బాలల పట్ల క్రూరత్వం
ABN, First Publish Date - 2023-11-18T00:57:52+05:30
నగరంలోని ప్రముఖుల ఇళ్లలో బాలలు పనిమనుషులుగా మగ్గుతున్నారు. హింసకు గురవుతున్నారు. అధికారులు బాల కార్మికులను గుర్తించేందుకు హోటళ్లు, గనులు, దుకాణాలకు వెళుతున్నారేగాని, ఇళ్లపై దృష్టి పెట్టడం లేదు.
ప్రముఖుల ఇళ్లలో పనికి పసివారు
ఏపీపీ ఇంట్లో బాలికకు బెల్టు దెబ్బలు
ఒళ్లంతా గాయాలతో ఆస్పత్రి పాలు
ఏపీపీ, ఆమె తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు
నగరంలో మూడు నెలల్లో మూడు ఘటనలు
కార్మికశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు..?
అనంతపురం క్రైం, నవంబరు 17: నగరంలోని ప్రముఖుల ఇళ్లలో బాలలు పనిమనుషులుగా మగ్గుతున్నారు. హింసకు గురవుతున్నారు. అధికారులు బాల కార్మికులను గుర్తించేందుకు హోటళ్లు, గనులు, దుకాణాలకు వెళుతున్నారేగాని, ఇళ్లపై దృష్టి పెట్టడం లేదు. పేదరికం, అవగాహన లేనికారణంగా మారుమూల ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇళ్లలో పనికి చేర్చి వెళుతున్నారు. ఆ తరువాత చిన్నారులపై జరిగే అఘాయిత్యాల గురించి ఎవరికోగాని సమాచారం ఉండటం లేదు. తాజాగా అనంతపురంలో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. న్యాయం కోసం వాదించే హోదాలో ఉండి.. ఓ బాలికను ఇంట్లో పనికి పెట్టుకోవడం, దారుణంగా హింసించడం వంటి నేరారోపణలపై ఉరవకొండ ఏపీపీ వసంతలక్ష్మీబాయి అరెస్టు అయ్యారు. ఆమె తండ్రి రంగనాయకులపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి ఆస్పత్రికి..
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బాలిక ఏడాది క్రితం వసంతలక్ష్మీబాయి ఇంట్లో పనికి కుదిరింది. వసంతలక్ష్మి ఉరవకొండ కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్నారు. ఆమె భర్త రమేష్ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీపీగా పనిచేస్తున్నారు. అనంతపురం రెవెన్యూ కాలనీలో వీరి నివాసం. కొడుకును చూసుకునే పేరిట బాలికను పనికి పెట్టుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను గురువారం అర్ధరాత్రి తరువాత చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. విషయం వెలుగులోకి రావడంతో ఎస్పీ అన్బురాజన స్పందించారు. ఆయన ఆదేశాలతో త్రీటౌన సీఐ ధరణికిషోర్ ఆస్పత్రికి వెళ్లి బాలిక పరిస్థితి తెలుసుకున్నారు. బాధితురాలి తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించి వసంతలక్ష్మి, ఆమె తండ్రిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తండ్రిని పిలిపించి...
బాలికను ఆస్పత్రిలో చేర్చేందుకు గోరంట్లలో ఉంటున్న తన తండ్రి రంగనాయకులు, బాలిక తల్లిని ఏపీపీ వసంతలక్ష్మి పిలిపించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అర్ధరాత్రి దాటిన తరువాతే బాలికను ఆస్పత్రికి తరలించారు. కూతురు ఫోన చేయగానే రంగనాయకులు కారు అద్దెకు తీసుకుని వచ్చి మరీ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. బాలిక కింద పడిందని, మానసిక రుగ్మతతో తనను తానే బెల్టుతో కొట్టుకుందని ఏపీపీ పోలీసులకు తెలిపారు. మానసిక అనారోగ్యంతో ఉన్న బాలికను ఇంట్లో కేర్ టేకర్‌గా ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఆస్పత్రిలో ఉన్న బాలిక మాట్లాడే పరిస్థితిలో లేరు. దీంతో ఆమెపై దాడి జరిగినట్లుగానే పోలీసులు భావిస్తున్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఐపీసీ 324, జువైనల్ జస్టిస్ యాక్ట్ 75 కింద ఏపీపీపై కేసు నమోదు చేశారు. పోలీసులకు చెప్పకుండా బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లినందుకు రంగనాయకులపైనా కేసు నమోదు చేశామని సీఐ ధరణికిషోర్ తెలిపారు.
ఏం జరిగింది..?
బెల్టు దెబ్బలతో బాలిక శరీరం కమిలిపోయింది. ఎందుకు కొట్టారు..? ఎవరు కొట్టారు..? అన్నది తేలాల్సి ఉంది. వసంతలక్ష్మి బాయి భర్త రమేష్ పలాసలో ఉంటున్నారట. నాలుగు రోజుల క్రితం రమేష్ అక్కడికి వెళ్లిపోయినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. బాలిక కాళ్లు, చేతులు, శరీరం మొత్తం గాయాలు, గాట్లు ఉండటంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బాలిక నోరు విప్పితేగానీ వాస్తవాలు వెలుగులోకి రావు. మెలకువగా ఉంటే తీవ్ర భయాందోళన చెందుతోందని, అందుకే బాలికకు వైద్యులు మత్తు ఇస్తున్నారని సీఐ అంటున్నారు.
ఇటీవలే మూడు ఘటనలు
- మూడు నెలల క్రితం ఓ కానిస్టేబుల్‌లో ఇంట్లో పనిచేస్తున్న బాలిక గర్భిణి కావడం కలలకం రేపింది. టూటౌన పోలీ్‌సస్టేషన కానిస్టేబుల్ రమేష్ తన భార్యతో (ఎక్సైజ్ కానిస్టేబుల్) కలిసి అరవిందనగర్‌లో ఉంటున్నారు. వారి పిల్లలను చూసుకునేందుకు గుత్తి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తెచ్చుకున్నారు. బాలిక గర్భం దాల్చడంతో కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ఇదే వ్యవహారంలో బాలిక గ్రామానికి చెందిన మరొకరిని అరెస్టు చేశారు.
- అనంతపురం శ్రీకంఠం సర్కిల్‌లో ఉన్న తాజ్ హోట్‌లో ఓ బాలికను పనికి పెట్టుకున్నారు. గత నెలలో హోటల్ యజమాని సయ్యద్ అలీ బాలికను ఇంటికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. వనటౌన పోలీసులు కేసు నమోదు చేసి సయ్యద్ అలీని అరెస్టు చేశారు.
- తాజాగా ఏపీపీ వసంతలక్ష్మి బాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు ప్రముఖుల ఇళ్లలో మగ్గుతున్న బాలలకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది.
Updated Date - 2023-11-18T00:57:56+05:30 IST