర్చి పంటను వేశారు. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.లక్షదాకా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం మిర్చి పంట పిందె దశలో ఉంది. దిగుబడి రావాలంటే మరో మూడు తడులైనా నీరు ఇవ్వాల్సి ఉంది. పంటలకు నీటి తడులు ఇవ్వకపోతే సుమారుగా రూ.300 కోట్ల పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:32 AM