Bachula Arjunudu: బీసీలకు జగన్ చేస్తున్న మోసం మాటల్లో చెప్పలేనిది
ABN, First Publish Date - 2022-12-16T13:36:48+05:30
బీసీలకు జగన్ రెడ్డి చేస్తున్నమోసం మాటల్లో చెప్పలేనిదని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు.
అమరావతి: బీసీలకు జగన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) చేస్తున్నమోసం మాటల్లో చెప్పలేనిదని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (TDP MLC Bachula Arjunudu) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బీసీల సంక్షేమంపై జగన్ పిట్టలదొర వేషాలేస్తున్నారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లు వేసి రెండేళ్లైనా ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలారని యెద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government) బీసీ ఫెడరేషన్లతో అన్నికులాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించిందని గుర్తుచేశారు. బీసీల సంక్షేమం వారి ఆర్థికాభివృద్ధికి తన ప్రభుత్వం ఎన్నివేలకోట్లు వెచ్చించిందో పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగల దైర్యం జగన్ రెడ్డికి ఉందాని ఆయన ప్రశ్నించారు.
బీసీల సంక్షేమంపై నోరుతెరిస్తే అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి... వారికేం చేశాడని శ్వేతపత్రం విడుదల చేస్తారని నిలదీశారు. చంద్రబాబు ఇచ్చిన రూ.34వేలకోట్ల బీసీ సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయో సమాధానం చెప్పు జగన్ రెడ్డి అని అన్నారు. బీసీ రిజర్వేషన్లు 10శాతం తగ్గించి 16,800 పదవులను వారికి దూరం చేసింది జగన్ రెడ్డే అని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాలు టీడీపీ పక్షాన ఉండటాన్ని చూసి ఓర్వలేకే జగన్ వారి పథకాలు రద్దు చేసి రోడ్డున పడేశారని బచ్చుల అర్జునుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Updated Date - 2022-12-16T13:36:49+05:30 IST