ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Corona: కరోనా@4 ఏళ్లు.. కన్నీళ్లు పెట్టించిన ఈ విషయాలు మీకు గుర్తున్నాయా?..

ABN, First Publish Date - 2022-12-02T18:23:40+05:30

మూడేళ్లు గడిచినా చైనాలో ఇంకా కరోనా కలవరం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మూడేళ్లలో ప్రపంచంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిందో ఓ లుక్కేద్దాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మహమ్మారి (Corona Pandamic) ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని అనారోగ్యానికి గురిచేసింది. సుమారు 60 లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టింది. అంతటి తీవ్రదుష్ప్రభావాన్ని చూపిన ఈ వైరస్‌ (Corona Virus) సరిగ్గా మూడేళ్లక్రితం చైనాలోని (China) వూహాన్‌లో వెలుగుచూసింది. కరోనాతో ప్రభావితమైన మొదటి వ్యక్తి అనారోగ్యానికి గురయ్యి డిసెంబర్ 1, 2022తో మూడేళ్లు పూర్తయ్యి నాలుగవ ఏడాదిలోకి ప్రవేశించినట్టయ్యింది. డిసెంబర్ 2019 ఆరంభంలోనే వూహాన్‌లో చాలామందికి వైరస్ వ్యాపించినా అప్పటికింకా వైరస్‌ను గుర్తించలేదు. వందలాది న్యూమోనియా కేసులకు కారణం ఏంటో తెలియక వైద్యులు గందరగోళానికి గురయ్యారు. అందుకే ప్రజలను అప్రమత్తం చేయలేదు. కొత్త సంవత్సరం వేడుకలు మొదలయ్యే దాకా వైరస్‌ను గుర్తించలేదు. కానీ కరోనా వైరస్ (Corona Virus) కారణంగా మొదటి వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడని తెలిశాక ప్రపంచమంతా ఉలిక్కిపడింది. అప్పటికే వైరల్ వ్యాప్తి జరిగిపోయింది. 2020 ఆరంభం నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రదేశం.. ఒక దేశం నుంచి ఇంకో దేశం... ఇలా సరిహద్దులనేవే లేకుండా స్వల్ప వ్యవధిలోనే భూమిపై ఉన్న అన్నిదేశాలను తన గుప్పిట్లోకి తీసుకుంది. ఆరోగ్యాలను దెబ్బతీసి.. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టేసింది. జనవరి 1, 2020న తొలి మరణం నమోదు కాగా.. మార్చి 2022 నాటికి 60 మంది చనిపోయి ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే అనధికారికంగా 16 -29 మిలియన్ల మంది చనిపోయి ఉంటారనే అంచనాలున్నాయి. మూడేళ్లు గడిచినా చైనాలో ఇంకా కరోనా కలవరం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మూడేళ్లలో ప్రపంచంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిందో ఓ లుక్కేద్దాం..

ఆర్థిక వ్యవస్థలు ఛిద్రం..

కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిదిమేసింది. ఒక్కసారిగా పడిపోయిన దేశీయోత్పత్తి, డిమాండ్ లేమి ఫలితంగా ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు స్థంభించిపోయాయి. ఆంక్షలు, నిబంధనలు, లాక్‌డౌన్‌ల ఫలితంగా రవాణా వ్యవస్థ ఆగిపోయింది. ఫలితంగా ఎగుమతులు-దిగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వీటన్నింటి ఫలితంగా ఆర్థిక మహాసంక్షోభాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో గ్లోబల్ ఫైనాన్సియల్ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. లక్షలాది కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు పెట్టుబడులు, కొత్త కంపెనీల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు భయపడిపోయారు. ఈ ప్రభావం కొన్ని తరాల వరకు ఉండొచ్చనే అంచనాలున్నాయి.

కుటుంబాలు కకావికలం..

