గుండెపోటుతో దిశ డీఎస్పీ మృతి
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:50 PM
జిల్లాకేంద్రంలో దిశ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కేవీఎన వరప్రసాద్ (60) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన బుధవారం రాత్రి పుట్టపర్తి ప్రధాన రహదారిలోని సాయిప్లాజా హోటల్‌లోని గదిలో నిద్రించారు. రాత్రి గుండెపోటుతో మరణించారు. గురువారం ఉదయం హోంగార్డు ఆ గది వద్దకెళ్లి చూడగా.. తలుపు తీయకపోవడంతో డీఎస్పీ పడుకున్నారేమోననుకుని వెనుదిరిగారు.
పుట్టపర్తిరూరల్, డిసెంబరు 14: జిల్లాకేంద్రంలో దిశ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కేవీఎన వరప్రసాద్ (60) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన బుధవారం రాత్రి పుట్టపర్తి ప్రధాన రహదారిలోని సాయిప్లాజా హోటల్‌లోని గదిలో నిద్రించారు. రాత్రి గుండెపోటుతో మరణించారు. గురువారం ఉదయం హోంగార్డు ఆ గది వద్దకెళ్లి చూడగా.. తలుపు తీయకపోవడంతో డీఎస్పీ పడుకున్నారేమోననుకుని వెనుదిరిగారు. కాసేపటి తరువాత మళ్లీ వెళ్లి చూడగా.. అప్పటికీ తలుపు తీయలేదు. విషయాన్ని హోంగార్డు ఉన్నతాధికారులకు చేరవేశారు. వారు వచ్చి పిలిచినా స్పందించకపోవడంతో తలుపు పగులగొట్టి, లోపలికెళ్లి చూడగా.. పడిపోయి ఉన్నాడు. పుట్టపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ జ్యోత్స్నను పిలిపించి, పరీక్షించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే ఆయన కుమారుడికి విషయం తెలియజేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డీఎస్పీ మృతదేహాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన అమలాపురం నియోజకవర్గంలోని కొత్తపేట మండలం రాకుర్తివారిపల్లికి మృతదేహాన్ని తరలించారు. కాగా ఈయన 1991లో పశ్చిమగోదావరి జిల్లాలో ఎస్‌ఐగా విధుల్లో చేరారు. 2006లో సీఐగా ఉద్యోగోన్నతి పొంది కాకినాడ క్రైం బ్రాంచలో పనిచేశారు. 2014లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది తిరుపతి పీటీసీలో, రాజమండ్రిలో ఇంటెలిజెన్స డీఎస్పీగా పనిచేశారు. 2023లో జిల్లాకు బదిలీపై వచ్చి, ఇక్కడ దిశ డీఎస్పీగా పనిచేస్తున్నారు.
డీఎస్పీ మృతి బాధాకరం: ఎస్పీ
డీఎస్పీ కేవీఎన వరప్రసాద్ మృతి పోలీసుశాఖకు తీరని లోటని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. డీఎస్పీ మృతి విషయం తెలుసుకున్న ఆయన నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. పోలీసుశాఖలో ఎంతో నిబద్దతతో పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. పోలీసుశాఖ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏఎస్పీ విష్ణు, డీఎస్పీలు విజయ్‌కుమార్, వాసుదేవన ఎస్బీ సీఐ రవీంద్రనాథరెడ్డి, సీఐ కొండారెడ్డి, సిబ్బంది నివాళుల అర్పించారు.
దిశ డీఎస్పీ వరప్రసాద్ (ఫైల్),
Updated Date - Dec 14 , 2023 | 11:50 PM