Polavaram project : పోలవరంపై ముందడుగెలా?
ABN, First Publish Date - 2023-11-10T03:47:47+05:30
పోలవరం ప్రాజెక్టు పనులపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. సమీక్షల మీద సమీక్షలు జరుగుతున్నాయి. కానీ పనులు ముందుకు సాగడంలేదు. పనులు చేపట్టే సీజన్ మొదలైనా కేంద్ర జలశక్తి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో నిర్మాణ పనులు
20న జరిగే విస్తృతస్థాయి సమావేశంలో చర్చ
డయాఫ్రమ్‌వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్, సీపేజీ నివారణ పనులపై సమీక్ష
దానిపై కేంద్రమంత్రి నిర్ణయం తర్వాతే పనులు ముందుకు!
అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. సమీక్షల మీద సమీక్షలు జరుగుతున్నాయి. కానీ పనులు ముందుకు సాగడంలేదు. పనులు చేపట్టే సీజన్ మొదలైనా కేంద్ర జలశక్తి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో నిర్మాణ పనులు మొదలు కాలేదు. దీంతో ఈ సీజన్ ఎలాంటి పనులు లేకుండానే ముగిసిపోనున్నది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయా ఫ్రమ్‌వాల్ మరమ్మతు లేదా సమాంతరంగా కొత్తది నిర్మించడంపై ఎలాంటి నిర్ణయాన్నీ కేంద్ర జలశక్తి తీసుకోలేదు. అదేవిధంగా ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌లో సీపేజీ కారణంగా భారీగా వస్తున్న వరదను నియంత్రించడంపైనా సాంకేతికంగా కచ్చిమైన నిర్ణయానికి కేంద్ర జలశక్తి రాలేకపోయింది. ప్రాజె క్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులో పనుల పూర్తికి అంచనా వ్యయం ఎంతో స్పష్టం కాలేదు. ప్రాజెక్టులో నిలిచిపోయిన పనులపై ఈ నెల 20న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేవర్షి ముఖర్జీ నేతృత్వంలో న్యూఢిల్లీలో సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరె శ్రీరామ్, కేంద్ర జల సంఘం, సెంట్రల్ సాయిల్ అండ్ మినరల్ రీసెర్చ్ స్టేషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూఫణ్‌కుమార్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి తదితరులు హాజరవుతారు.
సమావేశ అజెండాపై కేంద్ర జలశక్తి సీనియర్ జాయింట్ కమిషనర్ భట్ బుధవారం రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ సీపేజీని నివారించేందుకు అనుసరించాల్సిన పద్ధతిపై చర్చిస్తారు. మిగిలిన పనులకు సం బంధించి డిజైన్ రూపకల్పన ఏజెన్సీ సేవలను వినియోగించుకోవడంపైనా, ప్రాజెక్టు నిర్మాణం లో నిపుణుల సేవలను వినియోగించుకోవడంపైనా చర్చిస్తారు. ఈ ఏడాది లో చేపట్టాల్సిన పనులపైనాచర్చిస్తారు. ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లడంపై సమీక్షించి.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నివేదిక సమర్పిస్తారు. ప్రస్తుతం గజేంద్రసింగ్ షెకావత్ రాజస్థాన్ ఎన్నికల్లో తనమునకలై ఉన్నందున ఈ నివేదికపై వచ్చే నెల రెండో వారం దాకా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని జలశక్తి వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి నాటికి పోలవరం పనులపై కేంద్రం నిర్ణయం తీసుకున్నా... ఎన్నికల షెడ్యూల్ వెలువడితే పనులన్నీ ఆగిపోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2023-11-10T03:47:48+05:30 IST