టెక్నికల్ వర్సిటీ.. బీఏ, బీకాం!
ABN, First Publish Date - 2022-12-16T00:43:45+05:30
అది తమిళనాడులోని తిరునెల్వేలిలోని అన్నా యూనివర్సిటీ(టెక్నాలజీ). కానీ, ఆర్ట్స్ సబ్జెక్టులైన బీఏ, బీకాం కోర్సుల్లో ఆ వర్సిటీ పేరుతో సర్టిఫికెట్లు ఉన్నాయి. అంతేకాదు.. ఆ సర్టిఫికెట్లపై ఉండే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌చేస్తే..
నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్ ఆగడాలు.. వర్సిటీల్లో లేని కోర్సులకూ డిగ్రీలు
క్యూఆర్ కోడ్ స్కాన్‌చేస్తే.. నకిలీ వర్సిటీ వెబ్‌సైట్‌లలో వివరాలు
ఆటకట్టించిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్
పలు వర్సిటీలకు చెందిన140 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం
నలుగురు నిందితులకు బేడీలు
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): అది తమిళనాడులోని తిరునెల్వేలిలోని అన్నా యూనివర్సిటీ(టెక్నాలజీ). కానీ, ఆర్ట్స్ సబ్జెక్టులైన బీఏ, బీకాం కోర్సుల్లో ఆ వర్సిటీ పేరుతో సర్టిఫికెట్లు ఉన్నాయి. అంతేకాదు.. ఆ సర్టిఫికెట్లపై ఉండే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌చేస్తే.. ఆ వర్సిటీ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో విద్యార్థి వివరాలు కూడా ప్రత్యక్షమవుతాయి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ నకిలీ సర్టిఫికెట్ల గ్యాంగ్ ఆగడాలకు ఇదో మచ్చుతునక. ఇదొక్కటే కాదు.. దేశవ్యాప్తంగా ఏ వర్సిటీ నుంచైనా.. ఏ కోర్సుకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించగలదు ఈ ముఠా..! ఈ ఘరానా ముఠా ఆటను హైదరాబాద్ దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు కట్టించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తితో కలిసి.. మధ్యమండలం డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. నాంపల్లికి చెందిన మహ్మద్ ఏతేషం ఉద్దిన్ హుస్సేన్ టోలీచౌకీలో స్టడీ ఎఫైర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్. ఇతను టోలీచౌకీలో ఓ కన్సల్టెన్సీలో పనిచేసే ఖాదర్, హిమాయత్‌నగర్‌లో కెరీర్‌వింగ్ స్టడీ కన్సల్టెన్సీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మలక్‌పేట్‌కు చెందిన మహమ్మద్ అల్తాఫ్ అహ్మద్, అంబర్‌పేటలో మీసేవ కేంద్రాన్ని నిర్వహించే మహమ్మద్ ఇమ్రాన్ కలిసి నకిలీ సర్టిఫికెట్ల ముఠాను ఏర్పాటు చేశారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి కావాల్సిన వేర్వేరు విశ్వవిద్యాలయాల డిగ్రీ సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తూ.. పెద్దమొత్తంలో సంపాదిస్తోంది. అంతేకాదు.. సర్టిఫికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేస్తే.. వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించేలా ఆయా వర్సిటీల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లను నిర్వహిస్తోంది. దీంతోపాటు.. కొన్ని వర్సిటీల కంప్యూటర్ ఆపరేటర్లకు పెద్దమొత్తంలో డబ్బు ఎర చూపుతూ.. ఆయా వర్సిటీల వెబ్‌సైట్ల విద్యార్థుల జాబితాల్లో తాము చెప్పే వ్యక్తుల పేర్లు ఉండేలా జాగ్రత్త పడుతోంది. ‘‘కొన్ని విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేయని కోర్సులకు కూడా ఈ ముఠా సర్టిఫికెట్లు తయారు చేస్తోంది. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ టెక్నికల్ కోర్సులను ఆఫర్ చేస్తుండగా.. ఆ విశ్వవిద్యాలయం పేరుతో ఈ ముఠా బీఏ, బీకాం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు గుర్తించాం’’ అని డీసీపీ వివరించారు. తమిళనాడు మొదలు సిక్కిందాకా.. ఈ ముఠా పలు వర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి, నిరుద్యోగులకు అందజేసిందని.. 30 మంది దాకా నిరుద్యోగులు నకిలీ సర్టిఫికెట్లపై విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఈ ముఠా నాంపల్లి అడ్డాగా గుట్టుచప్పుడు కాకుండా దందా నిర్వహిస్తోందని ఉప్పందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి.. నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని వివరించారు. ఈ ముఠా నుంచి 140 నకిలీ సర్టిఫికెట్లు, ఒక కంప్యూటర్, ఒక కలర్ ప్రింటర్, సెల్‌ఫోన్‌లు, రూ.22 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-12-16T00:43:46+05:30 IST