ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bills for works are pending: మాకొద్దు బాబోయ్‌

ABN, First Publish Date - 2022-10-28T02:59:31+05:30

వైసీపీ సర్కారు ‘గడప గడపకు కార్యక్రమం’ పనులు చేపట్టేందుకు అవకాశం ఇచ్చినా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ‘మాకొద్దు బాబోయ్‌’ అంటూ మొహం చాటేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండింగ్‌ దెబ్బకు హడల్‌

‘గడప గడపకు’ పనులపై వైసీపీ కేడర్‌ విముఖత

ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షలు మంజూరు

పనులు చేస్తే బిల్లులు రావని కార్యకర్తల సందేహం

ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు పెండింగ్‌

ముందుకుసాగని సచివాలయ భవనాలు,

హెల్త్‌క్లినిక్‌లు, ఆర్బీకే నిర్మాణ పనులు

‘చదును’ పనుల బిల్లుల పరిస్థితీ అంతే

ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన వైనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సాధారణంగా చిన్నచిన్న కాంట్రాక్టు పనులు దక్కించుకునేందుకు ఎగబడుతుంటారు. తమకు తెలిసిన నాయకులతో పైరవీలు చేయిస్తుంటారు. అయితే వైసీపీ సర్కారు ‘గడప గడపకు కార్యక్రమం’ పనులు చేపట్టేందుకు అవకాశం ఇచ్చినా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ‘మాకొద్దు బాబోయ్‌’ అంటూ మొహం చాటేస్తున్నారు. పనులు చేసినా సకాలంలో బిల్లులు రావన్న ఆందోళనే ఇందుకు కారణం. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా భవనాలు, జగనన్న కాలనీల చదును పనులు చేపట్టిన వైసీపీ కార్యకర్తలు బిల్లులు రాక నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు గడప, గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి స్థానికులు తీసుకొచ్చే సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి నిధులు మంజూరు చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆ పనులు మంజూరు చేసేందుకు కలెక్టర్లకు అధికారమిచ్చారు. ఏయే పనులు చేయవచ్చన్న విషయంపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. ఆయా సచివాలయాల పరిధిలో పనులు చేసుకునేందుకు నిబంధనలు సరళతరం చేశారు. నామినేషన్‌ పద్ధతిలో చేపట్టేందుకు వీలు కల్పించారు. వైసీపీ స్థానిక నేతలకు, కార్యకర్తలకు ఈ పనులు దక్కించుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ పనులు చేపట్టేందుకు మాత్రం సొంత కేడర్‌ ముందుకు రావడం లేదు.

పెండింగ్‌లో బిల్లులు

వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటి భవనాల నిర్మాణాలను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని శ్రీకారం చుట్టింది. ఈ పనులు మంజూరు చేసినా చేపట్టేందుకు మొదట్లో ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని స్థానిక నేతలను ఒప్పించి కొన్ని పనులు ప్రారంభించారు. సచివాలయ భవనాలతో పాటు వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను చేపట్టాలంటూ కొంతకాలం తర్వాత భారీగా పనులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం సిమెంట్‌ సరఫరా చేస్తుందని చెప్పి, పలుచోట్ల పనులు చేపట్టేందుకు పోత్సహించారు. అయితే పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు సిమెంట్‌ అమ్ముకుని పనులు నిలిపేశారు. కొన్నిచోట్ల సచివాలయ భవనాలు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నా బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ఇంజనీర్ల ఒత్తిడితో కలెక్టర్లు చొరవ తీసుకుని ఒకటి రెండు నెలలు బిల్లులిచ్చినా ఆ తర్వాత బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో పనులు నిలిచిపోవడమే కాకుండా కొన్నిచోట్ల వర్షానికి తడిసి సిమెంట్‌ పనికిరాకుండా పోయింది.

‘చదును’ బిల్లులూ అంతే

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ శివార్లలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉపాధి నిధులతో భూమిని చదును చేసే పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి పథకం కింద అడ్డగోలుగా పనులు ప్రారంభించారు. రూ.1000 కోట్లకు పైగా ఉపాధి నిధులు వ్యయం చేశారు. పనులు చేపట్టిన మొదట్లో బిల్లులు విడుదల చేశారు. ఆ తర్వాత బిల్లులను నిలిపేశారు. చివరకు హౌసింగ్‌ విభాగం ద్వారా చెల్లిస్తారని మొహం చాటేశారు. దీంతో ఈ పనులు చేపట్టిన వైసీపీ కార్యకర్తలు బిల్లుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎవరిని అడగాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను అడిగితే ఈ విషయం మాత్రం తమను అడగొద్దని తెగేసి చెప్పారు. దీంతో ఇప్పుడు పనులు చేపట్టాలని ఎమ్మెల్యేలు కార్యకర్తలను పురమాయించే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు.

బిల్లులు రాక ఆత్మహత్యలు

గత ప్రభుత్వంలో పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత బిల్లులివ్వకుండా నిలిపేశారు. దీంతో మాజీ సర్పంచ్‌లు బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పటికీ 20 శాతానికి పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పటి ఎమ్మెల్యేల గ్రాంట్‌తో చేపట్టిన పనులకు ఒక్కపైసా విడుదల చేయలేదు. దీనిపై ఇప్పటికీ కోర్టులు చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడంతో పలువురు మాజీ సర్పంచ్‌లు, చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

రోడ్డెక్కిన ఇంజనీర్లు...

గ్రామాల్లో చేపడుతున్న వివిధ రకాల నిర్మాణాలకు బిల్లులివ్వకుండానే... పనులు చేయించాలంటూ కలెక్టర్లు ఒత్తిడి తెస్తుండటంతో ఇంజనీర్లు నిరసన బాట పట్టారు. పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు ఈ ఒత్తిడి భరించలేక ఈ నెల 13 నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Updated Date - 2022-10-28T02:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising