Jan Aakrosh Yatra: బీజేపీ యూటర్న్
ABN, First Publish Date - 2022-12-23T14:13:19+05:30
దేశంలో కొత్త ఒమైక్రాన్ వైరస్ బయటపడటంతో 'జన్ ఆక్రోష్ యాత్ర'ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన బీజేపీ రాజస్థాన్ యూనిట్ కొద్ది గంటలకే ..
జైపూర్: దేశంలో కొత్త ఒమైక్రాన్ వైరస్ బయటపడటంతో 'జన్ ఆక్రోష్ యాత్ర' (Jan Aakrosh Yatra)ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన బీజేపీ (Bjp) రాజస్థాన్ యూనిట్ కొద్ది గంటలకే యూటర్న్ (U-turn) తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వయిజరీ జారీచేసేంత వరకూ యాత్ర కొనసాగిస్తామని తాజాగా ప్రకటించింది. యాత్ర కొనసాగిస్తూనే అవిసరమైన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటామని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీష్ పూనియా ఒక ట్వీట్‌లో తెలిపారు. దీనికి కొద్ది గంటలకు ముందే ఆయన గ్లోబల్ కోవిడ్ పరిస్థితి దృష్ట్యా యాత్రను రద్దు చేస్తునట్టు ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అవకతవకల పాలన, జంగిల్ రాజ్, అవినీతికి వ్యతిరేకంగా తాము చేపట్టిన జన్ ఆక్రోష్ యాత్రకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందని, కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని యాత్రను రద్దు చేస్తున్నామని పూనియా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత యాత్ర కొనసాగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో కొంత సందిగ్ధ పరిస్థితి తలెత్తింది. దీనిపై ఆయన మరోసారి వివరణ ఇస్తూ, ఇప్పటికే ప్రతిపాదిత యాత్ర డిసెంబర్ 14వ తేదీతో పూర్తయిందని, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వయిజరీ జారీ చేసేంత వరకూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ యాత్రను కొనసాగించనున్నామని చెప్పారు.
కాంగ్రెస్ ఎద్దేవా...
కాగా, జన్ ఆక్రోష్ యాత్రను తొలుత రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీ యాత్ర మొదటి రోజే విఫలమైందని, జనం లేక కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని, ఉన్న పరువు కూడా పోతుందనే భయంతోనే ఇప్పుడు యాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందని రాజస్థాన్ పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ అన్నారు. 2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ ఈ యాత్ర చేపట్టింది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉన్నాయి.
Updated Date - 2022-12-23T14:23:53+05:30 IST