ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ration Mafia : బొక్కేస్తున్నారు

ABN, First Publish Date - 2022-11-05T04:21:59+05:30

లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా గురించి వినుంటారు. ఇప్పుడు రేషన్‌ మాఫియా వచ్చింది. రకరకాల మార్గాల్లో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలే ..

Ration Mafia
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేదల బియ్యం గద్దల పాలు.. రెచ్చిపోతున్న రేషన్‌ మాఫియా!

అధికార పార్టీ నేతల అండదండలు

కొన్నిచోట్ల అమాత్యులకు ఆమ్యామ్యాలు

ప్రతినెలా 1.5 లక్షల టన్నుల బియ్యం

అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలింపు

ఎండీయూ వాహనాల్లోనే రవాణా

గోదాముల్లో వేల టన్నులు మాయం

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోనూ అక్రమాలు

పాలిష్‌ చేసి మళ్లీ బహిరంగ మార్కెట్‌కు

పోర్టుల ద్వారా విదేశాలకూ ఎగుమతి

ప్రతినెలా రూ.కోట్లలో అక్రమార్జన

‘పేదలకు నాణ్యమైన రేషన్‌ బియ్యాన్ని ఇంటి దగ్గరకే సరఫరా చేస్తాం’.. వైసీపీ సర్కార్‌ చెప్పిన గొప్పలు ఇవి. వాస్తవమేంటంటే.. ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని చాలా మంది తీసుకోవడం లేదు. ప్రభుత్వం సమకూర్చిన ఎండీయూ వాహనాల్లోనే అక్రమంగా తరలిపోతోంది. కొన్నిచోట్ల గోదాముల్లో రేషన్‌ మాయమవుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తరుగు బియ్యానిదీ ఇదే పరిస్థితి.

రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. రకరకాల మార్గాల్లో బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకుంటోంది. విదేశాలకూ అక్రమంగా రవాణా చేస్తోంది. కొందరు అధికార పార్టీ నేతల అండదండలతో యథేచ్ఛగా దోపిడీ చేస్తోంది.

ప్రభుత్వం మార్కెట్‌లో కిలో రూ.35కు బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకు రూపాయికి ఇస్తోంది. కార్డుదారుల నుంచి అక్రమార్కులు ఆ బియ్యాన్ని కిలో రూ.7కు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు, మాఫియాకు కిలో రూ.15కు అమ్ముకుంటున్నారు. రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేయించి మళ్లీ బహిరంగ మార్కెట్లో బ్రాండెడ్‌ బియ్యం పేరుతో కిలో రూ.40-50 వరకు విక్రయిస్తున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా గురించి వినుంటారు. ఇప్పుడు రేషన్‌ మాఫియా వచ్చింది. రకరకాల మార్గాల్లో పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలే అక్రమార్కులుగా మారారు. మరికొన్ని చోట్ల నెలనెలా కమీషన్‌ తీసుకుంటూ మాఫియాకు అండదండలు అందిస్తున్నారు. అక్కడక్కడా మంత్రులకు కూడా ముడుపులు అందుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంకేముంది.. రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. రేషన్‌ బియ్యాన్ని భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తూ కోట్లకు పడగలెత్తుతోంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న కిలో రూపాయి రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. వేలాది టన్నుల బియ్యాన్ని ఏకంగా గోదాముల నుంచే తరలించుకుపోతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని పౌరసరఫరాల గోదాము నుంచి 1,000 టన్నులకు పైగా రేషన్‌ బియ్యం, 20 టన్నుల కందిపప్పు, రెండున్నర టన్నుల చక్కెర, 250 లీటర్ల పామాయిల్‌ను అక్రమంగా తరలించుకుపోయిన వైనం ఇటీవల వెలుగు చూసింది.

ఇంత భారీ స్కాం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే రేషన్‌ మాఫియా లారీలో బియ్యాన్ని తరలిస్తుండగా.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్‌బాబు వెళ్లి అడ్డుకోవడంతో అక్రమార్కులు పరారయ్యారు. కడప, చిత్తూరు జిల్లాల నుంచి కూడా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. ఇలా రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతల అండదండలతో రేషన్‌ మాఫియా చెలరేగిపోతోంది. దీనికి సివిల్‌ సప్లయిస్‌ అధికారుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలూ లేకపోలేదు.

మూడొంతుల బియ్యం వెనక్కి...

రాష్ట్రంలో మొత్తం కోటీ 45 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. దాదాపు 4.5 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతినెలా ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఇంటి వద్దకే నాణ్యమైన బియ్య సరఫరా చేస్తామని జగన్‌ సర్కారు గొప్పలు చెప్పింది. అయితే, నాసిరకం బియ్యం సరఫరా చేయడంతో చాలామంది పేదలు తీసుకోవడం లేదు. కార్డుదారుల్లో మూడొంతుల మందికి పైగా బియ్యాన్ని ఎండీయూ వాహనాల నిర్వాహకులకే కిలో రూ.7కు తిరిగి అమ్మేస్తున్నారు. ఎండీయూ వాహన నిర్మాహకులు ఆ బియ్యాన్ని అవే వాహనాల్లో తీసుకెళ్లి ప్రైవేటు వ్యాపారులకు, మాఫియాకు కిలో రూ.15కు అమ్ముకుంటున్నారు. రేషన్‌ మాఫియాకు ప్రభుత్వ వాహనాలే అడ్డాగా మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా దాదాపు 1.5 లక్షల టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతోంది.

బియ్యం సేకరణకు నెట్‌వర్క్‌

రేషన్‌ బియ్యాన్ని భారీ స్థాయిలో సేకరించేందుకు మాఫియా ప్రత్యేక సిబ్బందిని నియమించుకుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నెట్‌వర్క్‌ విస్తరించింది. సేకరించిన చౌక బియ్యాన్ని ఎక్కడికక్కడ రహస్యంగా గోడౌన్లలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ప్రైవేటు వ్యాపారులకు, రైస్‌ మిల్లులకు కిలో రూ.15 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మిల్లర్లు రేషన్‌ బియ్యాన్ని మరోసారి మర పట్టించి, పాలిష్‌ చేయిస్తున్నారు. వాటినే బ్రాండెడ్‌ బియ్యంగా బహిరంగ మార్కెట్లో కిలో రూ.40 నుంచి 50 వరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు పోర్టుల ద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాలకు రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి ప్రతినెలా 2 వేల టన్నులకు పైగా రేషన్‌ బియ్యాన్ని నౌకల ద్వారా ఆఫ్రికా తదితర దేశాలకు తరలిస్తున్నారని ప్రభుత్వ అధికారులు సైతం ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

స్టాక్‌ పాయింట్లలోనూ అక్రమాలు

ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా ఉన్న మండల స్థాయి స్టాక్‌ పాయింట్లు కూడా అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు 200కు పైగా ఉన్నాయి. ఈ పాయింట్ల నుంచే 29,791 రేషన్‌ షాపుల డీలర్లు బియ్యాన్ని తీసుకువెళతారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో డీలర్లకు కాటా వేసి బియ్యాన్ని ఇవ్వకుండా, 50 కేజీల బస్తాలను తరలిస్తున్నారు. రేషన్‌ షాపులకు చేరాక ఒక్కో బస్తాలో 2 నుంచి 3 కేజీలు తరుగు వస్తున్నాయని డీలర్లు ఫిర్యాదు చేస్తున్నారు. డీలర్లు ప్రతి నెలా 2 నుంచి 3 క్వింటాలు బియ్యం నష్టపోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో తరుగు రూపంలో మిగిలిపోతున్న 90 వేల క్వింటాళ్ల రేషన్‌ను అక్రమంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని చెబుతున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో పనిచేస్తున్న గోడౌన్‌ ఇన్‌చార్జీలు, కిందిస్థాయి ఉద్యోగులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. గత ఏడాది కాలంలో కృష్ణా జిల్లా కైకలూరు, గుంటూరు టౌన్‌, విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపళ్లె, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని మరికొన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి కోట్లాది రూపాయల విలువైన రేషన్‌ మాయమైన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. పైఅధికారులు తనిఖీలు చేస్తున్నా రాత్రికి రాత్రే వందల టన్నుల రేషన్‌ తరలిపోతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, గోడౌన్లలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రతి ఏటా బదిలీ చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ.. ఏళ్ల తరబడి పాతుకుపోయారు.

అధికారులకు తెలిసినా...

రేషన్‌ అక్రమ రవాణా గురించి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులు, నిఘా వర్గాలకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ రవాణా వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రేషన్‌ మాఫియా నుంచి పోలీసులు, నిఘా అధికారులు మామూళ్లు వసూలు చేస్తూ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వరకు ముడుపులు చేరిపోతుండటంతో అక్రమ రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతోంది. రేషన్‌ మాఫియా మంత్రులకు వాటాలు ఇవ్వని చోట్ల మాత్రం విజిలెన్స్‌ దాడులు జరుగుతున్నాయి.

అడ్డొస్తే... అంతమే?

ఇంతకుముందు కూడా రేషన్‌ అక్రమ రవాణా సాగేది. చౌక డిపోల డీలర్లు, దళారులు రేషన్‌ కార్డుదారుల నుంచి కిలోల లెక్కన సేకరించి, కొన్ని క్వింటాళ్లు అమ్ముకునేవారు. అప్పుడు చాటుమాటుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్రమ రవాణాకు అడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా రేషన్‌ మాఫియా వెనకాడటం లేదు. ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన ఓ బియ్యం వ్యాపారి హత్య వెనుక రేషన్‌ మాఫియా హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో మాఫియా సాగిస్తున్న అక్రమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడనే కారణంతోనే హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి.

Updated Date - 2022-11-05T04:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising