ఐదోరోజూ నిరసనల హోరు
ABN, Publish Date - Dec 31 , 2023 | 03:37 AM
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం ఐదోరోజుకు చేరుకుంది.
కొనసాగిన మున్సిపల్ కార్మికుల సమ్మె
అనంతపురం క్రైం, నెల్లూరు (సిటీ), కొవ్వూరు, డిసెంబరు 30: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం ఐదోరోజుకు చేరుకుంది. అనంతపురం నగరపాలిక కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు ఆధ్వర్యంలో కార్మికులు నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య వారికి సంఘీభావం తెలిపారు. నెల్లూరులో మున్సిపల్ కార్మికులు నగరంలోని గాంధీబొమ్మ కూడలి వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అధికార దాహాంతో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మడమతిప్పే సీఎంగా జగన్ చరిత్రలో గుర్తింపు తెచ్చుకున్నారని విమర్శించారు. కావలిలో పారిశుధ్య కార్మికులు తమ చేతి పనిముట్లు చేతబట్టి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆత్మకూరులో నిరసన ర్యాలీ చేపట్టారు.
మెడకు ఉరితాళ్లతో నిరసన
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించారు. మెడకు ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న కార్మికులను పోలీసులతో కొట్టించి, కేసులు పెట్టించడం సబబు కాదన్నారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కాగా, కడప కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు మెడకు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. జమ్మలమడుగులో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. బద్వేలులో నల్ల బెలూన్లతో, మైదుకూరులో మోటరు బైకు ర్యాలీ నిర్వహించారు. రాయచోటి, రాజంపేటలో ఆందోళనలు కొనసాగాయి.
Updated Date - Dec 31 , 2023 | 03:37 AM