కొవిడ్ దెబ్బకు లెక్కలేనన్ని కుటుంబాలు కకావికలమయ్యాయి. అయినవారు, ఆప్తులను కోల్పోయినవారు లెక్కకు మించివున్నారు. కుటుంబ సభ్యుడు కళ్లెదుటే ప్రాణాలు విడుస్తున్నా నిస్సహాయ స్థితిలో నిలిచినవారెందరో ఉన్నారు. అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు లెక్కకు మించి ఉన్నారు. ఇక వైద్యానికి డబ్బుల్లేక.. డబ్బులున్నా వైద్యం దొరక్క రక్తసంబంధీకులను నష్టపోయినవారి సంఖ్య తక్కువేం లేదు. మొత్తంగా తీవ్ర ఆరోగ్య సంక్షోభం ప్రభావంతో కుటుంబాలు కుదుపునకు గురయ్యాయి. వ్యక్తిగతంగా ఎంతోమందిపై ఆదాయ, విద్య, ఉపాధి, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పిల్లలపైనా కరోనా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిన మాట జగమెరిగిన సత్యం. ఆరుబయట స్వేచ్ఛగా ఆడుకోవాల్సిన పిలగాళ్లు దాదాపు రెండేళ్లపాటు ఇంటినే ప్రపంచంగా చూడాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఆ పసిహృదయాలపై గట్టిగానే పడిందని ఎన్నో రిపోర్టులు నొక్కి చెప్పాయి. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోని లేని పేద, గ్రామీణ పిల్లలు ఎంతో మంది విద్యకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

లాక్‌డౌన్- వలసజీవి కంటతడి..

కరోనా కట్టుడికి విధించిన లాక్‌డౌన్.. ఆ తర్వాతి పరిస్థితులు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అకస్మాత్తుగా చేసిన ప్రకటనతో కార్మికలోకం కన్నీళ్లు పెట్టింది. వలసకార్మికులను కష్టాల కడలిలోకి నెట్టేసింది. తిండీతిప్పలు లేకుండా కాలిబాటన ఎంతోమంది సొంతూళ్లకు వెళ్లిన దృష్ట్యాలు కన్నీళ్లు పెట్టించాయి. పిల్లలు, గర్భణి స్త్రీలు అనే తేడా లేకుండా ఎంతోమంది రహదారులపై రాత్రింబవళ్లు నడిచి సొంతూళ్లకు చేరుకున్నారు. వలసజీవుల్లో ఒకరైన బిహార్ బాలిక తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించి సొంతూరికి చేరుకున్న తీరు దేశాన్ని మెలిపెట్టిన విషయం విధితమే. ఇక అవే రోడ్ల వెంట ఎందరో ప్రాణాలు విడిచారు. కంపెనీలు, పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడడంతో భారత్‌లో కోట్లాది మంది కార్మికులు ఉపాధి దూరమయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.

ఉద్యోగాల కోత- రోడ్డునపడ్డ వైనం...

కరోనా మహమ్మారి దుష్ప్రభావంతో ప్రపంచమంతా నిరుద్యోగ మహాసంక్షోభాన్ని చవిచూడాల్సి వచ్చింది. నష్టాల భయంతో వేలాది కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా, అర్ధాంతరంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఫలితంగా లక్షలాది మంది వేతనజీవులు, వారి కుటుంబాలు దిక్కూమొక్కూ లేక రోడ్డునపడ్డాయి. ఈ అధ్వాన పరిస్థితికి భారతేమీ మినహాయింపు కాదు. భారత్‌లో కోట్లాది మంది కార్మికులు వీధినపడ్డారు. పిల్లాపాపలతో పస్తులు పడుకున్న సామాన్య కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబంధించి మీడియాలో వెలువడిన మానవీయ కథనాలు కన్నీళ్లు పెట్టించింది. కాగా కరోనా పర్యవసనంగా సమాజంలో అసమానతలు ఎక్కువయ్యాయి. పేదరికం మరోసారి రెక్కలు విధిల్చింది. ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి సంపన్నుల సంపద కరోనా సమయంలో ఏవిధంగా వృద్ధి చెందిందో తెలిసిన విషయమే.

