Sattenapalle: టీడీపీలో ముసలం.. రాజీనామా యోచనలో ముఖ్య నేతలు
ABN, First Publish Date - 2022-11-30T12:52:00+05:30
సత్తెనపల్లి టీడీపీ(TDP)లో చెలరేగిన ముసలం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మండల అధ్యక్షుల నియామకం పార్టీలో విభేదాలు తెచ్చిపెట్టాయి
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీ(TDP)లో చెలరేగిన ముసలం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మండల అధ్యక్షుల నియామకం పార్టీలో విభేదాలు తెచ్చిపెట్టాయి. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ‘‘రాష్ట్రానికి-ఇదేం ఖర్మ’’ కార్యక్రమంతో 50 రోజుల పాటు ప్రజల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అధినేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ తరుణంలో సత్తెనపల్లి టీడీపీ మండల అధ్యక్షుల నియామకం కాకరేపింది. పార్టీలో పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మండల అధ్యక్షుల అసంతృప్తి అలజడి రేపింది. దీంతో మూకుమ్మడి రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్‌లో అసమ్మతి నేతలంతా సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఐదు మండలాల ముఖ్య నేతలంతా హాజరయ్యారు. చంద్రబాబును కలిసి వాస్తవాలను వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అప్పగించిన పార్టీ పదవులన్నీ రద్దు చేయాలని అల్టీమేటం విధించారు. రద్దు చేయకపోతే మాత్రం మూకుమ్మడి రాజీనామా చేయాలని ఐదు మండలాల ముఖ్యనేతలు నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Updated Date - 2022-11-30T12:52:01+05:30 IST