వెల్లివిరిసిన మానవత్వం- దాతృత్వం..

కరోనా కష్టకాలంలో కొందరు తమ దాతృత్వ గుణాన్ని చాటుకుని రియల్ హీరోలుగా నిలిచారు. దానధర్మాలకు ఎంతోమంది ముందుకొచ్చారు. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, సినిమాతో ఇతర రంగాలకు చెందిన వారెందరూ తమకు చేతనైన సాయంతో పెద్దమనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడ్డారు. ముఖ్యంగా నటుడు సోనూ సూద్‌తోపాటు పలువురు పారిశ్రామిక, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున సాయాలు ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్‌కు కోట్లాది రూపాయలు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆరోగ్య వ్యవస్థలో డొల్ల - ఆదరాబాదరాగా వ్యాక్సిన్లు

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆరోగ్య వ్యవస్థల్లో డొల్లతనం బయటపడింది. కరోనా చికిత్సకు వైద్యసదుపాయాలు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఒకానొక స్థితిలో ఆక్సిజన్ దొరక్క వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు. వైద్యసిబ్బంది తీవ్ర కొరత వేధించింది. అంతటి ఇబ్బందుల్లోనూ డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ పోరాడడం దేశానికి ఒకింత ఉపశమనాన్ని ఇచ్చింది. ఇక అత్యవసర పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్లను ఆదరాబాదరాగా రూపొందించాల్సి వచ్చింది. పూర్తిస్థాయి ట్రయల్స్ ముగియకుండానే వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. దీనికి తగ్గట్టే ఎంతోమందిలో కొవిడ్ వ్యాక్సిన్ల సైడ్‌ఎఫెక్టులు కనిపించిన విషయం తెలిసింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీలోనూ అసమానతలు కనిపించాయి. ధనిక దేశాల్లో ముందుగా వ్యాక్సినేషన్లు జరగడం.. వెనుకబడిన దేశాలపై వివక్ష చూపించడంపై అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.

కొవిడ్ తెచ్చిన పెనుమార్పులు..

కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పెనుమార్పులకు దారితీసింది. ప్రపంచాన్నే తలకిందులు చేసినంత ప్రభావాన్ని చూపింది. మనిషి జీవితంలో సమస్తం ప్రభావితమయ్యాయని చెప్పక తప్పదు. జీవన విధానం, ఆలోచనా వైఖరి, తినే తిండి, పనిప్రదేశం ఇలా అన్నింటిలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైద్యరంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మరోవైపు ఆరోగ్యంపై చాలామందిలో అవగాహన కలిగింది. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు. కొంతమందైతే కరోనా తగ్గుముఖం పట్టినా మాస్కును తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. ఇక భారత్‌లో డిజిటల్ పేమెంట్లు, ఆన్‌లైన్ లావాదేవీలు ఊహించని స్థాయిలో వృద్ధి చెందాయి. యూపీఐ పేమెంట్లు వినియోగం బాగా పెరిగింది. అనేక ఫిన్‌టెక్ కంపెనీలు ఆవిర్భవించాయి. ఈ పరిణామాలు డిజిటల్ ఎకానమీ ఎదుగుదలకు ఎంతగానో ఉపకరించాయి. మరోవైపు విద్యారంగంలో డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. కరోనా సమయంలో చాలా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించారు. కరోనా తగ్గుముఖం పట్టాక ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై ఆధారపడే వారి సంఖ్య తగ్గినా.. డిజిటల్ ఎడ్యుకేషన్ వ్యాల్యూ మాత్రం పెరిగింది. ఇక డిజిటల్ ఎకానమీ, వర్క్ ఫ్రం హోం, టెలీమెడిసిన్, డెలివరీ సర్వీసులు, సప్లయి చెయిన్ వ్యవస్థల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-02T18:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising